చాలా రోజుల తరువాత ఒక మధ్యాహ్నం, నేను మరచిపోయిన నా అభిరుచి గుర్తొచ్చింది. నేను పెద్ద పెయింటర్ని కాదు కాని గోడలమీద, గాజు పాత్రల మీద చిన్నచిన్న బొమ్మలు వేస్తుంటాను. నేను పెన్సిల్ స్కెచ్ వేసుకునేందుకు ఒక తెల్లకాగితాల పుస్తకంకోసం ఆరోజు అరణ్యంలాంటి మా ఇంట్లో చాలాసేపు వెతికి పట్టుకున్నాను. అనుకోకుండా ఆ పుస్తకంలో మా అమ్మ చేతిరాత కనిపించింది. ఇంట్లో తన పుస్తకాలు ఎన్నో ఉండగా మమ్మీకి ఈ పుస్తకం ఎక్కడ దొరికిందబ్బా అనుకుంటూ అది చదవడం మొదలుపెట్టాను.
Also read: రాజకీయ నాయకుల మాట అధికారులు ఎందుకు వినాలి?
4 నవంబర్ 2013, అంటే తన ఏకైక గారాల పట్టినైన నా పెళ్ళికి సరిగ్గా పది రోజుల ముందు, “చాలా రాయాలని ఉంది. రాయానా, వద్దా? రాయడం అవసరమా? రాయకపోతే ఏం? రాస్తే ఏం రాయాలి? ఎలా రాయాలి? ఇదివరకెప్పుడూ ఇలా రాయలనిపించలేదు. అయినా నా మనసులో మాట ఎందుకు రాయకూడదు? రాస్తా. నాకూ తెలుసు, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యాక ఉద్యోగానికో, పెళ్ళి చేసుకునో తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతారని. మేము కూడా మా అమ్మాయి పెళ్ళి బాధ్యత నిర్వర్తించాలి. మేము కూడా అమ్మాయి దూరమవడమనే తప్పనిసరి బాధను అనుభవించాలి. తక్కువ మాట్లాడే భర్త కారణంగా ఎదిగిన కూతుర్నే స్నేహితురాల్లా చేసుకుని ఒంటరితనాన్ని దూరం చేసుకన్న నేను ఇప్పుడు ఎలా ఉండాలి? ఉండగలనా? తప్పదని తెలుసు. ఇదివరకు ఈ ఊహను కూడా మనసులోకి రాకుండా తోసేసేదాన్ని. కాని ఇప్పుడు అది తిరుగులేని నిజం. ఇంకొకరికి చెప్పడం, సలహాలు ఇవ్వడం సులభం. తనదాక వస్తేకానీ .. అన్నట్టుంది నా పరిస్థితి. అయినా ఇప్పుడేదో జరగరానిదేదో జరిగినట్లుగా ఎందుకు బాధ పడుతున్నాను. కాని ఎక్కడో ఏదో కొద్దిగా వెలితి. ఓ చిన్న కలవరం. కొద్దిగా దిగులు. ఓ భయం. ఓ సందేహం. భగవంతుడు నన్ను, మా ఆయనని చల్లగా చూసినంతకాలం ఏ చింతా లేదు. ఆయన చూస్తాడుకూడా. కాని ఇట్లా బ్రతకడం ఏంటి? ఇద్దరం ముసలివాళ్ళం, ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ తినడం కోసమే బ్రతుకుతున్నట్లుగా కాలం గడపడం ఎంత దుర్దశ. ఏదైనా గమ్యం, అర్ధవంతమైన వ్యాపకం వెతుక్కోవాలేమో.
Also read: “మార్చిన చరిత్ర”
మొన్న ఎవరో అన్నారు : నువ్వు రాలేదా పెళ్లిచేసుకొని అని? నిజమే, ఇదంతా బతుకు నాటకంలో భాగమే. కాని ఇష్టం లేని ఈ పాత్రను పోషించడం ఎలా. ఏది ఏమైనా లోకాచారానికి కట్టుబడక తప్పదు. అసలు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండుంటే ఇంత వెలితి వుండేది కాదేమో.” అర్ధాంతరంగా ముగిసిన నా మమ్మీ భావ ప్రవాహం, ధారగా కారుతున్న నా కన్నీటితో కలిసి నా మసకబారిన కళ్ళముందు ఆమె నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. నా పెళ్లి చేసిన సరిగ్గా మూడు నెలలకి అదే తేదిన అమ్మ నా చేతిని వదిలేసింది. నాధైర్యం, బలం, సంతోషం, నమ్మకం, నేస్తం, మార్గదర్శి అన్నీ తనే. అన్నీ కోల్పోయాను. అసలు నేను పెళ్లిచేసుకోకుంటే అమ్మ నాతోనే వుండేదేమో. ఒంటరితనం అంటే ఏంటో తెలియకుండా, తోబుట్టువులు లేరనే ఆలోచన రానివ్వకుండా తన ప్రేమను నా చుట్టూ అల్లేసింది. ఇప్పుడు నా రక్షణ కవచం తొలిగి శూన్యంలో నిరామయంగా నిలబడ్డాను. తాను సారం లేని జీవితాన్ని గడపాల్సి వస్తుందని నన్ను నిస్సారంగా, నిస్తేజంగా వదలి వెళ్లిపోయింది. పెళ్ళితో నాకు తోడుగా ఒకరిని నిలిపి తను దూరమైపోయింది. లేకపోతే ఏమైపోయేదాన్నో. అమ్మా నాన్నలకు ఇంత గాఢమైన లోతైన ప్రేమ ఉంటుందని పిల్లలం ఎప్పుడు గ్రహించలేమేమో.
Also read: “జీవిత చక్రం”
నిన్ను దేశాలు తిప్పాలి, నేను గర్భవతి అవుతే నీ దెగ్గరికి రావాలి, నువ్వు నీ మనవడినో, మనవరాలినో ఎత్తుకోవాలి, వాళ్ళు ప్రొఫెసర్ అమ్మమ్మ దగ్గర ఇంగ్లీషు నేర్చుకోవాలి. నేను సైంటిస్ట్ అయితే నీ కళ్ళలో ఆ సంతోషం, గర్వం చూడాలి. ఇలాంటి ఆలోచనలు ఇంకెన్నో. “నువ్వుంటే నాకు ధైర్యం, కాసేపు నన్ను పట్టుకుని యిక్కడే ఉండు” అని హాస్పిటల్లో నువ్వు అన్న ఆ మాట నాకు ప్రతీక్షణం గుర్తు వస్తూంది. ఇంకాసేపు నీ చెయ్యి పట్టుకొని ఉండాల్సింది. నువ్వంటే ఎంత ఇష్టమో నీకు చెప్పనేలేదు. ఇప్పుడు చెప్పాలన్నా నా మాట వినిపించని దూరంలొ ఉన్నావు. నువ్వులేకుండా గడిపిన గత సంవత్సరం ఒక జీవితకాలంలాగ ఉంది. మరి నా జీవితం చివరిదాకా గడిపేదెలా? ఇప్పుడు అనిపిస్తోంది నువ్వు తిరిగిరావాలని, నా బిడ్డగా వచ్చి నువ్వు నాకు పంచిన అనురాగాన్ని, చేసిన సేవలను నేను నీకు తిరిగి చేసే అవకాశం దేవుడు నాకు ప్రసాదించాలని ప్రార్ధిస్తూ….
Also read: “రాజ మార్గం”