Tuesday, January 28, 2025

భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది?

మూడవ, చివరి భాగం

భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం రక్షణకు రాజ్యాంగంను అమలుచేసే ‘నియంత’ నేడు అవసరం. నేడు కావలసింది మత గ్రంధాలతో ప్రజాస్వామ్యంను కొలుచుకోవటం కాదు. రాజ్యాంగ సూత్రాలతో కొలవాలి. అన్ని మత గ్రంధాలను మూటకట్టి అటకమీద లేకపోతే భద్రంగా భూమిలో పాతి పెట్టాలి. రాజ్యాంగంను దులిపి బయటకు తీయాలి. మైకుల్లో మతసూత్రాలను చదవటం ఆపేయాలి. రాజ్యాంగం లోని అధికరణాలను చదవాలి. ప్రజలను అటువైపు అడుగులు వేపించాలి. దేశ పౌరులందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా సమంగా అన్ని సౌకర్యాలు అందేవిధంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రజా ఉద్యమాలను పునర్నిర్మాణం చేయాలి. భారత దేశం  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం,  అతిపెద్ద లిఖిత రాజ్యాంగము కూడ.

భారతదేశంలో పౌరులందరికీ మతస్వాతంత్ర్యపు హక్కును, అధికరణలు (ఆర్టికల్స్) 25, 26, 27, 28 ల ప్రకారం ఇవ్వబడింది. ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యం సెక్యులరిజం సూత్రాలను స్థాపించుటకు ఉద్దేశించినవి. భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలోని అన్ని మతాలు సమానమే. ఏమతమూ ఇతర మతం కన్నా ప్రాధాన్యతను కలిగి లేదు. ప్రతి పౌరుడికీ తనకు ఇష్టం వచ్చిన  మతాన్ని అవలంబించే స్వేచ్ఛ ఉన్నది.  మతపరమైన సంప్రదాయాలను ఉదాహరణకు సిక్కులు కిర్పాన్ లను తమ ఉద్యోగాలు చేయు సమయాన ధరించడానికి, ప్రజల శ్రేయస్సును, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ధరించటాన్ని నిరోధించవచ్చు. ఇదే సూత్రం అన్ని మతాలకువర్తించును. మతసంబంధపు కార్యకలాపాలను ప్రభుత్వం నిర్దేశించిన చట్టాల ప్రకారం చేపట్టాలి. విద్యాసంస్థలలో, ప్రత్యేక మతాన్ని రుద్దే బోధనలు చేపట్టకూడదు. అలాగే, ఈ ఆర్టికల్స్ లోని విషయాలు, ప్రభుత్వాలు చేపట్టే ప్రజోపయోగ కార్యక్రమాలపై ఏలాంటి విఘాతాలు కలిగించగూడదు. ప్రభుత్వాలు చేపట్టే ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలలో, ధార్మిక సంస్థల కార్యకలాపాలు అడ్డంకులుగా వుండరాదు. ఆదేశిక సూత్రాల గురించి ప్రభుత్వాలను, దేశ పౌరులను   ఒకవైపు హెచ్చరిస్తూ, మరొక వైపు ప్రాధమిక హక్కుల విలువను తెలుపుతున్నది. ప్రజాస్వామ్యం అంటే ఈ రెంటి మధ్య సమన్వయం ఉండటం. ఏది లోపించినా ప్రజాస్వామ్యంకు ‘రంద్రాలు’ పడినట్లే.

నాలుగో స్తంభం మిడియా ఎటు పోతోంది?

 ప్రజాస్వామ్యం – వ్యక్తుల యొక్క, సమూహాలయొక్క, గుంపుల యొక్క, ప్రజలయొక్క ఆకాంక్షలను – ఆశయాలను ఎలా పరిశీలించాలి, ఎలా అమలు చేయాలి అనేదానికి  ‘లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, న్యాయవ్యవస్థ’ లను రూపకల్పన చేసింది. ఆ తరువాత, నేడు  మీడియాను కూడా ప్రజాస్వామ్యంకు నాలుగోవ పిల్లర్ గా పిలువబడుతున్నది. ప్రజాస్వామ్యం కు 4 వ పిల్లర్ మీడియా అని ఎప్పుడైతే చేర్చబడినదో, అనూహ్యంగా సొంత ప్రయోజనాల వారి లిస్టులోకి మీడియా వెళ్ళిపోయింది. మీడియా ఆ లిస్టులోకి వెళ్లిన తరువాత  “లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, న్యాయవ్యవస్థ” ఒక వైపు కూలిపోవడం మొదలు అయ్యింది. ఎప్పుడైతే ఇలా మొదలయ్యిందో .. ఈ ప్రజాస్వామ్యంలో, ఈ దేశంలో బ్రతుకలేక పోతున్నాము అనే భావనను ఒక “పాసియన్” గా తీసుకవచ్చింది మరియు  “ప్రైవసీ” అనే దానికి ప్రధాన్యతను పెంచుకోవటం జరిగింది. భారత దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ‘ప్రైవసీ’ అనే మూలం పైననే నిర్మాణం జరిగింది. ప్రత్యేకంగా ప్రైవసీ గురించి లేదు. ప్రజాస్వామ్యం యొక్క స్వభావమే అది. మీడియా ఎప్పుడైతే  ‘లెజిస్లేచర్ / శాసన సభ, ఎగ్జిక్యూటివ్/కార్యనిర్వాహకశాఖా, న్యాయవ్యవస్థ’ లను ఒకవైపు వంచటంతో ఈ ప్రజాస్వామ్యంలో “ప్రైవసీ” ని కోలుపోతున్నాము అనే భ్రమకు గురికావటం ఒకటి అయితే, ప్రజాస్వామ్యం యొక్క అర్ధంను, రూపంను ఎవరికి వారుగా చిత్రీకరించుకోవటం మరోటి. రాజ్యం / ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా పరిపాలించకపోవటంతో సమాజంలో ఒక గందరగోళ పరిస్థితి, భయం, బ్రతుకుపట్ల అభద్రతా భావన, దుఃఖం, అలజడి, కుల సామరస్యత, మత సామరస్యత లేకపోవుట గమనించదగినది.

స్వాతంత్ర్యం జీవన విధానం

నిజానికి, స్వాతంత్య్రాన్ని, సమానత్వాన్ని, సౌహార్ద్ర, సౌభ్రాతృత్వాన్ని జీవితాశయాలుగా, ఒక జీవన విధానంగా రాజ్యాంగం ప్రజలకు ఇస్తుంది. ఈ లక్షణాలు ఒకదానితో మరొకటి విడదీయలేనివి: స్వాతంత్య్రం, సమానత్వం రెండూ విడదీయలేనివి; సమానత్వం, స్వాతంత్య్రం రెండూ సౌభ్రాతృత్వంతో విడదీయలేనివి. సమానత్వం లేని పక్షంలో స్వాతంత్య్రం అతికొద్ది మంది ఆధిపత్యాన్ని మిగతా వారి మీద రుద్దుతుంది. స్వాతంత్య్రం లేని సమానత్వం వ్యక్తిగత అభిప్రాయాన్ని తొక్కేస్తుంది; సౌభ్రాతృత్వం లేని సమానత్వంస్వాతంత్య్రం సహజ పరిపాలనకు బహుదూరం. ఈ విధానం ఒక బలమైన ప్రజాస్వామ్యానికి, ఆరోగ్యవంతమైన దేశానికి సూచిక. అయితే భారత సమాజ రాజ్యాంగం పరిధిలో ఇంకా నిర్మాణం జరగలేదు. ఎగుడు దిగుడుగా 75 ఏళ్లకు ముందు ఈ దేశం ఎలా ఉన్నదో, నేడూ అలానే ఉన్నది. ప్రభుత్వాలు ప్రజలకు ఎంత సాంకేతిక రంగాలను, విజ్ఞానం, వైజ్ఞానం దగ్గెరకు తీసుకవెళ్లిన,  పరిచయం చేసినా, ప్రజల నుండి అనారోగ్యకరమైన సాంప్రదాయాలను, ఆచారాలను, మూఢత్వాలను దూరంచేయకుండా,  ప్రజలు అభివృద్ధి లో ఎలా భాగస్వామ్యం అవుతారు. ఇక్కడ ఒక ఉదాహరణను ప్రస్తావిస్తాను. ఈ మధ్యనే మహిళల వివాహ వయసు 21 ఏళ్ళు అని సవరణ కు పెట్టారు. కానీ ఒక మతానికి చెందిన మహిళల వయస్సు ఆ మతం ఆచారం ప్రకారమే వయసు చెల్లుతుంది అని చెప్పబడింది. ఒకవైపు ప్రభుత్వాలు .. మహిళలు ” మూఢ మత ఆచారాలకు, విశ్వసాలకు, సాంప్రదాయాలకు ” దూరంగా ఉండాలని చెపుతూ, మరోవైపు ఒకమతానికి చెందిన మహిళలు వారి ఆచార వ్యవహారాల ప్రకారమే వివాహ  వయసు నిర్ణయం చేసుకోవచ్చు అని చెప్పటం .. ప్రజాస్వామ్యం అంటారా? దీన్ని ఏరకమైన ప్రజాస్వామ్యం కింద చూడాలి.

Also read: భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది? 

స్వాతంత్య్రం కు ముందు ఎవరికి వారుగానే ఈ దేశ ప్రజలు బ్రతికారు. దేశానికి  స్వాతంత్య్రం రావటానికే 200 నుంచి500  ఏళ్ళు పట్టింది. స్వాతంత్య్రంవచ్చాక 75 ఏళ్ళ నుండి ఇక్కడి ప్రజలు ఇంకా అలానే బ్రతుకుతున్నారు. రాజ్యాంగం ప్రకారం సమాజ నిర్మాణం చేయక పోగా … పోండి ఎవ్వరి ఆచారాల ప్రకారం వాళ్ళు బ్రతకండి, తన్నుక చావండి అని ప్రభుత్వాలు చెప్పటం, ఆదేశిక సూత్రాలను అతిక్రమించటమే కాకపోగా, ప్రజాస్వామ్యంను అపహాస్యం చేయటమే. ఇక్కడ ప్రజలలో ఒక అయోమయం, గందరగోళం ఏర్పడుతుంది. అధికారంకోసం ఎదురుచూసే ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ఒక విపరీత ధోరణినుండి .. మరో విపరీత ధోరణిలోకి తీసుకవెళ్తారు. ఇక్కడ మరొక ఉదాహరణను చెప్పుకుందాము … ఢిల్లీ అల్లర్లు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలముందు, కరోణకు ముందు CAA/CAB/NRC కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు. ప్రజాస్వామ్యంకు ఈ అల్లర్లలో ఇచ్చిన నిర్వచనం .. ను గమనిస్తే .. ఏదేశానికైనా పౌరసత్వం చట్టం ఉండును. ఎలా ఉండాలి అనేది చర్చ జరగాలి. ఈ విషయాన్ని గాలికి వదిలిపెట్టి .. ఈ ప్రజాస్వామ్య దేశంలో బ్రతకుహక్కునుతుంచుతున్నారనే  ఒక విపరీతమైన ధోరణిలో నిరసనలు చేసారు. భారత రాజ్యాంగం పరిధిలో ప్రజాస్వామ్య పద్ధతిలో పౌరసత్వ చట్టం నిర్మాణం జరగాలి, జరిగితీరాలి. భారతదేశానికి సమాజ నిర్మాణం జరిగితీరాలి. కానీ కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యానికి ఇచ్చే నిర్వచనం, మతోన్మాదులు ప్రజాస్వామ్యానికి ఇచ్చే నిర్వచనం, పాలకులు ఇచ్చే నిర్వచనం, ప్రతిపక్షాలు ఇచ్చే నిర్వచనం, కులతత్వ వాదులు ఇచ్చే నిర్వచనం, సోషలిస్టులు ఇచ్చే నిర్వచనం, అంబేడ్కరిస్టులు ఇచ్చే నిర్వచనం ఏదీ రాజ్యాంగం చెపుతున్న ప్రజాస్వామ్యంతో సింక్ కాలేక పోతున్నది…. ఒక్క సామాన్య ప్రజలు ఏదైతే  కూడు,గూడు, గుడ్డ కోసం రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ అందివ్వండి అని అడుగుతున్నారో .. ఇక్కడ భారత ప్రజాస్వామ్యం సింకు అవుతుంది. అయితే సామాన్య ప్రజలకు అందించే దగ్గెర ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాలకు స్థానం ఇవ్వటానికే ప్రభుత్వాలు ముందుకు అడుగులు వేయట్లేదు. ఆర్థిక సహాయంకు మాత్రమే సుముఖంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యం యొక్క మౌలికమైన “విలువ” ను అన్ని వైపుల నుండి తుంచివేయబడుతున్నది. ఈ విధమైన కార్యాచరణ ” భారత రాజ్యాంగం ఇస్తున్న ప్రజాస్వామ్యం” పట్ల  ఎవరికి వారుగా నిర్ణయాలు, నిర్వచనాలు ఇచ్చుకోవటం చేత “ప్రజాస్వామ్యం” యొక్క మౌళిక అంశాలు కనుమరుగు అవటంతో కొందరు “అభద్రతా భావన” ను వ్యక్తీకరించటం జరుగుతుంది. దేశంలో రాజ్యాంగం కలిపిస్తున్న ప్రజాస్వామ్య బద్ధంగా సమాజ నిర్మాణంకు ఎవరూ పూనుకోక పోవటం, దీన్ని గురించి మాట్లాడక పోవటం జరిగింది. జరుగుతుంది. దీని ప్రభావమే ప్రజలలో ఆలోచనలు, అభివృద్ధి ఎగుడు దిగుడుగా ఉంది. రోడ్డు నిర్మాణం లేకపోతే ఆ దారి / రోడ్డు మొత్తం ఎగుడు దిగుడుగానే ఉంటది కదా ! అలానేనేటి భారత సమాజం ఉంది.

List of Prime Ministers of India from 1947 to 2019 with working period,  party details - India
భారత దేశానికి ఇంతవరకూ ప్రధానమంత్రులుగా పనిచేసినవారు

ప్రజాస్వామ్య సమాజం నిర్మాణం జరగాలి

అయితే భారత సమాజము అనేది రాజ్యాంగం పరిధిలో ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం జరగాలి. అప్పుడే ప్రజలలో ఒక ఐఖ్యత, ప్రభుత్వాలకు/ పాలకులకు ఒక భయం ఉంటది. ఇది లేకపోవటం చేత .. ప్రజలలో మెల మెల్లగా కులాల పరంగాను – మతాల పరంగాను అనుమానం మొదలయ్యింది, ఈ అనుమానాలు విపరీత ధోరణులకు దారితీస్తున్నది. రాజ్యాంగపు ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల  సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించలేక పోతున్నాయి. కొందరిని ఒకరకంగా, మరికొందరిని ఇంకోరకంగా చూస్తున్నది అని వారు అభిప్రాయపడుతున్నారు. నిజానికి భారత రాజ్యాంగం ను కొంతమేరనే అనగా ఎన్నికల వరకు మాత్రమే అమలు చేస్తున్నారు, సంపూర్ణంగా ప్రభుత్వాలు అమలు   చేస్తలేరు.  ఎలాంటి ప్రభుత్వాలు ఎన్నిక చేసుకోవటం అనేది కూడా ప్రధానం…. 1947 తరువాత ఎవరిని ప్రజలు ఎన్నుకున్నారో ఒక్కసారి  గమనిస్తే  …

 15-08-1947 నుండి 27-05-1964 వరకు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగాను, 27-06-1964 నుండి 09-06-1964 వరకు గుల్జారీలాల్ నంద ప్రధాన మంత్రిగాను, 09-06-1964 నుండి 11-01-1966 వరకు లాల్ బహద్దూర్ శాస్త్రి ప్రధాన మంత్రిగాను,11/01/1966 నుండి 24/01/1966 వరకు మళ్ళీ గుల్జారీలాల్ నంద ప్రధాన మంత్రిగాను,24/01/1966 నుండి 24/03/1977 వరకు ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగాను అనగా 1977 వరకు కాంగ్రెస్ పార్టీనే పరిపాలించింది. ఆ తరువాత 24/03/1977 నుండి 28/07/1979 వరకు మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగాను,28/07/1979 నుండి 14/01/1980 చరణ్ సింగ్ ప్రధాన మంత్రిగా అనగా జనతా దళ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలించింది. అంతర్గత కుమ్ములాటలతో అర్ధాంతరంగా పరిపాలనను కోలుపోయింది.14/01/1980 నుండి 31/10/1984 వరకు ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా కొనసాగారు. ఇందిరా గాంధీ తనకు భద్రతగా ఉన్న అంగ రక్షకుల చేతిలోనే ప్రాణాలను కోలుపోయారు. 31/10/1984 నుండి 02/12/1989 వరకు రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీనే పరిపాలనలో ఉన్నది. ఆ తరువాత ఎన్టీఆర్ జాతీయ అధ్యక్షులుగా నేషనల్  ఫ్రంట్ లో భాగస్వామిగా ఉన్న జనతా దళ్ పార్టీ కేంద్రంలో 02/12/1989 నుండి 10/11/1990 వరకు వి.పి.సింగ్ ప్రధాన మంత్రిగా కొనసాగారు.10/11/1990 నుండి 21/06/1991 వరకు చంద్ర శేఖర్ నేషనల్  ఫ్రంట్ లో భాగస్వామిగా ఉన్న  సమాజ్వాది జనతా పార్టీ (రాష్ట్రీయ) నుండి పాలించారు. 21/06/1991 నుండి 16/05/1996 వరకు పి.వి. నరసింహ రావ్ ప్రధాన మంత్రిగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది.16/05/1996 నుండి 01/06/1996 వరకు అటల్ బిహారి వాజ్పాయ్ సారధ్యంలో 161 సీట్లతో మొదటి సారి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు చేసింది. ఆ తరువాత 01/06/1996 నుండి 21/04/1997 వరకు H.D. దేవె గౌడ జనతా దళ్ (సెక్యులర్) పరిపాలించారు.21/04/1997 నుండి 19/03/1998 వరకు ఇందర్ కుమార్ గుజ్రాల్ జనతా దళ్ పార్టీ నుండి ప్రధాన మంత్రిగా పరిపాలించారు.19/03/1998 నుండి 22/05/2004 వరకు అటల్ బిహారి వాజ్పాయ్ బీజేపీ పార్టీ నుండి ప్రధాన మంత్రిగా పూర్తి స్థాయిలో అనగా కాంగ్రెస్ పార్టీ తరువాత ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు జరిగింది.22/05/2004 నుండి 26/05/2014 వరకు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రధాన మంత్రిగా దేశాన్ని ఏలారు.26/05/2014 నుండి నేటి వరకు బీజేపీ పార్టీ సారధ్యంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు భారత దేశాన్ని 15 మంది ప్రముఖులు 18 సార్లు ఏలారు. రాజ్యాంగంను మాత్రం అమలు చేయలేదు. దేశాన్ని, ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా వీరికి ఎంత అవసరమో అంతే రాజ్యాంగంను వాడుకున్నారు. అందుకే నేడు ప్రజలు ప్రభుత్వ విధానాల ప్రభావం ఏ మేర ప్రజాస్వామ్య బద్ధంగా అమలు అవుతున్నాయనే దానిపైననే ఎక్కువ ఆందోళన పడుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే అదేదో సడన్ గా పైనుండి ఊడిపడేది ఏం కాదు. పూర్తిగా ప్రభుత్వ విధానాలపైననేప్రజాస్వామ్యము ఆధారపడి ఉండును. మరియు  ప్రభుత్వ విధానాలపైననే ప్రజల స్పందన ఎలా ఉందనేదే ప్రజాస్వామ్యానికి సూచిక. 

రాజ్యాంగ ప్రజాస్వామ్య నియంతృత్వం

కమ్యూనిజంలో కార్మిక నియంతృత్వం ఎలానో అలానే రాజ్యాంగం అమలుకోసం ప్రభుత్వాలు రాజ్యాంగ ప్రజాస్వామ్య నియంతృత్వం పాటించాలి. అదే దేశానికి నేడు అవసరం. రాజ్యాంగం అమలు పరిచే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి. ఇక్కడ ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం రాజ్యాంగం కావాలి. లేకపోతే, ప్రజలు, దేశం  ఇంటిపోరుకు  బలిఅవుతుంది. మరియు, అంతర్జాతీయ వేదికలమీద  భారత దేశం యొక్క పరువును ప్రభుత్వాలే తీసుకోవాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యం విఫలం అయ్యింది, లోకికత్వాన్ని దేశం, ప్రభుత్వం గాలికి వదిలివేసింది అనే అపవాదును మూటకట్టుకోవాల్సిందే.ఇందుమూలంగా అవినీతి, అధికధరలను, ఆర్థిక అస్థిరతను, రాజకీయ అస్థిరతల నుండి ఎక్కువ సవాళ్లను దేశం ఎదుర్కోవలసి వస్తుంది. రాను రాను ఆహార నిల్వలు పూర్తిగా తరిగి పోయే  ప్రమాదం ఉంది.

నేడు అందరు చూస్తున్నది, వింటున్నది పొరుగు దేశాల ప్రభుత్వాలు  సరిఅయిన ప్రణాళికను మొదటి నుండి పాటించకపోవుటచేత, కావాల్సిన వస్తువులు ఆయాదేశాలకు కొనుక్కోవడానికి సరిపడా నిధులు లేకుండాపోయిందిఅని. ఆ పరిస్థితి దేశంకు రాకుండా పాలకులు ఇప్పుడే తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. యుక్రెయిన్, రష్యా మధ్యజరుగుతున్నయుద్ధంతో ఆహార సంక్షోభం గురించి అక్కడి ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కూడా ఆ పరిస్థితి వష్తుందా??!! అని అదే విషయాన్ని బహిరంగంగా అంతర్జాల వేదికగా ఇక్కడి పౌరులు కొందరు  అసంతృప్తిని  వెల్లడి స్తున్నారు. యుక్రెయిన్‌ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం  ఎక్కువగా  ఈజిప్టు,  లిబియా,  ట్యునీషియాలపై  పడింది.  ఈ మూడు దేశాలు  గోదుమ దిగుమతి కోసం  రష్యా,  లేదా యుక్రెయిన్పై ఎక్కువగా ఆధాపడి బ్రతుకుతున్నాయి. వీరు చెపుతున్న  ముఖ్య కారణం  “ప్రజాస్వామ్య”  అమలు  తీరులో  ఉన్న  హెచ్చు  తగ్గులు అని అక్కడిపౌరులుతమ  అభిప్రాయంను   వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రజాస్వామ్యంలోని అమలు పట్ల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండకపోవటం ముఖ్యకారణం అని అంటున్నారు.  భారత  దేశం  ప్రపంచంలోనే  అతి  పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్యాన్ని కొంతమంది అంతర్జాతీయ వే0దికలమీద  అపహాస్యం  చేస్తున్నారు.  అది ఎంత దూరం పోయింది అంటే ‘భారతదేశాన్ని “ప్రత్యేక ఆందోళన”(స్పెషల్ కన్సర్న్)  దేశాల జాబితాలో చేర్చాలని’ ఏప్రిల్లో USCIRF కమీషన్ అమెరికా విదేశాంగ శాఖకు సిఫార్సు చేసింది. మూడేళ్లు నుండి కమిషన్ ఈ సిఫార్సును చేస్తూనే ఉంది. ఈ సిఫారసులు దేశముయొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసే పనినే. ఇందులో ఎలాంటి అనుమానంలేదు. కానీ,  అదే సమయంలో ప్రభుత్వాల పని  తీరును కూడా గమనంలోకి  తీసుకోవాలి … నిజంగానే, దేశంలో ‘ప్రజాస్వామ్యం’ బలంగా ఉందా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటె మత, కుల ప్రాతిపదికమీదనే సమస్యలపై దృష్టి పెడుతున్నారు,  మూసపద్ధతీలోనే  పరిష్కారాలను చూపుతున్నారు. ఇది రాజ్యాంగానికి పూర్తి విరుద్ధం. రాజ్యాంగంయొక్క స్ఫూర్తికి కూడా తిలోదకాలు వదులుతున్నట్లే. ఉదాహరణకు విద్యను, నిరుద్యోగాన్ని, పదోన్నతులను, ఆశ్రయంను, ఆహారంను, ధరించే వస్త్రంను, ఆరోగ్యంను “రిజర్వేషన్” ప్రాతిపదికమీదనే ప్రజలకు ఇంకా అందివ్వటం. దీర్ఘకాలంగా ఈ విధానాన్నె ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి ఇదే మొదటి బలహీనత.

ప్రజాస్వామ్యం అంటే ఓటు హక్కు మాత్రమే కాదు

75 ఏళ్ళ నుండి అంటే “ప్రజాస్వామ్యం” యొక్క స్ఫూర్తిని “ఓటు హక్కు” మాత్రమే అని  ప్రభుత్వాలు ప్రజలకు అర్ధంచేపిస్తున్నాయి.  ప్రతిపక్షాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఇది రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విరుద్ధం. మరియు, ఏదైతే రాజ్యాంగం పీఠికలో “భారతదేశంను సార్వభౌమ్య  సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య, గణ రాజ్యముగ నెలకొలుపుటకు మరియు అందరి పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావమును భావ ప్రకటన విశ్వాసము ధర్మమూ ఆరాధన వీటి స్వాతంత్ర్యమును అంతస్థులోను అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతైక్యతను అఖండతను తప్పక ఒనగూర్చు సౌబ్రాత్రమును పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొన్నాము … “(ఇందుమూలంగా ఈ సంవాధమ్ను అంగీకరించి, అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమైతిమి పీఠిక, భారత రాజ్యాంగం) రాసుకున్నదానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు నడుస్తున్నట్లే.  

ప్రజాస్వామ్యానికి మొదటి బలం లౌకికత్వం అయితే రెండవ బలం అంతస్థులోను అవకాశములోను సమానత్వమును పౌరులందరికీ చేకూర్చుట. సమానత్వాన్ని కలిగించటము అంటే ప్రభుత్వాల దృష్టిలో ‘రిజర్వేషన్స్’ మాత్రమే ఉంది. ఈ పద్ధతి తో వ్యక్తి గౌరవానికి, జాతి ఐక్యతకు నష్టం జరుగుతున్నది. ప్రజలలో ఐక్యత లేకుండా చేస్తుంది. జాతి ఐక్యత అంటేనే దేశం యొక్క ఐక్యత.ఐక్యతాశూన్యతనునింపేటందుకేనేమో ‘భారత్ జోడో’ అనే నినాదంతో కాంగ్రెస్ నేడు దేశవ్యాప్తంగా పాదయాత్రకు నాంది పలికింది. గతంలో కాంగ్రెస్ చేసిన తప్పులే నేడు అవే తప్పులను పునరావృతం జరుగుతూనే ఉంది. దీనికి మూలం “ప్రజాస్వామ్యానికి” ఇస్తున్న నిర్వచనాలు, తాత్పర్యాలు, వివరణలు రాజ్యాంగం ప్రకారం ఇవ్వకపోవటం. ఎలా అంటే ఆదేశిక సూత్రాలను – ప్రాధమిక హక్కులను విడివిడిగా చూడటము. ఇదే ప్రాధమిక తప్పు. ప్రాధమిక హక్కులను అమలు చేయాలి అంటే తప్పనిసరిగా ఆదేశిక సూత్రాలను ప్రభుత్వం,  ప్రజలు పాటించాలి. ఇది జరగనంత వరకు ప్రజాస్వామ్యం అంటేనే  ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు నిర్వచించుకోవటం, ప్రైవసీకి భంగం కలుగుతుంది అనేవే ముందు గుర్తుకు వస్తుంది,ఆతరువాత,మతస్వేచ్ఛ, అణచివేత గుర్తుకు వస్తుంది. వాస్తవానికి గుర్తుకు రావలసింది “ప్రజాస్వామ్యం – లౌకికత్వం” రావాలి ఆ వెంటనే ప్రజాస్వామ్యం – సమానత్వం – సామ్యవాదం -సౌబ్రాత్రము – గణరాజ్యము – అభ్యుదయము. ప్రభుత్వాల పాలనకూడా ఈ పరిధిలో సాగాలి,సాగటంలేదు. దీనిమూలంగా దేశంలో నేటికీ ప్రజలకు అసలైన ప్రజాస్వామ్యము – న్యాయమూ దొరకటం లేదు.

భారత రాజ్యాంగం విప్లవాత్మకమైనది 

భారత రాజ్యాంగము ఒక విప్లవము, ప్రజా విప్లవముతో ముడిపడి ఉన్నది. అసమాన వ్యవస్థను బద్దలు కొట్టే శక్తిని కలిగి ఉంది. మతాలకు, కులాలకు వ్యతిరేకంగా, వాటికి అతీతంగాను ప్రజలలో ఐక్యతను తీసుకువచ్చే స్ఫూర్తి రాజ్యాంగానికి ఉన్నది. వందల ఏళ్ళు భారతదేశాన్ని విదేశీయులు పాలించారు. వీరికి ముందు ఎవరికి వారుగా విడివిడిగా ప్రజలు జీవించారు. ఎవరి సంప్రదాయాలు, ఆచారాల ప్రకారమే వారికీ వారుగా జీవించారు. అభివృద్ధిలో భాగంగా భారతదేశ ప్రజలు తమ బానిస బ్రతుకుల విముక్తికోసం పోరాటాలు చేసారు. హింస – అహింస మార్గాలలోనూ తమ స్వాతంత్య్రం కోసం ప్రయాణించారు. చివరికి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నారు అందరిఒక్కటికోసం “రాజ్యాంగాన్ని” ఏర్పాటుచేసుకున్నారు. మతాలకు, కులాలకు అతీతంగా భారతదేశ ప్రజలను రాజ్యాంగము మాత్రమే ఒక్కటి చేయగలిగగేది. ఆదేశిక సూత్రాలు,ప్రాధమిక హక్కులు ప్రజలకు, ప్రభుత్వాలకు నిర్దిష్టమైన దారి చూపుతున్నది. మరియు ఇవే సామాజిక ప్రగతికి దిశ, నిర్దేశం చేస్తున్నాయి. సత్యం ఏంటంటే ప్రజాస్వామ్యము రక్షణ పేరుతో జరుగుతున్న ఆందోళనలు  పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి గురించి చేసే ఆందోళనలు తక్కువే. ఒకవేళ చేసినా కులం,మతం పేరుతోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రకమైన ఆందోళనలు ఆదేశిక సూత్రాలను, ప్రాధమిక హక్కులను రక్షించలేవు. ఇంకా వీటియొక్క స్ఫూర్తిని అనచటమే. అందుకే ప్రభుత్వాలు కూడా తూ తూ మంత్రంగా ఏ కొందరికో మాత్రమే చేయూతనిస్తుంది. వ్యతిరేక వర్గం, చూసారా ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది అని మరో ఉద్యమానికి తెర లేపుతుంది. ప్రజలలో అభద్రతతో కూడిన అలజడి మొదలవుతుంది. ఉద్యమము ఎందుకు వచ్చిందో,  మార్గంఎందుకు  తప్పిపోతోంది తెలియదు. ఆత్మరక్షణకోసం మరొక ఉద్యమము. ఇంకొందరు ఆత్మహత్యలతో ఉద్యమాలకు నాంది పలుకుతున్నారు. ప్రభుత్వాలేమో అరెస్టులకు తెరలేపుతాయి. చివరికి ఎవరికి వారుగా ప్రజలు విడిపోతారు. ప్రజాస్వామ్యం విభజనకు గురౌతుంది. దేశంలో ప్రజాస్వామ్యం లోపభూయిష్టంగా ఉండనే ప్రచారం కొందరు స్వార్ధ పరులు చేస్తారు. సామాజిక రుగ్మతలకు ప్రజలు లోనౌతారు. దీనికి చక్కటి ఉదాహరణ 2020 లో కరోనా ప్రబలుటకు “ఫలానా వర్గం” వారు కారణమూ అని ప్రచారం. ఇలాంటి అసంబద్ధమైన ప్రచారాలు ప్రజాస్వామ్యము,అభ్యుదయము, ఆదేశిక సూత్రాలను బలహీన పరచటమే. అమలు చేయటంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లోపమే అన్ని అనర్ధాలకు మూలంగా భావించాలి. ఎందుకంటె భారతదేశంలో మీడియా లేదా సోషల్ మీడియాలో హిందువులు లేదా హిందుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన హిందువేతరులను పోలీసులు అరెస్టు చేశారని అమెరికా విదేశాంగ శాఖ USCIRF నివేదికలో పేర్కొనటము. హిందువేతరులు …. హిందువులను,  హిందుత్వాన్ని ఎందుకు కించపరుస్తారు?. కించపరుస్తూ ఎందుకు ప్రకటనలు చేస్తారు?. ఇలాంటి వారే వారి స్వార్థంకోసం, దేశంలో అంతర్గత అలజడులను సృష్టించటమే వారిపని మరియు ప్రజాస్వామ్యము – లౌకికత్వము భారతదేశము యొక్క బలము. దీన్ని దెబ్బతీసే ప్రయత్నమే ఇలాంటి నివేదికలు.

మతరహిత విధానాలు అవసరం

అయితే, దేశంలో మతప్రాతిపదికంగా, కులాలపరంగా అస్సలు గొడవలు లేవని చెప్పలేము. ఎందుకంటె రాజ్యాంగాన్నే పూర్తిగా ప్రభుత్వాలు అమలుజరపలేదు. రాజ్యాంగము సంపూర్తిగా అమలు జరగనంతవరకు ఈ గొడవలు తప్పవు. మతరహిత విధానములో ప్రభుత్వాలు ప్రజలకు అవసరము. దేశంలో అనేక మతముల వారు, మతపరమైన విశ్వాసాలతో ఉన్నప్పటికినీ ఆదేశిక సూత్రాలప్రకారము ప్రజలను ప్రజాస్వామ్యము – అభ్యుదయము వైపు నడిపించాలి. స్వేచ్ఛతో ప్రజలు జీవనం సాగించే విధంగా ప్రభుత్వ విధానాలు, సిద్ధాంతం ఉండాలి. 

అయితే నేడు దేశం తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్యలు మాదక ద్రవ్యాల ప్రభావం యువతీయువకులపై మెండుగా ఉంది, మానవ అక్రమ రవాణ, అవినీతి. ఈ మూడు ప్రజాస్వామ్యం పై విపరీతమైన ప్రభావం చూయిస్తూ ఉన్నాయి. వీటిని నియంత్రణ చేయలేని స్థితిలో ప్రభుత్వాల తీరు ఒకవైపు, పౌర సమాజం వేషధారణలో, తినే విధానంలో అభ్యుదయం ప్రదర్శిస్తున్నది. పునాదులలో చైతన్యవంతమైన మార్పు – అభ్యుదయమైన ఆలోచనలు అభివృద్ధికావలసినంతగా జరగలేదు. అందుకే అడుగడుగునా “ప్రజాస్వామ్యం” ను మూఢత్వాలకూ, మత తత్వాలకు జోడించి చూపుతున్నారు. కమ్యూనిస్టుల ప్రభావం  మెల్ల మెల్లగా ప్రజలనుండి కనుమరుగు అవుతున్నది అంటే విధాన లోపమే. ప్రజాస్వామ్యంను రాజ్యాంగం పరిధిలో నైనా, వారి సొంత  అజెండా / సిద్ధాతం పరిధిలోనైనా విశదీకరించలేక పోవటమే. రాజ్యము తాను చెప్పేదే ప్రజాస్వామ్యం అనటం “ప్రజాస్వామ్యం” విఫలానికి దారి వేస్తున్నట్లే. 75 ఏళ్ళ నుండి సమాజ నిర్మాణం కు నోచుకోని “పౌర సమాజం” తప్పకుండ, తప్పని పరిస్థితులలో కొందరి వ్యక్తుల, సమూహాల – గుంపుల, భావజాలాలకు ప్రభావితం కు గురౌతుంది. అందుకే ప్రజాస్వామ్యం “పతులపడుతున్నట్లు – సన్నగిల్లుతున్నట్లు – విఫలమౌతున్నట్లు” రాజకీయ విశ్లేషకులకు అగుపించును. అదే రాస్తారు. ప్రజాస్వామ్యం విఫలమౌతున్నది అనే భావన ఒక్క భారతదేశమే ఎదుర్కోవటంలేదు. ప్రపంచం మొత్తం ఇదే సమస్యతో బాధపడుతుంది. కారణం  ‘మాదక ద్రవ్యాలు – మానవ అక్రమ రవాణ – అవినీతి’  లకు ప్రజాస్వామ్యం అనే ముసుగు వేసి  వ్యాపారం చేయటం. ఈ వ్యాపారంలో పెద్దలు, మతాల పెద్దలు కలిసి ఉండటము. ప్రజాస్వామ్యము అంటే రాజ్యాంగం చెప్పే ప్రజాస్వామ్యం కాకుండా “ఎవరికి వారు” సూత్రీకరించుకోవటం జరుగుతున్నది. ఇదే ప్రజాస్వామ్యానికి ఒక జాడ్యం.

Also read: భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది? 

సమాజంలో ప్రతి ఒక్కరూ సమానం         

ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వ వ్యవస్థగల రాజ్యము మనది. రాజ్యాంగం చెపుతున్న ప్రజాస్వామ్యం అంటే … సమాజంలోని ప్రతి ఒక్కరు సమానం. అందరూ స్వతంత్రాన్ని అనుభవించుట అనేది ప్రధానమైన విషయాలు.ఈ రెండూ భారత సమాజంలో అమలు జరగాలి అంటే “అభ్యుదయంతో కూడిన ప్రజాస్వామ్యం” ను ప్రజలకు అందించాలి. పౌర సమాజం ఒకవైపు నుండి – ప్రభుత్వాలు మరొకవైపు నుండి భారత రాజ్యాంగం ఆదేశికసూత్రాల ప్రకారం అభ్యుదయ ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేయవలసిందే. తప్పదు. లేకపోతే ‘మాదక ద్రవ్యాలు – మానవ అక్రమ రవాణ – అవినీతి’  లు పెరిగి పెరిగి ప్రజలు నడ్డివిరగ కొడతాయి. ఎగువ, దిగువ సభలకు అభ్యుదయ ప్రజాస్వాముకులను ప్రజలే ఎన్నికల ధ్వారా పంపుకోవాలి. ఎందుకంటె  ప్రజలు ఎన్నుకున్న ప్రతినిథులు ప్రజాస్వామ్యంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. అప్పుడు సమాజంలోనుండి హానికరమైన మాదక ద్రవ్యాల వ్యాపారం  – మానవ అక్రమ రవాణ వ్యాపారం  – అవినీతి  లను వెళ్లగొట్టవచ్చు. ప్రజాస్వామ్యం బలహీనపడుతున్నట్లు ఉండదు.   

(సమాప్తం)

జయ వింధ్యాలలాయర్ 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌర  హక్కుల ప్రజా సంఘం, తెలంగాణ రాష్ట్రం 

# 9440430263     

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles