అమ్మ పెట్టే గోరుముద్దలు తినకుండా మారాం చేస్తుంటే
ఆరుబయటకు తెచ్చి వెన్నెల కురిపించే చంద్రుడిని చూపిస్తూ
చందమామ రావే- జాబిల్లి రావే అంటూ పాటలతో ఏమార్చి
అన్నం ముద్దలు మింగించేది అమ్మ
చల్లని చందమామను ఆనందంగా చూస్తూ
తనుకూడా మనతోపాటే నడుస్తున్నాడనుకునే వయసది.
డాబాపై పిండారబోసిన వెన్నెల
చల్లటి చంద్రకాంతి ఒళ్ళంతా పారాడుతుంటే
మనసు వెచ్చనై
తన నేత్రాల చుట్టూ తిరిగుతుంది
చందమామలాంటి లేతమొహం
తలచుకుంటేనే మోహం ముంచుకొస్తుంది
భావోద్వేగంతో మనసు పరుగులుతీసే వయసది
చంద్రుడిమీది ఆసక్తి అనాది
సూర్యుడికోసం హనుమ ఎగరడం విన్నాం
చంద్రుడి ఆకర్షణ మనకు
అనుభవ పూర్వకంగా తెలుసు
రష్యావాడు లైకాను పంపిన నాటి నుండి
నీల్ ఆమ్ స్ట్రాంగ్ చంద్రుడిపైకి చేరే వరకు
ఊరుకోలేకపోయాం
అప్పటి నుండి ఇప్పటిదాకా విశ్వాన్ని చూస్తూనే ఉన్నాం
చూసిరావడంతో తృప్తిపడకుండా
అక్కడ నివాసాల ఏర్పాటు కోరుకుంటున్నాం
అక్కడ దొరుకుతాయని ఆశించిన ఖజానా,
ఖనిజాలేమీ దొరక్కపోయినా
చంద్రుడి సాంగత్యం కోసం ఉర్రూతలూగుతున్నాం
మలిచంద్రయానంతో
ఇస్రో దాన్ని సాకారం చేస్తుందని భావిస్తున్నాం
అందుకు ఆ సూర్యచంద్రుల దీవనలు ఆశిస్తున్నాం.