రామాయణం –114
సుగ్రీవా నీ వంటి మిత్రుడు లభించుట నా అదృష్టము నీతో కలసి యుద్ధములో శత్రువులందరినీ జయించగలవాడను. అని తన ఆనందమును వ్యక్తపరుస్తూ రాముడు మాట్లాడుతున్నాడు.
ఇంతలో ….. ఆకాశమును పెనుధూళి మేఘములు ఆవరించినవి, పట్టపగలే చిమ్మచీకట్లు కమ్మివేసినవి. కోలాహలం ఒకటే కోలాహలం. అదేమిటా అని రాముడు ఆశ్చర్యముతో చూస్తూ ఉండగానే కోటానుకోట్ల వానరులు ఆకసమునుడి భూమిమీద వాలారు.
Also read: రామునికి సుగ్రీవుని పాదాభివందనం
వారిలో రకరకాల రంగులవారున్నారు. ఆ ప్రాంతమంతా చిత్రవిచిత్ర వర్ణాలతో ఉన్న వానరులు, భల్లూకములతో నిండిపోయింది. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులున్నాయో అన్ని రంగులతో అక్కడి భూమి నిండిపోయి కనపడ్డది.
ఎవరెవరు ఎంత సైన్యముతో వచ్చారంటే…
శతబలి లక్షకోట్లు
తార తండ్రి సుషేణుడు
చాలా వేలకోట్లు
రుమ తండ్రి వేయి కోట్లు
హనుమంతుని తండ్రి కేసరి వేలకోట్లు
గోలాన్గూలముల రాజు గవాక్షుడు వెయ్యికోట్లు
Also read: లక్ష్మణుడిని శాంతబరచిన తార
భల్లూక రాజు ధూమ్రుడు, పనసుడు, నీలుడు, గవయుడు, దరీముఖుడు, అశ్వనీ దేవతల పుత్రులు మైంద ద్వివిదులు, గజుడు, జాంబవంతుడు, రుమణుడు, గంధమాదనుడు, అంగదుడు, తారుడు, ఇంద్రజానువు, రంభుడు, దుర్ముఖుడు, హనుమంతుడు, నలుడు, శరభుడు, కుముదుడు, వహ్ని మొదలుగాగల మహావీరులు అసంఖ్యాకమైన తమ సేనతో సుగ్రీవుని సమక్షమున నిలుచున్నారు.
అర్బుదములు దాటింది. పద్మములు దాటింది. మహాపద్మములు దాటింది. సముద్రము మీరింది. పరార్ధము కూడా దాటిపోయింది. లెక్కకు అందనంత మంది వానరవీరులు రణసన్నద్ధతతో రాముని ఎదుట ఆయన ఆజ్ఞ కోసము నిరీక్షిస్తున్నారు.
వచ్చిన వారందరినీ రామునకు పరిచయము చేసి సుగ్రీవుడు రాముని ఆజ్ఞ నిమిత్తము వేచిఉన్నాడు.
Also read: సుగ్రీవుడిని హడలెత్తించిన లక్ష్మణ ధనుష్టంకారం
‘‘రామా ఇక నీ ఆజ్ఞ! మన తదుపరి కర్తవ్యమేమో నిశ్చయింపుము.’’
అనిన సుగ్రీవుని చూసి.. రాముడు ,
‘‘మిత్రమా, ముందు మనము సీత జీవించియున్నదో లేదో తెలుసుకొనవలెను. ఆ రావణుడు వసించు ప్రదేశమేదో తెలుసుకొనవలెను. సీతను గురించి, రావణుని నివాస స్థానము గురించి తెలుసుకొన్న పిమ్మట మన మేమి చేయవలెనో నిశ్చయించుకొందము.
‘‘సీతాన్వేషణ చేయుటకు నాకు గాని లక్ష్మణునకు గానీ తగు సామర్ధ్యము లేదు. అందుకు నీవే తగిన వాడవు. ఆ విషయములో ఏమి చేయవలెనో నీవే నిర్ణయించుము.’’
రాముని నోట ఆమాట వెలువడగానే సుగ్రీవుడు ఒక పర్వతాకారుడైన వానరుని పిలిచెను.
ఆయన పేరు వినతుడు. ఆయన వానర సేనానాయకుడు …
‘‘వినతా, నీవు ఒక లక్షమంది వీరులను తీసుకొని తూరుపు దిక్కుగా బయలు దేరు. అక్కడి గిరిదుర్గములు వనములు నదులందు రావణుని స్థానము వెతుకుము. అచట సీత ఉన్నదేమో చూడుడు.
Also read: రామసందేశంతో సుగ్రీవుడి దగ్గరికి బయలుదేరిన రామానుజుడు
‘‘గంగా, సరయు, కౌశికి, యమునా, సరస్వతి, సింధు, నదులను, బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశి, కోసల, పుండ్ర, అంగ, మగధ దేశములలోని మహా గ్రామములను, వెండిగనులుగల దేశములను సీతాదేవి కొరకై వెదకండి.
‘‘సముద్రములో మునిగిఉన్న పర్వతాలను, పట్టణములను, దీర్ఘమైన మందర పర్వత అగ్ర భాగమును ఆశ్రయించి కొందరు నివసించుచుందురు. వారిలో కొందరికి చెవులు ఉండవు. కొందరికి పెదవులే చెవులు. కొందరి ముఖము ఇనుప ముఖమువలె భయంకరముగా ఉండును. కొందరి శిరస్సులు దీర్ఘముగా ఉండును. కొందరు బంగారు చాయతో చూచుటకు అందముగా ఉందురు. అటుపైన ఏడు రాజ్యములతో కూడిన యవదేశమును, సువర్ణద్వీపమును,గాలింపుడు.
‘‘యావ ద్వీపమునకు ఆవల శిశిర పర్వతము కలదు. దానికవతల శోణ నదమున్నది. ఆవల ఉద్ధతమైన సముద్రము కలదు. అది కాల మేఘ ప్రతిమము. అచట చాయా గ్రాహులైన రాక్షసులున్నారు. అక్కడ రావణుడున్నాడేమో వెతికి కనుగొనండి’’ అని చెపుతూ తూరుపు దిక్కు అంచు వరకూ అన్ని ప్రదేశముల వివరములు సుదర్శన ద్వీపము వరకూ చెప్పి వారికి ఒక నెల గడువు ఇచ్చినాడు.
ఆ గడువు దాటి వచ్చినట్లయితే వారికి మరణ దండనే అని హెచ్చరించి వెంటనే బయలుదేరి పయనమై పొమ్మన్నాడు.
Also read: సుగ్రీవునికి హనుమ మేల్కొలుపు
వూటుకూరు జానకిరామారావు