అవినీతినీ, కుంభకోణాలను బట్టబయలు చేయాలంటే డబ్బు ఆచూకీ తెలుసుకోవాలి. దొంగను దొరకపుచ్చుకోవాలంటే డబ్బు ఎక్కడికి పోయిందో దాని జాడ పసిగట్టాలన్నది పరిశోథనాత్మక జర్నలిజంలో ప్రాథమిక సూత్రం. అది రాజకీయ కుంభకోణం కావచ్చు, స్టాక్ మార్కెట్ వ్యవహరం కావచ్చు, బోఫోర్స్ లేదా రఫేల్ వ్యవహారం కావచ్చు, మరేదైనా మతలబు కావచ్చు. దోషిని పట్టుకోవాలంటే డబ్బు ఆచూకీ తెలుసుకోవలసింది.
అమెరికా ఖర్చు 2.26 ట్రిలియన్ డాలర్లు
అఫ్ఘానిస్తాన్ లో రెండు దశాబ్దాలలో అమెరికా ఖర్చు పెట్టింది 2.26 ట్రిలియన్ డాలర్ల. ట్రిలియన్ అంటే ఒక మిలియన్ మిలియన్లు. మిలియన్ అంటే పది లక్షలు. పది లక్షల పది లక్షలు. వంద లక్షలైతే ఒక కోటి. ట్రిలియన్ అంటే లక్ష కోట్లు. అమెరికా అఫ్ఘానిస్తాన్లో ఖర్చు చేసిన మొత్తం 2.26 లక్షల కోట్ల డాటర్లు. డాలర్ విలువ ఈ రోజున (సోమవారం, 06 సెప్టెంబర్ 2021) 73 రూపాయలు. 2.66 ట్రిలియన్ డాటర్లు అంటే సుమారు 165 లక్షల కోట్ల రూపాయలు. ఇంత సొమ్ము ఎటుపోయింది? ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేశామని అమెరికా అధ్యక్షులు అంటున్నారు. ఆ డాటర్లన్నీ ఎటుపోయాయి? అఫ్ఘాన్ ప్రజల డబ్బులు దగ్గర లేవు. అఫ్ఘాన్ పౌరుడు తన జీవితంకోసం రోజుకు రెండు డాలర్లు కూడా ఖర్చు పెట్టడు. వాస్తవం ఏమంటే ఈ డబ్బులో అత్యధిక భాగం అమెరికాకే వెనక్కి వెళ్ళిపోయింది. అసలు వస్తే కదా అమెరికా తిరిగి వెళ్ళడానికి? అమెరికాలోనే చేతులు మారింది. ఎట్లా? మారణాయుధాలు ఉత్పత్తి చేసే కంపెనీల ద్వారా. కాంట్రాక్టర్ల ద్వారా. అమెరికా అఫ్ఘానిస్తాన్ యుద్ధాన్ని ఔట్ సోర్స్ చేసింది. యుద్ధాన్ని అమెరికన్ ప్రైవేటు కంపెనీలకు కాంట్రాక్టుకు ఇచ్చారు. ఈ కంపెనీలే వాహనాలనూ, యుద్ధశకటాలనూ, విమానాలనూ, మందుగుండు సామగ్రినీ సరఫరా చేశాయి. అఫ్ఘాన్ సైనికులకు ఈ సంస్థలే శిక్షణ ఇచ్చాయి. ఈ పనులన్నీ వారు ఉచితంగా చేయలేదు. అన్నిటికీ డబ్బులు చెల్లించింది అమెరికా ప్రభుత్వం. డబ్బు చెల్లించింది అమెరికా ప్రభుత్వం. డబ్బు తీసుకున్నది అమెరికా కంపెనీలు. అంటే డబ్బు అమెరికాలోనే ఉంది. అమెరికా బయటకి డబ్బు రాలేదు.
5 పెద్ద కంపెనీలకు భోజనం
అమెరికా కాంగ్రెస్ లో అమెరికాలోని అయిదు పెద్ద కంపెనీలకు 2001 నుంచి 2021 వరకూ అప్ఘాన్ యుద్ధాన్ని కాంట్రాక్టుకు ఇచ్చింది. ఆ కంపెనీలకు 2.02 ట్రిలియన్ డాలర్లు చెల్లించింది. ఆ కంపెనీలు ఏవి? అమెరికాలోని అగ్రశ్రేణికి చెందిన అయిదు మిలిటరీ కాంట్రాక్టు కంపెనీలు. లాక్హీడ్ మార్టిన్, రేథియాన్, జనరల్ డైనమిక్స్, బోయింగ్, నార్త్ త్రాప్ గ్రమ్మన్. అఫ్ఘానిస్తాన్, ఇరాక్, సిరియాలలో అమెరికా చేసి ఓడిన యుద్ధాల నిమిత్తం ఈ డబ్బు ఖర్చు చేశారు.
అమెరికాలో 18 సెప్టెంబర్ 2001 నాడు స్టాక్ మార్కెట్ ధరలు పదిరెట్లు పెరిగాయి. ఆ రోజు వెయ్యి డాలర్ల విలువైన షేర్లు కొని ఉంటే వాటి విలువ ఈ రోజు పదివేల డాలర్లు. అఫ్ఘాన్ యుద్ధం ఇరవై ఏళ్ళు సాగింది. యుద్ధం ఎంతకాలం సాగితే లాభాలు అంత ఎక్కువగా ఉంటాయి. అఫ్ఘాన్ సైన్యాన్ని తాము ఎట్లా నిర్మించామో పెంటగాన్ గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఆ సైన్యం ఒక్క తూటాకూడా పేల్చకుంటా తాలిబాన్ కు లొంగిపోవడమో, వారిలో కలిసిపోవడమో లేక పంజ్ షీర్ కు వెళ్ళిపోవడమో చూశాం. అఫ్ఘానిస్తాన్ సైనికులకు అమెరికా రైఫిళ్ళు ఇచ్చారు. అమెరికా సాంకేతిక పరిజ్ఞానం అందించారు. వారు అమెరికా ట్రక్కులు నడిపారు. అమెరికా విమానాలు నడిపారు. వీటన్నిటినీ అమెరికా ఆయుధ కాంట్రాక్టర్ల నుంచి కొనుగోలు చేసినవే. అమెరికా అధ్యక్షభవనానికీ, కాంగ్రెస్ (పార్లమెంటు)లోని రాజకీయ నాయకులకీ, ఆయుధాల ఉత్పత్తి కర్మాగారాల డీలర్లకూ మధ్య రాయని ఒప్పందం ఇది.
వికీలీక్స్ వ్యవస్థాపకుడు అప్పుడే చెప్పాడు
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే అప్పుడే చెప్పాడు. అఫ్ఘాన్ యుద్ధాన్ని చూపించి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడంకోసమే ఈ యుద్ధ ప్రయాస అని. ఇందుకు అమెరికాలో, యూరప్ లోని పన్నుల వ్యవస్థను వినియోగించుకున్నారు. డబ్బు అఫ్ఘానిస్తాన్ పేరు మీద ప్రభుత్వ ఖజానా నుంచి ఆయుధాల డీలర్ల చేతుల్లోకి వెడుతుంది. అందుకు యుద్ధాన్ని సాధ్యమైనంత పొడిగించడమే లక్ష్యం కానీ గెలుపొందడం కాదని అసాంజే స్పష్టం చేశాడు. అప్ఘాన్ పునర్నిర్మాణానికి అమెరికా ఒక ప్రత్యేక సంస్థను స్పెషల్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో నియమించింది. 2018లో ఈ సంస్థ ఒక నివేదికను సమర్పించింది. 15 బిలియన్ డాలర్లు మాయమైనాయని ఈ సంస్థ వెల్లడించింది. బిలియన్ అంటే వందకోట్లు. అంటే 15 వందల కోట్లు స్వాహా అన్నమాట. ఇది సైనిక కార్యకలాపాలకోసం అయిన ఖర్చు కాదు. దేశాభివృద్దికోసం అయిన ఖర్చుకాదు. రోడ్లు, డామ్ ల నిర్మాణం పేరుమీద పెట్టని ఖర్చుకు చెల్లించిన మొత్తం. అమెరికా కంపెనీలు డబ్బు చేసుకోవడమే కాకుండా పరిస్థితిని చిందరవందర చేశాయి. అక్రమాలే కాదు అసమర్థతకూ, అవివేకానికీ చిహ్నంగా చాలా పనులు జరిగిపోయాయి. అఫ్ఘానిస్తాన్ సైనికులకు అడవులలో పోరాటం చేసేవారు ధరించే దుస్తులు ఇచ్చారు. కానీ అప్ఘానిస్తాన్ లో అడవులే లేవు. మొత్తం భూభాగంలో రెండు శాతమే అడవి. ఈ దుస్తులు ధరించడం వల్ల సైనికులను పోల్చుకోవడం తాలిబాన్ కు తేలికయింది. వేలసంఖ్యలో అఫ్ఘాన్ సైనికులు మరణించారు. ఈ దుస్తులకోసం అమెరికా కాంట్రాక్టర్లకి 280 లక్షల డాలర్లు చెల్లించారు. పర్యవేక్షణ లేదు. తనిఖీ లేదు. అఫ్ఘాన్ ప్రజలకు ఏమైనా లబ్ధిచేకూరిందా అంటే ఏమీ లేదు. ఇప్పటికీ వారు ఆకలితో, దారిద్ర్యం తో అలమటిస్తున్నారు. ఇరవై ఏళ్ళ యుద్ధంలో అమెరికా సైన్యం నష్టబోయింది. సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ అమెరికా కంపెనీలు లాభాలు చేసుకున్నాయి. (Wion టీవీ సౌజన్యంతో)
Capital manages all