గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడుగా కౌశిక్ రెడ్డిని నియమించే విషయంలో ఖరారు నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం అవసరమని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ అన్నారు. బుధవారంనాడు తెలంగాణ గవర్నర్ గా రెండు సంవత్సరాలు పూర్తిచేసి మూడో ఏట అడుగిడుతున్న సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడారు. అంతకు ముందు ‘వన్ ఎమాంగ్ అండ్ ఏమాంగెస్ట ద పీపుల్’ పేరుతో ఒక కాఫీటేబిల్ బుక్ ను విడుదల చేశారు. సీనియర్ జర్నలిస్టులూ, సంపాదకులూ హాజరైనసభలో ఆమె ప్రసంగించారు. సీనియర్ జర్నిలిస్టులు కొందరు మాట్లాడారు.
అనంతరం విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని అన్నారు. ఆయుష్మాన్ భారత్ విషయంలోనే అభిప్రాయభేదాలు ఉండేవనీ, ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మెరుగని ఆయన అనేవారనీ, తాను వివరించి చెప్పిన దరిమిలా ముఖ్యమంత్రి అభిప్రాయం మార్చుకున్నారనీ, ఆయుష్మాన్ భారత్ నూ, ఆరోగ్యశ్రీని అనుసంధానించడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతోందనీ తమిళసై చెప్పారు. తాను సమతౌల్యాన్ని పాటిస్తున్నాననీ, ముఖ్యమంత్రి కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనీ అన్నారు. తాను ఆదివాసీ ప్రాంతాలకు పర్యటనకు వెళ్ళినప్పుడు గిరిజన సంక్షేమ మంత్రి తనతో వస్తారనీ, విద్యారంగానికి సంబంధించిన సమావేశాలు జరిగినప్పుడు విద్యామంత్రి అందుబాటులో ఉంటున్నారనీ, ఎటువంటి సమస్యలూ లేవనీ ఆమె చెప్పారు.
శాసనమండలి సభ్యత్వాన్ని గురించి మాట్లాడుతూ, రాష్ట్ర క్యాబినెట్ మొత్తం నాలుగు పేర్లనూ ఆమోదించిందనీ, మూడు పేర్లు తాను కూడా ఆమోదించాననీ, నాలుగో పేరు దగ్గరే కొన్ని సందేహాలు ఉన్నాయనీ, నిర్ణయించేందుకు కొంత సమయం తీసుకుంటాననీ అన్నారు. విషయాన్ని అధ్యయనం చేస్తున్నాననీ, మరి కొంత సమయం తీసుకునే అధికారం తనకు ఉన్నదనీ వివరించారు.
తెలంగాణ వరిధాన్యాగారంగా మారినందుకు గర్వించాలనీ, వ్యవసాయరంగంలో మనం సాధించిన ప్రగతి గర్వకారణమనీ గవర్నర్ వ్యాఖ్యానించారు. పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా తనకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయనీ, తెలంగాణ గవర్నర్ గా కంటే పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతల బరువు ఎక్కువనీ, అందుకు అక్కడ సోమ, మంగళ, బుధవారాలు ఉంటున్నాననీ, ఒక రోజు ప్రయాణంలో పోతోందనీ, శుక్ర, శని, ఆదివారాలు హైదరాబాద్ లో ఉంటున్నాననీ, పుదుచ్ఛేరిలో ఉన్నా హైదరాబాద్ రాజ్ భవన్ తో సంపర్కంలో ఉంటాననీ, హైదరాబాద్ లో ఉన్నప్పుడు పుదుచ్ఛేరిలో ఏమి జరుగుతోందో తెలుసుకుంటూ ఉంటాననీ వివరించారు.
ఉన్నతవిద్యారంగంలో పరిణామాలు సవ్యంగానే ఉన్నాయనీ, పూర్తిస్థాయిలో విశ్వవిద్యాలయ కులపతుల నియామకం జరిగిందనీ, ఇది శుభపరిణామమనీ అన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలను రాజకీయ నాయకులు నెలకొల్పడం గురించి అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు.