Monday, January 27, 2025

ప్రశ్నించడం నేర్చుకోపోతే పతనం ఖాయం

రాజ్యం బలమైనది అయినప్పుడు ప్రజలు బలహీనులవుతారు. ప్రజలమీద పెత్తనం చెలాయించడం ద్వారానే రాజ్యం తన బలప్రదర్శన చేస్తుంది. ప్రజాస్వామ్యం వర్థిల్లడం అంటే ప్రజలు బాగుండటం, స్వేచ్ఛగా, ధైర్యంగా, మానవీయ విలువలు పాటిస్తూ అందరూ సంతోషంగా జీవించడం. అంతేగాని భయపడుతూ, ఎందుకొచ్చిన గొడవని తప్పుకుంటూ, బిక్కుబిక్కుమంటూ బతుకులీడ్చడం కాదు. ప్రస్తుతం దేశంలో అధికసంఖ్యాకుల మాట నెగ్గుతోంది. టీప్పూ సుల్తాన్ వారసులను తరిమి కొట్టడం కూడా కాదు ఏకంగా చంపేయాలని కర్ణాటక మంత్రి బాధ్యతారహితంగా వాగితే అతగాడిని  ప్రశ్నించేవారే లేరు. అవును. కర్ణాటకలో బీజేపీ పరిస్థితి బాగాలేదు. ఏదైనా చేసి గెలవాలని బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తున్నది. వారికి తెలిసిన విద్య మతపరమైన ఆవేశకావేశాలను రెచ్చగొట్టడం. ముస్లింలను విమర్శించడం, వారిపైన దాడి చేయడం ద్వారా హిందువులను ఆకట్టుకోవాలని ప్రయత్నం. ఈ ప్రయత్నం ఇంతకాలం ఉత్తరాదిలో జయప్రదంగా సాగింది. ఇంకా సాగకపోవచ్చునని కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి.

రాజమోహన్ గాంధీ మహాత్మాగాంధీ మనుమడు. అమెరికా విశ్వవిద్యాలయంలో పాఠాలు చెబుతున్నారు. అప్పుడప్పుడు వ్యాసాలు రాస్తూ ఉంటారు. ఎన్ డీటీవీ వెబ్ సైట్ కి ఇటీవల రాసిన ఒక వ్యాసంలో ఆయన మోహన్ దీక్షిత్ అనే మధ్యప్రదేశ్ కు చెందిన ఒక యువ న్యాయవాది గురించి ప్రస్తావించారు. అందరూ తెలుసుకోదగిన అంశాలు చెప్పారు. ఇటీవల మోహన్ దీక్షిత్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పర్యటించారు. ఇళ్ళు కూల్చుతున్న బుల్డోజర్లను చూశాడు. తమ ఇళ్ళు నేలమట్టం అవుతుంటే పేద ప్రజలు గుండెలు బాదుకుంటూ విలపించడాన్ని చూసి చలించిపోయాడు. ఆరు లేన్ల రోడ్డు వేయడానికి అడ్డంగా ఉన్న ఇళ్ళను పెరికిపారేస్తున్నారు. ఆ ఇళ్ళలో ఇంతవరకూ నివసిస్తున్నవారికి ప్రత్యామ్నాయం చూపడం లేదు. కొంత గడువు ఇచ్చిన తర్వాత చర్య తీసుకునే మర్యాద లేదు. అధికారం చేతిలో ఉంది కదా అని బుల్డోజర్ పంపి ఇళ్ళను నేలమట్టం చేయిస్తున్నది ప్రభుత్వం. మోహన్ దీక్షిత్ ఆ రాత్రి ఇళ్ళుకోల్పోయినవారి దగ్గరికి వెళ్ళాడు. వారి సమచారం సమస్తం సేకరించాడు. మర్నాడు కోర్టలో కేసు వేశాడు. జబల్ పూర్ హైకోర్టు బెంచ్ మోహన్ పిటిషన్ పైన విచారణ జరిపింది.బుల్డోజర్ ప్రయోగాన్ని తక్షణం నిలిపివేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. బల్డోజర్ ప్రయోగం వల్ల నష్టపోయినవారికి తక్షణం సహాయం అందించాలని కూడా చెప్పింది. మోహన్ సాహసాన్ని, జాగ్రత్తగా వివరాలు సేకరించి కోర్టులో కేసు వేయడాన్నిభోపాల్ పౌరులు ప్రశంసించారు.

అదే మోహన్ హిందీలో తన ఫేస్ బుక్ లో పెట్టుకున్న అంశాన్ని రాజమోహన్ గాంధీ ఇంగ్లీషులోకి అనువదించారు. ‘‘కొన్ని రోజుల కిందట నేను (మోహన్ దీక్షిత్)  మధ్యప్రదేశ్ లోని గంజ్ బసోడా నుంచి గ్వాలియర్ కు జీటీ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేశాను. రిజర్వేషన్లు లేని కంపార్ట్ మెంట్ ఎక్కాను. అదే కంపార్ట్ మెంట్ లో ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వారి వేషధారణ ప్రకారం వారు ముస్లింలు అని గ్రహించాను. లలిత్ పూర్ స్టేషన్ లో రైలు ఆగినప్పుడు ఇద్దరు పోలీసు జవాన్లు కంపార్ట్ మెంట్ లో ప్రవేశించారు. తక్కిన ప్రయాణికులను పట్టించుకోకుండా పోలీసు జవాన్లు ముగ్గురు ముస్లిం ప్రయాణికులను మాత్రమే ప్రశ్నించారు. వారి పేర్లు చెప్పమని అడిగారు. వారిలో ఒకరు తన పేరు చెప్పగానే ఆధార్ కార్డు చూపించమంటూ దబాయించారు. వారిని అనుమానిస్తూ ముగ్గురినీ ప్రశ్నించారు. వారి కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరిగాయి.

‘‘మతం కారణంగా వారిని అడ్డగోలుగా ప్రశ్నించడం చూసి తట్టుకోలేకపోయాను. నేను నిలబడి చేతులు జోడించి తనను క్షమించవలసిందిగా ముగ్గురు ముస్లింలనూ కోరాను. ‘‘మిమ్మల్ని వేధించిన వ్యక్తులు ఏ మతానికి చెందినవారో ఆ మతం తరఫున నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఆ మతానికే చెందినవాడినే. ఎవరినీ భయపెట్టమని కానీ అడ్డుకోమని కానీ హిందూ మతం నాకు ఎన్నడూ చెప్పలేదు. బాధపడుతున్నవారి వెంటా, పేదవారివెంటా, పీడనకు గురి అవుతున్నవారి వెంటా నిలబడమని రాముడు నాకు చెప్పాడు. నేను నిర్భయంగా జీవించాలని తులసీదాస్ రామాయణంలోని రాముడు నాకు చెప్పాడు. రాముడి స్నేహితులు రాజులూ, మహారాజులూ కాదు. ఒక శబరి, ఒక జటాయు, ఒక సుగ్రీవుడు, ఒక విభీషణుడు, కొన్ని కోతులూ,  కొన్ని భల్లూకాలూ ఆయన మిత్రులు.

‘‘నా మాటలు ఆలకించిన పోలీసు జవాన్లు మెల్లగా తప్పుకొని మరో కంపార్ట్ మెంట్ లోకి వెళ్ళిపోయారు. నాతో పాటు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు నేను చేసిన పనిని మెచ్చుకున్నారు. గ్వాలియర్ స్టేషన్ వచ్చింది. నేను లగేజి పట్టుకొని దిగడానికి తయారయ్యాను. ఎప్పుడో విడిపోయిన తమ్ముడు ఆర్తితో ఆలింగనం చేసుకున్నట్టు ముగ్గురు ముస్లింలూ  నన్ను కౌగలించుకొని రైలు దిగారు.’’

మోహన్ దీక్షిత్ చేసిన పనులు మనలో అందరూ చేయవచ్చు. తోటి పౌరులు సంతోషిస్తారు. మద్దతు ఇస్తారు. అధికారులు కానీ పోలీసులు కానీ అన్యాయంగా వ్యవహరించడాన్ని, మతపరంగా చర్యలు తీసుకోవడాన్ని సామాన్య ప్రజలు సహించరు. కానీ వారిలో అందరికీ మోహన్ దీక్షిత్ కి ఉన్న తెగువ ఉండదు. తోటి మనుషులపట్ల ఆత్రుత ఉండదు. కానీ ఎవరైనా నిలబడి అన్యాయాన్ని ప్రశ్నిస్తే సామాన్యులు సంతోషిస్తారు. మద్దతునిస్తారు. అటువంటి అమానవీయ దృశ్యాలు చూసి కూడా మౌనంగా ఉండటం అంటే దౌర్జన్యాన్ని సహించడమే, ప్రోత్సహించడమే. ఈ విషయంలో జబల్పూర్ హైకోర్టు బెంచ్ లో  ఉన్న న్యాయమూర్తులను కూడా ప్రశంసించాలి. పేదలకు అన్యాయం జరుగుతోందనీ, వారిళ్ళను పెరికి పారవేస్తున్నారనీ వారి దృష్టికి మోహన్ దీక్షిత్ తీసుకువెళ్ళిన వెంటనే వారు స్పందించి బుల్డోజర్లను నిలిపివేయించారు. పేదల పక్షాన నిలబడ్డారు.

బాల్య వివాహాల విషయంలో అస్సాం ప్రభుత్వం జబర్దస్తీగా వ్యవహరించినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు గువాహతి హైకోర్టు న్యాయమూర్తి సుమన్ శ్యామ్ వెనుకాడలేదు. పాతనేరాలను సైతం ప్రస్తావించి అనేకమందిని ప్రాసిక్యూట్ చేయించాలని అస్సాం ప్రభుత్వం హడావుడి చేయడాన్ని న్యాయమూర్తి అంగీకరించలేదు. 2026 కల్లా బాల్య వివాహాలను పూర్తిగా నిలిపివేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వశర్మ ఒక తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేశారు. 2021లో అస్సాం అంతటా కలిపి 155బాల్యవివాహం కేసులే నమోదైనాయి. శర్మ తీర్మానం చేయించిన తర్వాత రెండు వారాలలోనే మూడు వేలమందిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో అత్యధికులు ముస్లింలు. వారిలో ఎక్కువ మంది కుటుంబాన్ని ఒంటరిగా పోషించేవాళ్ళు. ముస్లింలపట్ల కఠినవైఖరి ప్రదర్శించే గొప్ప హిందూత్వవాదిగా పేరు తెచ్చుకోవాలని హిమంతా బిశ్వశర్మ కొన్నేళ్ళుగా విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈశాన్యంలో పెద్ద నాయకుడిగా ఎదగాలని ఆయన అభిలాష.

ఇండియాలో ఏటా పదిన్నర లక్షల మంది 18 సంవత్సరాల లోపు బాలికలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారనీ, ప్రపంచంలో జరుగుతున్నబాల్యవివాహాలలో మూడొంతులు ఇండియాలోనే జరుగుతున్నాయనీ యూనీసెఫ్ సంస్థ వెల్లడించింది. అస్సాంలో జరిగే పెళ్ళిళ్ళలో 31 శాతం వరకూ మైనారిటీ బాలికలకే జరుగుతున్నాయి. ఇండియాలో ఇతర రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి ఉంది. పోలీసులను ప్రయోగించి, లోగడ బాల్యవివాహాలు చేసినవారిని కూడా దండించడం కంటే ప్రజలలో అవగాహన పెంచే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలి. ఒక్క అస్సాంలోనే కాదు దేశంలోని అన్నిరాష్ట్రాలలో కూడా ఇటువంటి బోధన జరగాలి. జస్టిస్ శ్యాం అన్నట్టు బాల్య వివాహాలు అభిలషణీయం కాదు. కానీ ఇప్పుడు అందరినీ జైలులో పెట్టడం మాత్రం పరిష్కారం కాదు.

మోహన్ దీక్షిత్ వంటి న్యాయవాదులూ, సుమన్ శ్యాం వంటి న్యాయమూర్తులూ చాలా మంది ఇంకా దేశంలో చురుకుగా ఉన్నారు కనుకనే దేశం ఈ మాత్రం ఉంది. ఇటువంటి వారు ప్రజానీకంలో చాలామందే ఉంటారు.  కానీ తెగింపు లేని కారణంగా మౌనంగా ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మౌనం ప్రమాదకరం. మౌనాన్ని ఛేదించాలి. ముస్లింలకైనా, క్రైస్తువులకైనా, హిందువులకైనా అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించాలి. మనకు ఎందుకు వచ్చిన గొడవ అంటూ తప్పుకోవడం పిరికి లక్షణం. నిలబడి ప్రశ్నించి నిలదీసినప్పుడు దౌర్జన్యకారులు వెనకడుగు వేస్తారు. తోటి సమాజం హర్షిస్తుంది. ప్రజాస్వామ్య మనగలుగుతుంది. ప్రభువులు దారికొస్తారు.    

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles