- జనవరి 1 నుంచి కొత్త రూల్స్
- వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి
- ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల దగ్గర ఎలక్ట్రానిక్ పద్దతిలో టోల్ ఫీజు వసూలు చేసేందుకు జనవరి 1నుంచి వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టోల్ గేట్ నుంచి వెళ్లే ప్రతీ వాహనానికి ఇక ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫాస్ట్ ట్యాగ్ లకు డిమాండ్ అమాంతం గిరాకీ పెరిగిపోయింది. ఫాస్ట్ ట్యాగ్‌ను ఎక్కడైనా కొనే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. పలు జాతీయ బ్యాంకులు, నేషనల్ హైవే టోల్ ప్లాజాలు, ఆర్‌టీఓలు, ట్రాన్స్‌పోర్ట్ హబ్స్, ఎంపిక చేసిన పెట్రోల్ బంకులు, వ్యాలెట్ సర్వీసులు అందించే సంస్థల నుంచి ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేసే వీలుంది.
ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే భారీ వడ్డన:
ఫాస్ట్ ట్యాగ్ లేకుండా.. ఫాస్ట్ ట్యాగ్ లైనులోకి ప్రవేశించిన వాహనాలకు ఇక నుంచి రెట్టింపు టోల్ ఫీజు వసూలు చేయనున్నారు. చెల్లుబాటులేని లేదా సరిగా కనిపించని ఫాస్ట్ ట్యాగ్ తో ఫాస్ట్ ట్యాగ్ లైనులోకి ప్రవేశించిన వాహనాలకు రెండు రెట్ల అధిక టోల్ విధించనున్నట్లు రోడ్లు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
క్యూలైన్లకు స్వస్తి:
ఇక ఫాస్ట్ ట్యాగ్ అమలుతో టోల్ గేట్ల దగ్గర బారీగా వాహనాలు నిలిచే అవకాశం ఉండదు. దీంతో వాహనదారులకు మరింత సమయం, ఇంధనం ఆదా కానున్నాయి. టోల్ ఫీజు వాహనదారుడి ఖాతా నుంచి ఆటోమేటిక్ గా కట్ అవుతాయి.