మోడీ రెండోసారి అధికార పీఠం ఎక్కిన తర్వాత మన ప్రభుత్వంలోనే కాదు, ఈ దేశంలో కూడా ఎక్కడ ఎప్పుడు ఏం జరగబోతోందో కాకలు తీరిన రాజకీయనాయకులే కాదు, చిన్నపాటి పత్రికా రచయితలు సైతం ఊహించగలుగుతున్నారు. సరిగ్గా ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయే ముందు మన సైనిక శిబిరం మీద దాడి జరుగుతుంది. దానిని బూచిగా చూపించి మోడీ ప్రజలలో ఒక కృత్రిమ దేశభక్తిని రగిలించడానికి ప్రయత్నించడం పరిపాటి. కొన్నిసార్లు జార్జి ఆర్వెల్ రాసిన ‘ఏనిమల్ పామ్’ నవలలో నెపోలియన్ చెప్పిన డైలాగులే కొంచెం అటూఇటూగా మన ప్రధాని చెప్పడం విడ్డూరం. ఈ సారి భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగారా ఇంకా మోగించక ముందే రెండు చర్యలు జరిగాయి. ఒకటి డ్రోన్లతో సుమారు ఏడు నుంచి ఏడున్నర కిలోల మందుగుండుతో మన సైనిక శిబిరాలమీద ఉగ్రవాదులు దాడులు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఎప్పటిలాగా మనం వాటిని నమ్ముతున్నాం. రెండోది మంత్రివర్గ విస్తరణ.
Also read: వారు బయటకొస్తారా?
భయం మొదలైంది
వివిధ సామాజిక వర్గాలకు కేటాయించిన బెర్తులను చూస్తే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ వ్యూహాన్ని మన ప్రధాని మోడీ అనుసరించినట్టు కనిపిస్తోంది. పకడ్బందీ ప్రణాళికతో మంత్రివర్గాన్ని విస్తరించడానికి కారణం అందరికీ విదితమే. తాను పలుసార్లు అధికారంలోకి రావడానికి కారణమైన రాజకీయ వ్యూహాలను రచించి సహకరించిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించడమే. నిజానికి ప్రజాస్వామిక వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తోన్న మోడీని అధికారం నుంచి దించాలని ప్రశాంత్ కిశోర్ పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత విస్పష్టంగా ప్రకటించారు. మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రజలకు రాహుల్ గాంధీని చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలన్నీ నిగూఢమైన ఈ విషయాన్ని గమనించి సహకరిస్తేనే భారత రాజకీయాలలో కీలకమలుపు చూడగలుగుతాం. సామాజిక మాధ్యమాలను ఎలా వినియోగించుకోవాలో ప్రశాంత్ కిశోర్ ఉగ్గుపాలతో నేర్పిన పాఠాలు.. ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సామాజిక వేదికలతో ఇటీవల బెడిసికొడుతున్న తమ సంబంధాల నేపథ్యంలో ఏం జరగనుందోనని భాజపా కేడర్ విస్తుపోతూ చూస్తోంది. బెంగటిల్లి డోలాయమానంలో పడిన తమ దేశవ్యాప్త క్యాడర్ ఆత్మవిశ్వాసాన్ని ఎలా ప్రోదిచేయాలని నాయకత్వ శ్రేణి ఆలోచిస్తోంది.
Also read: జల జగడం
మీడియా సహకారం మరువలేనిది
మోడీ అధికారంలోకి రావడానికి హిందుత్వవైపు మొగ్గుచూపిన ఒక పక్షపు మీడియా చేసిన కృషి అందించిన సహకారం మరువలేనిది. ప్రజల కష్టాలనుంచి గట్టెక్కించే ఆపద్బాంధవుడైన సూపర్మేన్ ఇమేజ్ నిచ్చి, మరోవైపు రాహుల్ గాంధీని అమ్మకూచి బిడ్డలాగా చూపించిన వైనం దేశ ప్రజలందరికీ తెలిసిందే. మన మీడియా ప్రదర్శించిన ఆ రెండూ తప్పని ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. కష్టాలొచ్చినప్పుడు ఆదుకోకుండా ప్రజలను వారిమానాన వారిని నిర్దాక్షిణ్యంగా వదిలేసిన మోడీని ఒకవైపు చూడగలిగారు. మరోవైపు నిర్భయంగా ప్రజలతో కలసిమెలసిపోతూ ఈ దేశపు యువతరంతో సంభాషిస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా ప్రశ్నలను ఆహ్వానిస్తూ, చెదరని చిరునవ్వుతో సవాళ్లను ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీని చూస్తున్నారు. తమ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు పథకాలను రూపొందించిన కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం వంటి పలు కీలక పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ గురించి వారికి తెలుసు. అదే సమయంలో కార్పొరేట్లకు లాభం చేకూర్చే పథకాలు, గుజరాతీ వ్యాపారస్తులకు అనుకూలమైన ప్రభుత్వ విధానాలు రూపొందించిన మోడీ ప్రభుత్వ పాలన స్వరూప స్వభావాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మెజారిటీ ప్రజలలో మతపరమైన భావోద్వేగాలను రగిలించి తాత్కాలికంగా తమ పబ్బం గడుపుకొనే మతతత్వ రాజకీయాల తీరు, ధోరణి తెలుసుకోవడంతో పాటు, భవిష్యత్తులో వాటి ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయగలుగుతున్నారు.
Also read: సిక్కోలు రైతుకు బాసట
కావలసింది రచ్చ జరగడమే!
ప్రతిసారి లోక్ సభ వర్షాకాల సమావేశాలలో ఒకటే తంతు పునరావృతమవుతోంది. సరిగ్గా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవడానికి వారం రోజుల ముందు ఏదో ఒక లీక్ ప్రతిపక్షాల చేతికి అందుతుంది. ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయడానికి ప్రతిపక్షాలకు గొప్ప అస్త్రం లభించిందని పత్రికలు రాస్తాయి. ఆ రాసిన పత్రికలన్నీ పరోక్షంగా ప్రభుత్వానికి దన్నుంటాయని అందరూ మర్చిపోతారు. రెండు మూడు వారాలపాటు కొనసాగే లోకసభ సమావేశాలలో దేనిమీదా సరైన చర్చ జరగకుండా ఒక ప్రత్యేక విషయమ్మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలన్నీ మొండిపట్టు పడతాయి. అంతటితో ఊరుకోకుండా, సభ జరగనివ్వకుండా రచ్చ చేస్తాయి. ప్రభుత్వానికి కావలసిందిదే. సమావేశాలు జరిగే రోజులన్నీ ఈ ఆగ్రహావేశాలతో ఉభయ సభలూ మార్మోగిపోవాలి. చివరి రెండు రోజులలో మొత్తం బిల్లులన్నీ అసలు చర్చే లేకుండా సభలో పాసయిపోతాయి. ప్రతిపక్షాలు కొంతకాలానికి సద్దుమణుగుతాయి. ప్రజలు మాత్రం పదేపదే ఫెయిలవుతారు.
Also read: స్వదేశీ అంటే..?
సునామీలా మెగాసస్
ఈసారి పార్లమెంటు సభలను పెగాసస్ వివాదం సునామీలా చుట్టేసింది. పెద్దఎత్తున ప్రభుత్వ నిధులను కేటాయించి ఇజ్రాయేలీ సెక్యురిటీ సంస్థ పెగాసస్ దగ్గర కొన్న పరికరాలతో అధికారుల, రాజకీయ నాయకుల, జర్నలిస్టుల, ఇతర పెద్దల మొబైల్ ఫోన్ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని ఇప్పుడు జరుగుతున్న గొడవ. 2020 లో కరోనా విలయతాండవం చేస్తుండడం వల్ల చాలా కొద్ది రోజులు మాత్రమే సభ నడిచింది. రైతులు కొన్ని చట్టాలను వ్యతిరేకించడం వల్ల వారికి మద్దతుగా నిలిచి ప్రతిపక్షాలు 2019లో సైతం ఉభయసభలను ఇదే మాదిరిగా నడవనివ్వలేదు. అప్పుడు గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఎటువంటి చర్చ జరగకుండానే 28 బిల్లులకు మమ అనిపించేశారు. అందులో జమ్ము-కశ్మీర్ పునర్విభజన చట్టం వంటి ఒక కీలకమైన చట్టంపైన ఉభయసభలలో కలిపి కేవలం ఏడున్నర గంటలపాటు చర్చ జరిగింది. మిగిలిన చాలా బిల్లుల గురంచి కనీసం రెండు గంటల కూడా చర్చ జరగకుండానే మద్దతు పొందడం విషాదకరం. 2018లో పార్లమెంటు సమావేశాలను పౌరసవరణ చట్టంపై ప్రతిపక్షాలు చేసిన గొడవతో హోరెత్తించాయి. దీనివల్లనే ప్రజాస్వామ్యం ప్రాభవం కోల్పోయిందని పదేపదే అనుకోవడం.
Also read: మూతపడనున్న ఇంటర్ బోర్డు?
ఇదొక రాజకీయ క్రీడ
మోడీ ప్రభుత్వానికి ఇదొక క్రీడలాగా మారింది. ప్రతిపక్షాలు ఈ మర్మాన్ని గ్రహించలేకపోతున్నాయి. రఫేల్ సంస్థతో ప్రజలకే కాదు ప్రతిపక్షానికి సైతం చెప్పకుండా చేసుకున్న రక్షణ కొనుగోలు ఒప్పందాల నుంచి ధరల పెరుగుదల మీదుగా సుప్రీంకోర్టు తీర్పుల వరకు అనేక అంశాలపై ఉభయసభలలో చర్చల రచ్చ చేసేకన్నా వాటిని ప్రజలముందుకు తీసుకెళ్లడం మంచిది. ఈ విషయంలో అన్ని పార్టీలు ఘోరంగా విఫలమవుతున్నాయి. విజృంభించిన కరోనా మహమ్మారిని అరికట్టడంలో ప్రభుత్వ ఘోరవైఫల్యం, పెరుగుతున్న పెట్రోలు, ఇతర వినియోగ వస్తువుల ధరలు, రెట్టింపు వేగంతో కొందరినే సంపన్నులను చేస్తోన్న ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని ప్రభుత్వ పాలన నిర్ణయాలు వంటివి ప్రజల ముందుకు తీసుకువెళ్లాలి.
Also read: పలుకే బంగారమాయే!