Sunday, December 22, 2024

కాలుష్య కాసారం భారతావని

  • ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 30 కాలుష్య నగరాలు
  • భారత్ లోనే 22 నగరాలు
  • కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ అగ్రస్థానం
  • వెల్లడించిన స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్

కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటినుండి స్వచ్ఛభారత్‌ పేరుతో దేశంలో పరిశుభ్రతను పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. అయినా దేశ రాజధాని ఢిల్లీతో పాటు 22 నగరాలు మురికి నగరాల  జాబితాలో చేరాయి. ఢిల్లీకి చుట్టూ ఉన్న రెండు ప్రధాన రాష్ట్రాల నుంచే 19 నగరాలు ఇందులో ఉండటం విశేషం. వాయు కాలుష్యంలో ప్రధానమైన అతిసూక్ష్మస్థాయి ధూళికణాలు డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రెండున్నర రెట్లు అధికం.

ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 30 కాలుష్య పీడిత నగరాల్లో 22 ఇండియాలోనే ఉన్నాయి. అత్యంత కాలుష్య పీడిత రాజధాని నగరంగా దిల్లీ వరుసగా మూడో సంవత్సరం అగ్రస్థానంలో ఉందని మంగళవారం విడుదలైన ఓ నివేదిక వెల్లడించింది. ‘వరల్డ్ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌ 2020  పేరిట స్విట్జర్లాండ్ కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం ఢిల్లీ వాయు నాణ్యత 2019 కంటే 2020లో దాదాపు 15 శాతం మెరుగైనట్లు తెలిపింది.  అయినా దిల్లీ ప్రపంచ కాలుష్య పీడిత నగరాల్లో పదో స్థానంలో, రాజధాని నగరాల్లో అగ్ర స్థానంలో చోటు సంపాదించింది.

Also Read: చేజేతులా తెచ్చుకున్న ముప్పు

ఉత్తర భారతావనిలో కాలుష్యం:

ఢిల్లీతో పాటు పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో వాయు కాలుష్యానికి పంట వ్యర్థాలను కాల్చడం ప్రధాన కారణం. తరువాత పంట వేసేందుకు అనుకూలంగా పంట వ్యర్థాలను తగులబెట్టడంతో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నట్లు సర్వేలో గుర్తించారు. ప్రతి సంవత్సరం పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల ఏర్పడే కాలుష్యం, దుమ్ము ధూళి వల్ల ఢిల్లీ ప్రాంతం తీవ్ర వాయు కాలుష్యానికి గురవుతోంది. పంటవ్యర్థాలను కాల్చరాదని ప్రభుత్వాలు నిషేధం విధించినప్పటికీ అధికారుల ఉదాసీనవైఖరి కారణంగా ప్రభుత్వ ఉత్తర్వులు సరిగా అమలు కావడంలేదు. దీనికితోడు ఢిల్లీలో విపరీతంగా ట్రాఫిక్ పెరగడంతో వాహనాల నుంచి వెలువడే ఉద్గారాల వల్ల కూడా వాయు కాలుష్యం పెరిగిపోతోంది.  ఢిల్లీలో ప్రతిరోజూ దాదాపు 30 లక్షల వాహనాలకు పైగా రోడ్ల మీద తిరుగుతున్నాయని కాలుష్య నివారణకు సరి బేసి విధానాన్ని అమలు చేసినా పెద్దగా ఫలితం ఉన్నట్లు కనిపించడంలేదు. అంతేకాకుండా ప్రతిసంవత్సరం రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య భారీగానే పెరుగుతోంది.  భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం కావడంతో నిర్మాణాల కూల్చివేతల వల్ల వెలువడే దుమ్ము ధూళి నుంచి పలు రసాయనాలు వెలువడుతుండటంతో నిర్మాణ పరిశ్రమనుంచి కూడా కాలుష్యం ముప్పు పొంచి ఉంది.

Also Read: అంగారకుడిపై రోవర్ క్యాట్ వాక్ అదరహో!

కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాలు:

హర్యానాలోని  ఫరీదాబాద్‌,  జింద్‌, హిసార్‌,  ఫతేహాబాద్‌,  బంధ్‌వారీ,  గురుగ్రాం,  యమునా నగర్‌, రోహ్‌తక్‌,  ధారూహెడా. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌, బులంద్‌ షహర్‌, బిసరఖ్‌ జలాల్‌పుర్‌, నోయిడా, గ్రేటర్‌ నోయిడా, కాన్పూర్‌, లక్నో, మీరట్, ఆగ్రా, ముజఫర్‌నగర్‌, రాజస్థాన్ నుంచి భివారి, బీహార్ నుంచి ముజఫర్ పూర్ లు ఉన్నాయి.

కాలుష్యానికి ప్రధాన కారణాలు:

స్విస్‌ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య పీడిత నగరం చైనాలోని ఝింజియాంగ్‌ రికార్డుల కెక్కింది. దీని తర్వాత వరుసగా తొమ్మిది స్థానాల్లో మన దేశానికి చెందిన నగరాలే ఉన్నాయి. ఘజియాబాద్‌ ద్వితీయస్థానంలో ఉంది. ప్రపంచంలోని 106 దేశాల నుంచి సేకరించిన పీఎం 2.5 వివరాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. కొవిడ్‌-19 నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడం లాంటి పరిణామాలను కూడా పరిగణలోకి తీసుకుని నివేదిక రూపొందించారు.  స్విస్‌ సంస్థ పరిశీలన మేరకు భారత్‌లో వాయు కాలుష్యానికి రవాణారంగం, వంట కోసం జీవవ్యర్థాల దహనం, విద్యుదుత్పత్తి ఉత్పత్తిలో వెలువడే వ్యర్థాలు, పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం, నిర్మాణరంగం, వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ప్రధాన కారణాలుగా విశ్లేషించారు. ఇందులో రవాణారంగం నుంచి వెలువడుతున్న కాలుష్యం ఎక్కువగా ఉంది.

ఆందోళన వ్యక్తంచేస్తున్న పర్యావరణవేత్తలు:

లాక్‌డౌన్‌ కారణంగా దిల్లీతోపాటు మరికొన్ని నగరాల్లో కాలుష్యం తగ్గి, పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. మళ్లీ జన సంచారం పెరిగినందున 2021లో వాయు కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వాలు పక్కా ప్రణాళికలు రూపొందించాలి. ప్రపంచ మానవాళికి ముప్పుగా పరిణమించిన కాలుష్య నివారణకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

Also Read: దేశంలో తొలి ఏసీ రైల్వే టర్మినల్

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles