రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
తల్లి తండ్రి గురువు దైవం అన్నారు
అమ్మ అందరికంటే గొప్పదన్నారు
కాని అమ్మ మాటను అదే మాతృ భాషను
మనవాళ్ళు కాదనుకుంటున్నారు
స్వంత తల్లి కంటే మరొకరి తల్లిని
పరాయి భాషను తలదాలుస్తున్నారు
ఇంత విడ్డూరం ప్రపంచంలో ఎక్కడా లేదు.
అమ్మ భాష తెలియకుండానే వచ్చేస్తుంది
సవతి తల్లి భాష నేర్చుకుంటేగాని రాదు
ఏది ఏమైనా సవతి తల్లి స్వంత తల్లి కాలేదు
తల్లి ప్రేమకు సవతి తల్లి ప్రేమ సాటిరాదు
తల్లిని వదలి సవతి తల్లి కోసం పరుగెడుతున్నాం
ఇది పొరపాటనే స్పృహ కూడా లేదు.
మానసిక శాస్త్రజ్ఞులు ఎప్పుడో తేల్చారు
మాతృభాషలొ విషయం అర్థమయినట్టు
మరే భాషలోనూ అర్థం కాదని
ఇది అందరికీ తెలిసిన విషయమే
సర్ సి వి రామన్ నుండి నాదాకా
ఆంగ్ల మాధ్యమంలో చదవలేదు చిన్నప్పుడు
అసలు ఎ బి సి డి లు అరో తరగతిలో నేర్చుకున్నాం
మరి మాకందరికీ ఆ భాష బాగానే వచ్చిందిగా
ఆంగ్లం నేర్చుకోడానికి ఆంగ్ల మాద్యమం
అవసరమనే భ్రమ నుండి బయట పడదాం.
భరత ఖండంలొ తప్ప మరే దేశంలోనూ
ప్రాధమిక విద్య మాతృభాషలో కాకుండా
పరాయి భాషలో బోధించడం జరగదు.
భాషా సంబంధ మూఢత్వమంతా
మన మనసుల్లో గూడు కట్టుకుంది
ఆంగ్ల పదాలకు తెలుగు అర్థం చెప్పడం పోయి
తెలుగు పదాలకు ఆంగ్ల అర్థం చెప్పుకుంటున్నాం
‘కళ్ళు‘ అనే పదం ‘కల్లు‘ అని పలుకుతున్నాం
ఈ పరిస్థితిని భారతంలో ఆంగ్లాన్ని ప్రవేశ పెట్టిన
మెకాలే కూడా ఊహించి ఉండడు
సంస్కృతం స్థానంలో ఆంగ్లాన్ని నిలపడానికి
మన భావ దాస్యానికి నాడు ఆయన వేసిన బీజం
నేడు మన దేశ మస్తిష్కాన్ని ఆక్రమించిన మహా మర్రిగా
మహా వెర్రిగా మారింది.
ఉన్నత విద్యకు, నేటి ప్రపంచంలో మనుగడకు
ఆంగ్లం అవసరాన్ని ఎవ్వరూ కాదనరు
కాని భుక్తి కోసం తల్లిని చంపుకోవడం అవసరంలేదు
విద్యావేత్తలందరికీ ఈ విషయం తెలుసు
చాలామంది మేధావులు సాధు(జంతు)వులు మాట్లాడరు.
ఒకరో ఇద్దరో గీపెట్టినా ఎవరూ వినిపించుకోరు.
చదివే విషయం సరిగ్గా అర్థమయితే
చదువుమీద ఇష్టం పెరుగుతుంది
ఇష్టంగా చదివి వంట బట్టించుకున్నవాడు
కొత్త ఆలోచన చేస్తాడు. అదే పరిశోధన.
దాన్ని ఆధారం చేసుకుని పరిశ్రమలొస్తాయి, ఉద్యోగాలొస్తాయి
తయారైన వస్తువులతో దేశ సంపద పెరుగుతుంది
జనం సుఖంగా జీవించే పరిస్థితి వస్తుంది
దేశ భవిష్యత్తుకు మూలమైన విద్యను
ఆంగ్ల మాద్యమం ద్వారా చదివించి
అవగాహన కొరవడేటట్లు చేసి
దేశ నాశనానికి మనందరం తలో చెయ్యి వేస్తున్నాం
ఇది మెకాలే గొప్పతనమో
మన మూర్ఖత్వమో మీరే చెప్పండి.
Also read: “ప్రేమికుల రోజు”
Also read: “రాగ రాగం”
Also read: ‘‘శుభ సంక్రాంతి’’