సంపద సృష్టిద్దాం – 07
మీ పర్సులో ఉన్న విజిటింగ్ కార్డులు, బస్ టికెట్లు, సినిమా టికెట్ల ముక్కలు అన్నింటినీ అవతలకి గిరాటేశారు కదా. డబ్బును దాచడం కోసం పర్సును సిద్ధం చేయడం అంటే మీ జీవితంలోని అంశాలలోకి ఒక సమర్ధతను ఆహ్వానించటమే. ఇక నేటి నుండి డబ్బు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి మీ మనీ పర్సులో చేరుతుందనే ఆలోచన, తృప్తిమీద మీ మనసును లగ్నం చేయండి. మీ సుప్తచేతన మనసుకు నిర్దిష్టమైన సంకేతం పంపండి. డబ్బు సమకూరడం ఖాయం. కిందటి వారం మనీపర్సును భద్రపరచమని చెప్తూ ప్రత్యేక ప్రదేశం, ధూపం వంటి మాటలు రాసినందుకు నా విద్యార్థి మిత్రులకు కొంచెం కోపం వచ్చింది. డబ్బుకు మనం ఇచ్చే కనీస మర్యాద అని చెప్పినప్పటికీ వారికి ఆ మాటలు నచ్చలేదు. అందులో హేతువు లేదని విసుక్కున్నారు. కాని, ఈ వ్యాస పరంపర లక్ష్మీదేవి గురించి, ధనవృద్ధి మంత్రతంత్రాల గురించి కాదు. బిలియనీర్లు కావాలనుకుంటున్న సాహసవీరుల మనస్తత్వం మార్చడం గురించి. వారి ఆటిట్యూడ్ లో గొప్ప మార్పు తీసుకురావడం గురించి. కాబోయే కోటీశ్వరులను మానసికంగా సంసిద్ధం చేయడం గురించి. ఆకర్షణ సిద్ధాంతాన్ని (లా ఆఫ్ అట్రాక్షన్) వివరించే వ్యాసాలివి. మన మనసును గట్టిగా ఆదేశిస్తే ఈ విశ్వం తనంతట తానుగా అన్నింటినీ మనకు అందిస్తుందని చెప్పే వ్యాస పరంపర ఇది. ఆచరణతో కోటీశ్వరులు కావచ్చు.
Also read: మనీ పర్స్ చూశారా!
ఉందనుకోవడమే మొదటి మెట్టు
ఒక వ్యక్తి దగ్గర తగినంత డబ్బు లేదంటే, దానికి ఒకటే కారణం. ఆ వ్యక్తి తన ఆలోచనలతో డబ్బును తన దగ్గరకు రాకుండా అడ్డుకుంటున్నాడు. ప్రతి వ్యతిరేకమైన ఆలోచన, ఎమోషన్ మీకు మంచి జరగకుండా అడ్డుపడుతున్నట్టే లెక్క. ఆ మంచిలో డబ్బు కూడా ఒకటి. ఈ విశ్వం డబ్బును మీకు దూరంగా ఉంచటం లేదు. ఎందుకంటే మీకు అవసరమైన మొత్తం కనపడకుండా ఇక్కడే ఉంది. మీ దగ్గర తగినంత డబ్బు లేకపోతే, మీరు దాని ప్రవాహాన్ని మీ దగ్గరకి రాకుండా ఆపుతున్నారు. ఆ పని మీరు మీ ఆలోచనలతో చేస్తున్నారు. ‘డబ్బు లేకపోవటం’ అనే స్థితి నుంచి మీరు తక్కెడలోని త్రాసును ‘అవసరానికంటే ఎక్కువ డబ్బు’ అనే స్థితికి తీసుకెళ్లాలి. లేమి కన్నా సమృద్ధి గురించి ఎక్కువగా ఆలోచించండి. అప్పుడు మీ పరిస్థితి మారిపోతుంది. డబ్బును ఆకర్షించడానికి, మీరు సంపద మీద మనసు కేంద్రీకరించాలి. మీ దగ్గర డబ్బు అవరసమైనంత లేదనే విషయం గురించి ఆలోచించినంత కాలం, ఎక్కువ డబ్బు సంపాదించటం అసంభవం. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఎక్కువగా లేదన్న ఆలోచనలే మీ మనసులో ఉన్నాయి. ఎక్కువ డబ్బు లేదన్న విషయంపై మనసు కేంద్రీకరిస్తే, డబ్బు ఎక్కువ ఉండని పరిస్థితులే మరింతగా ఎదురవుతాయి. డబ్బు మీ దగ్గరకు రావాలంటే మీరు బోలెడంత డబ్బు గురించి ఆలోచించాలి. మీ ఆలోచనలతో మీరు కొత్త సంకేతాన్ని విడుదల చెయ్యాలి. ఆ ఆలోచనలు మీ దగ్గర ప్రస్తుతం అవసరమైన దానికన్నా ఎక్కువ డబ్బుంది, అనేట్టు ఉండాలి. మీరు మీకున్న ఊహాశక్తినంతా వినియోగించి, మీకు కావలసినంత డబ్బు మీ దగ్గరుందని అనుకోవాలి. అది చాలా సరదాగా కూడా ఉంటుంది. మీ దగ్గర ఎక్కువగా డబ్బున్నట్టు నటించే ఆటలు ఆడగానే, మీకు డబ్బు గురించి మంచి భావాలు కలుగుతాయి. అలా మంచి భావాలు కలగగానే, అది మీ జీవితంలోకి యధేచ్చగా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం చాలా ఈజీగా, ఎఫర్ట్ లెస్ గా ఉంటుంది.
Also read: ఈజీమనీకి స్వాగతం!
అడుగు – నమ్ము – పొందు
ఈ రహస్యం గురించిన మరో రహస్యం ఏమంటే, జీవితంలో మీరు దేన్ని కోరుకున్నా సరే, ఈ క్షణంలో మీరు ఆనందంగా ఉండటం, ఆనందాన్ని అనుభవించటం అనేదే దానికి దగ్గర దారి! డబ్బును కాని, మీరు కోరుకుంటున్న మరే విషయాన్ని గాని జీవితంలో పొందటానికి అదే అతి శీఘ్రమైన దారి. ఆనందం, సంతోషం అనే భావాలను ఈ విశ్వంలోకి ప్రసరింపజేయటం అనే విషయం మీద ధ్యాస ఉంచండి. అలాచేస్తే గనక, మీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే విషయాలన్నిటిని మీ దగ్గరకి మీరు ఆకర్షించుకుంటారు. సమృద్ధే కాక, మీరు కోరుకుంటున్నవన్నీ మీకు దొరుకుతాయి. సంకేతాన్ని మీరు బయటకు పంపిస్తేనే మీరు కోరుకునేది మీ దగ్గరకు వస్తుంది. సంతోషం అనే భావాన్ని ప్రసరించినప్పుడే, అవి మళ్లీ మీ దగ్గరకు జీవితానుభవాల రూపంలో వెనక్కి వస్తాయి. ఆకర్షణ సిద్ధాంతం మీ మనసు లోతుల్లోని ఆలోచనలను, భావాలను మీ జీవితంగా మీకు అందిస్తుంది. ఇవ్వడం అనేది ఎక్కువ డబ్బు అందుకునేందుకు ఒక గొప్ప దగ్గరదారి. ఎందుకంటే మీరు డబ్బు ఇస్తున్నారంటే, “నా దగ్గర సమృద్ధిగా ఉంది’ అని అంటున్నారనే అర్థం. ఈ భూమ్మీద ఉన్న అత్యధిక ధనవంతులు అందరికన్నా గొప్ప దాతలని విని మీరు ఆశ్చర్యపోనక్కరలేదు. వాళ్లు పెద్ద పెద్ద మొత్తాలను దానంగా ఇస్తారు. అలా ఇవ్వటం వల్ల, ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుసరించి, విశ్వం వాళ్ల ముందు తన ఖజానాను తెరిచి మరింత ధనాన్ని వాళ్లకి అందిస్తుంది. అది ఎన్నో రెట్లు ఎక్కువ ఉండవచ్చు కూడా! ఇచ్చేందుకు తగినంతడబ్బు నా దగ్గర లేదు’ అని మీరు అనుకుంటే, మీ దగ్గర డబ్బు ఉండదు. ఇవ్వటంలోనూ, త్యాగం చేయటంలోనూ చాలా తేడా ఉంది. ఒకటి అవసరానికి మించి ఉందన్న సంకేతాన్ని అందిస్తే, రెండోది లేమికి సంకేతాన్ని అందిస్తుంది. మనస్ఫూర్తిగా ఇవ్వటం అనేది మనసుకు బాగా అనిపిస్తుంది. త్యాగం చెయ్యటం అంత బాగా అనిపించదు. త్యాగం చివరకు ఆగ్రహానికి దారి తీస్తుంది. మనస్ఫూర్తిగా ఇవ్వటం అనేది మీరు చెయ్యగల ఆనందంతో కూడిన పనులలోకెల్లా మంచి పని. ఆకర్షణ సిద్ధాంతం ఆ సంకేతాన్ని పట్టుకుని, మీ జీవితంలో మరింత సమృద్ధిని వరదలా పొంగేట్టు చేస్తుంది.
Also read: ఆకర్షణ సిద్ధాంతమా!
–దుప్పల రవికుమార్