ఆడతనం పరిపక్వత అమ్మతనం
నవమాసాలు సడలని భారాన్ని మోస్తుంది
మితిలేని ఆవేదన అనుభవించి జన్మనిస్తుంది
చనుబాలు తాగించి పులకిస్తుంది
బిడ్డ ఆలనాపాలనా చూస్తుంది
నిద్రలేని రాత్రుళ్ళు నిశ్శబ్దంగా భరిస్తుంది
బిడ్డ అశుద్ధాన్ని అభావంగా శుభ్రం చేస్తుంది
భర్తను దూరంగా ఉంచడాన్నికూడా సమర్థించుకుంటుంది
అమ్మ ఒడిలో, ఆమె ప్రేమ తడిలో
ఆ స్వసుఖ త్యాగి లాలనలో
పెరుగుతారు పిల్లలు
కాలం కదులుతూనే ఉంటుంది
అమ్మ మమ్మీగా మారిపోతుంది
తెలుగు సరిగ్గా రాకుండానే అరకొర ఆంగ్లం వచ్చేస్తుంది
‘‘మమ్మీకేం తెలీదు’’
‘‘మమ్మీదంతా చాదస్తం’’
‘‘వండివార్చడం తప్ప ఇంకేం చేయగలదు?’’ అంటారు
‘‘మాడరన్ గా ఉంటే నసుగుతుంది
అబ్బాయిలూ అమ్మాయిలూ చనువుగా ఉంటే గిట్టదు
అసలు అమ్మను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది’’ అంటారు.
పెళ్ళి చేసేంత వరకు పొదిగే కోడిలా ఉంటుంది
రెక్కలొచ్చి తోడుదొరికి హాయిగా ఎగిరిపోతారు పిల్లలు.
మళ్ళీ మొదలవుతుంది అమ్మతనం
దానికి కావాలి ఆసరా
ఉమ్మడి కుంటుంబంలోనే వీలవుతుందది
అప్పుడు గుర్తుకొస్తుంది అమ్మ కాబోయేవారికి వాళ్ళమ్మ
వద్దని అంతవరకూ దూరం చేసుకున్నా
అవసరం కొద్దీ పిలవక తప్పదు
అమ్మను కన్న అమ్మ అమ్మమ్మ
విలువ పెరిగిపోతుంది అపారంగా.
పిచ్చి అమ్మ
పిలవగానే సంబరంగా వచ్చేస్తుంది
కాబోయే అమ్మను కూర్చోబెట్టి అన్నీ చేసేస్తుంది
నొప్పులొద్దు సిజేరియన్ అంటే కాదంటుంది
బిడ్డకు చనుబాలు పట్టాల్సిందేనని గొడవచేస్తుంది
తల్లి అందం చెడిపోతుందంటే వినిపించుకోదు
అన్నీ ముసలి ఆలోచనలే
‘‘అసలు అద్దె గర్భం ఏర్పాటు చేసుకుంటే ఏ బాధ ఉండేది కాదు
అమ్మను పంపించేస్తేనే నాకు మనశ్శాంతి.’’
అమ్మనుండి అమ్మమ్మగా మారడం
జీవితంలోఎంత పెనుమార్పో
తిట్లు తిరస్కారాలు పట్టించుకుంటే
బిడ్డలు దూరమవుతారని,
‘‘చంటిది అచ్చం నా పోలికే’’
అంటూ మురిసిపోతుంది అమ్మమ్మ అన్నీ మరచి.
Also read: సవాల్
Also read: సంతోషం
Also read: శాంతి
Also read: మార్గదర్శి
Also read: రాముడు