బొమ్మలేయడమా? పుస్తకాలు చదవడమా? అతి చక్కని రాతలు రాయడమా? మందు కొట్టడమా?పొగలూదడమా? మిత్రులతో రాత్రింబవళ్ళు కబుర్లు పారించడమా? జోకులా? వెటకారాలా? సుతిమెత్తని మాటల దెబ్బలా? సుతారంగా మీసాన్ని నిమురుతూ కూచోడమా…. ?
ఆయన ఎదురు టేబుల్ మీద న్యూస్ పేపర్ల వరుసలు అలా వరుసగా ఉండేవి. తెలుగులో వచ్చే ప్రముఖ దినపత్రికల మాట సరేలే. ఏషియన్ ఏజ్, ది టెలిగ్రాఫ్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందు, దెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ ప్రెస్, ది పయనిర్, హిందుస్థాన్ టైమ్స్, స్టేట్స్ మన్ … నాకైతే ఊరూ పేరూ తెలీని జాతి పేపర్లు. కేవలం నాకు గుర్తున్న దిన పత్రికల పేర్లు ఇవి. ఎన్నెన్ని పేపర్లు ఆయన ముందు పడి ఉండేవటే… ఆయన మీసం తడుముతూ అన్నిటినీ అలా చదువుతూనే పోయేవాడు. రాక్షస అధ్యయనం ఆ మనిషిది. చదివేవాడు, మాట్లాడేవాడు, చర్చించేవాడు. నన్ను ఇప్పటికిప్పుడు పట్టుకుని మన ఆర్థిక మంత్రి పేరు చెప్పమనండి. మీరు నాకు గంట టయమిచ్చినా ఆ పరిక్షలో గన్షాట్ గా తప్పి కూచుంటా . ప్రపంచ బ్యాంకు చైర్మన్ పేరు అడిగినా చెప్పేస్తాడు మోహన్ గారు . అంతకు ముందువాడు ఎందుకు దిగిపోయాడు, ఈ కొత్త వాడికి ఆ పదవి ఎలా వచ్చింది, అది ఇప్పించిన ఫలానా పెద్ద తలవాడి నడి బావమరిది పేరు కూడా తెలుసు ఆయనకు.
Also read: శ్రీరమణ పెట్టిన భిక్ష “బాపు”
మామూలు పుస్తకాలు, కథలు, ఫిక్షన్, పుల్లలు పుల్లలుగా పేర్చే కవితలు, నవలలు, తులనాత్మక భౌతిక వాదం, క్షేత్ర దర్శిని, వస్తుగుణ దీపిక, స్థలపురాణం, కలలు వాటి ఫలితాలు ఇటువంటి పుస్తకాలు ఏ సవాలక్ష గాళ్లయినా, అక్షర మాల ఏ మాత్రం వచ్చిన వాళ్ళయినా చదివేదేగా. కానీ న్యూస్ పేపర్లను ఇంత ఘనంగా చదివే మరొకడిని నేనయితే ఎరుగను, చెట్టు నా ప్రేయసి అనే పిచ్చి వ్యాసం రాసుకున్నాడు గానీ మోహన్ గారు, ఆయన ప్రేయసుల వరుస అయిన న్యూసు పేపర్ల గురించి ఎప్పుడూ రాయలా, ఆయన ఇంటర్యూలంటూ వచ్చిన కొన్ని అప్రయోజక, అసందర్భ కాలమ్ వరుసల్లో మీ దినపత్రికల ప్రేమ కథేమిటి మోహన్ జీ? అనే తెలివి ఎక్కువ ప్రశ్న అడిగినదెక్కడా అగుపించదు.
మామూలుగా మోహన్ గారు ఎప్పుడూ అనే మాట ఒకటుండేది. నేను బొమ్మ వేయని రోజంటూ ఇంతవరకు లేదబ్బా అని. అదంత నిజం కాదు. ఆయన బొమ్మ వేయని రోజులు ఉండేవి. ఆయన టిఫిన్ చేయని రోజులు కూడా ఉండేవి. ఆయన జేబులో డబ్బులు లేని రోజులు కూడా చాలా ఉండేవి. డబ్బులు లేక మేమిద్దరం పనుల మీద చాలా దూరాలు ఆర్డనరీ ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవాళ్ళం. ఒకసారి ఆయనతో యానిమేషన్ చేయించడానికి బాగా డబ్బున్నవారు ఆయన్ని తమ ఆఫీసు కు ఆహ్వానించారు. అది శివం దగ్గర. నేనూ, ఆయన చేతులు ఊపుకుంటూ ఆటోలో వెళ్ళాము. మోహన్ గారిని వెల్కమ్ చెయ్యడానికి ఆఫీస్ బయట ఓనర్ గారు ఉన్నారు. ఆయన్ని ఈయన ఈయన్ని ఆయన ఎప్పుడూ చూడలేదు. ఆటోలో దిగిన మోహన్ గారిని వాళ్ళు పట్టించుకోలేదు. మేమే కాస్త జేబుల్లో చేతులు కాసేపు పిసుక్కుని కాళ్ళు తొక్కుకుని, వారి దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకుంటే” ఆయన ఆశ్చర్యపోయి ‘‘మీరేనా మోహన్ ది గ్రేట్ ? ఏదీ మీ కారేది? ఏమిటిది ఆటోలో వచ్చారే?’’ అని ప్రశ్నల మీద ప్రశ్నలతో ఆయన ఈయన మీద పడిపోతే, సెకండ్ కూడా జంకని మోహన్ గారు, మా కారు రిపేరికీ వెల్లింది అని చెప్పారు. ముళ్లపూడి రమణ గారి జనతా ఎక్స్ ప్రెస్ లో నాలుగు కర్చీపులు కొన్న అమ్మగారితో షాపు గుమాస్తా వీటిని ఎక్కడ పెట్టమంటారు అమ్మగారు అనడుగుతే, బుల్లి అగ్గిపెట్టెంత ఉన్న తమ కారు అదేనని చూపించడానికి సిగ్గు అనిపించి, ‘నా కారు రిపేరికి వెళ్ళింది లెండి, అదిగో ఆ కనపడుతున్న మా డ్రైవర్ కారులో పెట్టండి’ అని ఒక సీన్ ఉంటుంది కదా, అక్కడి నుండే మా మోహన్ గారు తాను ఎప్పటికీ కొనని, కొనలేని కారుని రిపేరికీ పంపి ఉంటారని నా ప్రగాఢ నమ్మకం. ఇంతకీ చెప్పొచ్చేందంటే ఆటోకుకు కూడా డబ్బులు లేని రోజులు చాలా ఉన్నాయి ఆయనకు. కానీ న్యూస్ పేపర్ చదవని రోజు మాత్రం ఎప్పుడూ లేదు.
2017 సెప్టెంబర్ నెలలోని మూడవ వారమంతా ఆఫీసుకు సెలవు ప్రకటించేసి ఆ కేర్ హాస్పిటల్ మెట్ల దగ్గరో, ఆ ముందో, వెనుకో నేను, నావంటి మరికొందరు కేరాఫ్ లము అయి ఉన్న రోజులవి. విజిటర్స్ అని కార్డ్ పుచ్చుకుని సాయంత్రాలు ఆయన్ని చూడవచ్చు. ప్రతి రోజూ ఆయనని చూసేవాడిని. తేలిగ్గా మంచం మీద పడుకుని ఉండేవాడు. పక్కన ఒకటో రెండో న్యూస్ పేపర్స్ ఉండేవి, వాటిని చదువుతూ ఉండేవాడు. ఆయన మరణించడానికి ఒక రోజు ముందు అనుకుంటా మామూలుగా, దిగాలుగా ఆయన దగ్గరికి వెళ్ళి కలిసా. “మోహన్ గారు ఎలా ఉందండి?’ అని అడిగా ఆయన బాగా లేదని ఎప్పుడు చెప్పేవాడు కాదు. ఆ రోజు మాత్రం “ఏమి బాగా లేదబ్బా, పేపర్ కూడా చదవబుద్ధి కాలేదు” అన్నాడు. ఇప్పుడు ఆరు సంవత్సరాల తరువాత కూడా ఆయన పేపర్ కూడా చదవబుద్ధి కాలేదబ్బా అనే మాటని చెప్పడానికి నాకు గుండె దడగా దుఃఖంగా కన్నీరు మున్నీరు గా ఉంది.
శరీరం పడే నొప్పిని, మరణ సామీప్యాన్ని ఆయన న్యూస్ పేపర్ చదువుతో ముడిపెట్టుకుని దిగాలుగా చెప్పిన మాట తీరుని మాత్రం అప్పటికి ఇప్పటికి ఎప్పటికి భరించడం ఎంత కష్టమో చెప్పడం చాలా కష్టంగా ఉంది స్వామీ!
–అన్వర్