- మనదైన ఆయుర్వేదాన్ని పరిరక్షించుకుందాం
- అలోపతికి సమాంతరంగా ఆయుర్వేదాన్నీ అభివృద్ది చేద్దాం
ఆయువుకు అంటే? ప్రాణానికి, జీవుని ఆరోగ్యానికి సంబంధించిన జ్ఞానం కలిగివున్నదే ఆయుర్వేదం. ఆయుః (జీవం) + వేదం (జ్ఞానం) = ఆయుర్వేదం అని పూర్వరుషులు దీనికి నామకరణం చేశారు. ఇది సంపూర్ణంగా భారతీయమైన వైద్యఆరోగ్యశాస్త్రం. దాదాపు 5-6 దశాబ్దాల క్రితం వరకూ భారతీయులు ఈ వైద్యాన్నే నమ్ముకున్నారు. జీవన విధానం + ఆయుర్వేద వైద్యం మనల్ని చాలాకాలం ఆరోగ్యంగా ఉంచింది. మెల్లగా భారత్ లో ఇంగ్లిష్ వైద్యం పెరిగిపోయింది. ఆయుర్వేదం అటకెక్కింది. ఏదో కొన్ని చోట్ల, కొంతమంది మాత్రమే ఇంకా అనుసరిస్తున్నారు. ఇంగ్లిష్ వాళ్లు భారతదేశాన్ని అక్రమంచిన కాలంలోనే మనతనం మనం చాలా కోల్పోయాం. వారి తనం తలకెక్కించుకున్నాం. వేషం, వేడుకలు, భాష, ఆహారం, ఆహార్యం, జీవనవిధానం మొత్తంగా మారిపోయింది. అందులో మన వృత్తులు, కళలు, సాహిత్యం, సంప్రదాయం, సంస్కృతి మొత్తం కొట్టుకుపోయాయి. అలా కొట్టుకుపోయి, ఇంకా మిణుకు మిణుకుమంటూ మిగిలివున్న కాంతి ఆయుర్వేదం. అడుగడుగునా వ్యాపారం, కమీషన్లు, బ్రోకరేజ్ లతో భ్రష్టు పట్టిన వ్యవస్థ వైద్యరంగం.
Also read: ఉడికిపోతున్న ఉక్రెయిన్
భారతీయతను విస్మరించాం
మనిషి మనుగడకు, ప్రగతికి మూలమైన విద్య, వైద్యం, ఆహారం, జీవన విధానంలో చాలావరకూ భారతీయత నుంచి బయటకు వచ్చేశాం. వచ్చేశాం కాదు, తెచ్చేశారు. మనల్ని దురాక్రమించిన దేశాలు మనల్ని వదిలివెళ్ళిపోయినా, అంటగట్టిన సంస్కృతి అలాగే వుంది. ఇంకా పెరిగింది. పెరుగుతోంది. మన జీవన సంస్కృతిపై ఒక పథకం ప్రకారమే కుట్ర జరిగింది.ఇంకా జరుగుతోంది. ఇది గుర్తించేలోపు చాలా కోల్పోయాం. కరోనా వల్ల దుష్ప్రభావాలు ఎలా ఉన్నప్పటికీ, మనతనాన్ని మనం వెతుక్కునే ఒక గొప్ప సందర్భాన్ని కరోనా కాలం సృష్టించింది. మనదైన యోగవిద్యకు దగ్గరవుతున్నాం. మనదైన ఆహారానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాం. ప్రకృతి సేద్యం, ఆయుర్వేదంలోని గొప్పతనాలు మెల్లగా తెలుసుకుంటున్నాం. అయితే, ఆచరణే ఇంకా బాగా పెరగాల్సివుంది. ఈ క్రమంలో, రాజకీయాలు పక్కన పెడితే, భారతీయ జనతా పార్టీ(బిజెపి) ప్రభుత్వం భారతీయతను మనకు గుర్తు చేసే గొప్ప ప్రయత్నం చేపట్టింది. ప్రపంచమంతా యోగా దినోత్సవం జరుపుకుంటూ యోగాభ్యాసం వైపు మరలడానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్ఫూర్తిగా నిలిచారు. ఆయుర్వేదంవైపు కూడా దృష్టి పెట్టారు. ఆత్మనిర్భర్ లో భాగంగా, స్వదేశీవిధానానికి పెద్ద పీట వేస్తున్నారు. “ఆయుష్మాన్ భారత్” ఆయుర్వేదానికి కూడా వర్తింపచేయాలంటూ అప్పటి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సైతం పిలుపునిచ్చారు. ఇది చాలా అభినందించాల్సిన విషయం. ఆచరణలో చేపట్టాల్సిన అంశం. బిజెపి ప్రభుత్వం భారతీయతకు పెద్దపీట వేస్తూ,ఆచరిస్తుందనే ఆశిద్దాం. భారతీయుల జీవన విధానానికి, జన్యుపరమైన అంశాలకు, వాతావరణానికి, శీతోష్ణపరిస్థితులకు అత్యంత అనువైన విధానం ఆయుర్వేదమని మన పూర్వులు గుర్తెరిగి, మనకు అందించారు. రోగ నిరోధకశక్తి జన్యుపరమైన అంశంగానే కొందరు వైద్యులు చెబుతున్నారు.
Also read: నవ్యాంధ్ర నిండుగా వెలగాలి
రోగనిరోధకశక్తి పెంచాలి
ఆయుర్వేదాన్ని మరింత అధ్యయనం చేసి, రోగ నిరోధకశక్తిని పెంచుకొనే అవకాశాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. అదే సమయంలో, దీర్ఘకాలిక వ్యాధులకు గురికాకుండా చూడడం, వచ్చినవారికి వాటి దుష్ప్రభావాల నుంచి రక్షణ కల్పించడం మొదలైన వాటిపై ఆయుర్వేదాన్ని సద్వినియోగం చేసుకోవాలి. “వ్యాధి నిరోధకతకు ఆయుర్వేదం” అనే అంశంపై సీ ఐ ఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఇది మంచి పరిణామం. ఈ తరహా సదస్సులు ఇంకా ఎక్కువగా జరగాల్సివుంది. సహజంగా అందుబాటులో వుండేవాటితోనే, ఆయుర్వేద విధానం ద్వారా కరోనా వంటి వైరస్ లతో పోరాటం చేసి, గెలిచే సామర్ధ్యం పొందవచ్చనీ, ఆ శక్తి ఆయుర్వేదానికి వుందనీ ఈ సదస్సులో పాల్గొన్న నిపుణులు, శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. పాతదంతా మంచిది, కొత్తదంతా చెడ్డదనే అభిప్రాయానికి రానక్కర్లేదు. ఆధునిక వైద్యశాస్త్రంలోనూ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. గొప్ప ప్రయోగాలు చేస్తూ, సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ వైద్యరంగంలో పురోగతి సాధిస్తున్న నేటి శాస్త్రవేత్తలు నాటి మహర్షులకు సమానమైనవారే. అందులో ఎటువంటి సందేహం లేదు.
Also read: కాంగ్రెస్ ఖడ్గధారి ఖడ్గే
డబ్బుజబ్బు పెరుగుతోంది జాగ్రత్త!
వైద్య రంగంలో డబ్బుజబ్బు పెరిగిపోవడం మాత్రం చాలా అభ్యంతకరమైన, అనారోగ్య పరిణామం. ఈ తీరును అరికట్టకపోతే ఆయుర్వేదమైనా, అలోపతిఅయినా, హోమియోపతి అయినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆధునిక వైద్య విధానాన్ని, ఆయుర్వేదం వంటి సంప్రదాయ పద్ధతులను కలగలుపుకుని ముందుకు సాగాలి. ప్రకృతికి, రుతువుల పరిణామాలకు, మనిషి ఆరోగ్యానికి ఎంతో సంబంధం వుంది. అదే సమయంలో, రుతువులు సమతుల్యంగా వుండే సహజసిద్ధమైన వనరులు, వాతావరణం ఉన్న దేశాల్లో ప్రపంచంలోనే భారతదేశం అగ్రశ్రేణిలో ఉంది. కాలుష్య ప్రభావంతో ఈ రుతువుల విధానం చాలా వరకూ దెబ్బతిన్నా, భారత్ లో ఎంతోకొంత ఇంకా సజీవంగా వుంది.ఈ రుతువుల వ్యవస్థను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం.ఇప్పటికీ ప్రాధమిక, అత్యవసర సేవల్లో ఆయుర్వేదం పాత్రకు ప్రాముఖ్యత వుంది. ఆయుర్వేదంకు ఇంకా ప్రచారం చాలా పెరగాలి. ప్రయోగాలు పెరగాలి. బడ్జెట్ కేటాయింపులు భారీగా జరగాలి. ఈ విద్యను అభ్యసిస్తున్నవారికి, సేవలు అందిస్తున్నవారికి ఉపాధి, ప్రోత్సాహం ఎంతో పెరగాలి. ఆరోగ్యమైన విధానంలో, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ఊపందుకోవాలి. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు, తాళపత్రాల సేకరణకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి. ఆయుర్వేదం మన ఆయుష్షును, యశస్సును మరింత పెంచే గొప్ప శాస్త్రం. మనదైన ఈ విధానాన్ని మనం కాపాడుకుందాం. మనల్ని మనమే రక్షించుకుందాం.
Also read: జాతిని వెలిగించే వేడుక