విద్య ఉద్యోగ అవగాహన సదస్సులో కెరీర్ గైడెన్స్ నిపుణులు సంగనభట్ల దివాకర్
10వ తరగతి వరకు విద్యావిధానం మూసగా ఉంటుందని, మెడిసిన్, ఐఐటీ లాంటి ఉన్నత లక్ష్యాలు కలిగిన విద్యార్థులు అవగాహనతో కూడిన విద్యను అభ్యసించాలని, ప్రపంచంలో అన్నిటికంటే చదువుకోవడమే తేలికని, అటువంటి చదువుని ఎప్పుడూ భారంగా భావించకూడదని తెలిపారు. ఎప్పుడూ ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, గాలిలో మేడలు కట్టాలని, శ్రమించి ఆ మేడలకు పునాదులు నిర్మించాలన్నారు. విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని సాధించడానికి బర్నింగ్ డిజైర్ కల్గి ఉండాలని, తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చేలా కృషి చేయాలన్నారు.
ఇది చదవండి: ఉద్యోగ రంగంలో అన్యాయాలపై సుదీర్ఘ పోరాటాలు
ప్రముఖ కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ మరియు LIC డెవలప్మెంట్ ఆఫీసర్ సంగనభట్ల దివాకర్ (నరహరి రావు) గణతంత్ర దినోత్సవం రోజున, ధర్మపురి బ్రాహ్మణ సంఘ భవనంలో విద్యార్థులకు, యువతకు విద్య ఉద్యోగ అవకాశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బీహార్ లోని పట్వటోలి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు స్వయంకృషితో ప్రతి సంవత్సరం 20 వరకు ఐఐటీ సీట్లు పొందుతున్నారని, ఆ గ్రామం ఐఐటీ గ్రామంగా ఖ్యాతి పొందిందని, అలాగే ఐఐటీ ఆనంద్ కుమార్ నిర్వహించే సూపర్ 30 గురించి తెలిపిన అంశాలు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చాయి. దేశంలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లో సుమారు 50822 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయని, వాటిని సాధించాలంటే నిర్విరామ కృషి చేయాలన్నారు.
హైదరాబాద్ మరో జీనోమ్ వ్యాలీ లక్షల్లో సాఫ్ట్ వేర్, ఫార్మా ఉద్యోగాలు:
మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు అవసరం అవుతున్నారని, ఈ విషయంలో హైదరాబాద్ ఎంతో పురోగతి సాధిస్తున్నదని, అటువంటి ఉద్యోగాలు పొందడానికి కావాల్సిన నైపుణ్యాలను చదువుతో పాటే మెరుగుపరుచుకోవాలని సూచించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ అగ్రగామి సంస్థల సీఈఓ లు మన వారేనని, వారి నుండి స్ఫూర్తిని పొందాలన్నారు. ఇంజినీరింగ్ ఉద్యోగాలే కాకుండా ఇంకా టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్నాయని తెలిపారు. మన దేశంలో 2019 సంవత్సరం లో సుమారు 7.22 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 2020 సంవత్సరంలో 4.23 లక్షల ఉద్యోగులు నియామకాలు పొందారని, 2021లో ఇప్పటి వరకు సుమారు 50 వేల వరకు ఉద్యోగాలు ప్రకటించారని అంకెలతో సహా వివరించారు.
ఇది చదవండి: టీవీ చానల్ ఉద్యోగులమంటూ మోసం, ఇద్దరు విద్యార్థుల అరెస్టు
విజయానికి ఏది అడ్డు కాదు:
చాలా మంది కష్టపడటం చాతకాక, అపజయాలకు కారణాలు వెతుక్కుంటారని, ఎంతోమంది గొప్ప వాళ్ళు చాలా పేదరికం నుండే వచ్చారని, జీవితంలో విజయం సాధించడానికి ఏది అడ్డు కాదని, నిరంతరం సాధించాలన్న తపన ఉండాలన్నారు. విజేతలు అవకాశాల కోసం ఎదురుచూడరని, వారే అవకాశాలు సృష్టించుకుంటారన్నారు. ఈ సందర్భంగా దివాకర్ చూపించిన మోటివేషనల్ వీడియోలు విద్యార్థులను, ఉద్యోగార్థులను మంత్ర ముగ్ధులను చేశాయి.
ధర్మపురికి చెందిన SAP చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పలువురు విద్యాభిమానులు పాల్గొన్నారు