- ఐదుమాసాల తర్వాత ఇంటికి చేరిన సిరాజ్
- ఆస్ట్ర్రేలియా సిరీస్ లో భారత్ టాప్ బౌలర్ సిరాజ్
భారత యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్…ఐదుమాసాల క్రికెట్ డ్యూటీ తర్వాత ఇంటికి చేరాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగుమ్యాచ్ ల సిరీస్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసి..నంబర్ వన్ బౌలర్ గా నిలిచిన సిరాజ్ బ్రిస్బేన్ నుంచి దుబాయ్ మీదుగా స్వస్థలం హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ కుటుంబం నుంచి భారత క్రికెట్లోకి దూసుకువచ్చిన సిరాజ్…ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు.
అంచెలంచెలుగా
దేశవాళీ క్రికెట్లో జూనియర్ స్థాయి నుంచే హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన సిరాజ్…రంజీట్రోఫీ జట్టులో చోటు సంపాదించాడు. ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ కు, ఆ తర్వాత బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కూ ఆడుతూ భారత కెప్టెన్ విరాట్ కొహ్లీకి చేరువయ్యాడు. కొహ్లీ ప్రేరణ, ప్రోత్సాహంతో తన ఆటతీరును గణనీయంగా మెరుగుపరచుకొన్నాడు.
ఐపీఎల్ 13వ సీజన్లో అత్యుత్తమంగా రాణించడం ద్వారా..ఆస్ట్ర్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. గల్ఫ్ దేశాలలో రెండునెలలపాటు ఐపీఎల్ ఆడిన సిరాజ్…అక్కడి నుంచే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. సిరాజ్ ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలోనే తన తండ్రి మరణవార్తను విన్నాడు. అయితే…క్వారెంటెన్ నిబంధనలు,భారతజట్టులో తన అవకాశాలను దృష్టిలోనే ఉంచుకొని జట్టుతోనే కొనసాగాడు.
Also Read : స్వస్థలాలకు చేరిన క్రికెట్ హీరోలు
తండ్రి మరణం దిగమింగి
ఏనాటికైనా తన కుమారుడు భారతజట్టుకు ఆడితే చూడాలని సిరాజ్ తండ్రి, ఆటోడ్రైవర్ మహ్మద్ గౌస్ తపనపడుతూ ఉండేవారు. తండ్రి చిరకాల స్వప్నం నెరవేర్చడమే లక్ష్యంగా సిరాజ్ అంత్యక్రియలకు హాజరుకాకుండా ఆస్ట్ర్రేలియాలోనే ఉండిపోయాడు.
సిరాజ్ త్యాగాన్ని గుర్తించిన భారతజట్టు యాజమాన్యం…మెల్బోర్న్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్టు ద్వారా అరంగేట్రం అవకాశం కల్పించింది. అంది వచ్చిన అవకాశాన్నిసిరాజ్ సద్వినియోగం చేసుకొన్నాడు. తండ్రి మరణాన్ని గుర్తు చేసుకొని కన్నీరు మున్నీరయ్యాడు. అయినా..చలించకుండా ఆడి ఆ తర్వాత జరిగిన సిడ్నీ, బ్రిస్బేన్ టెస్టుమ్యాచ్ ల్లో సత్తాచాటుకొన్నాడు.
Also Read : టాప్ ర్యాంక్ వికెట్ కీపర్ గా రిషభ్ పంత్
పేస్ బౌలింగ్ కు పెద్దదిక్కుగా
బుమ్రాతో సహా భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్లంతా గాయాలతో జట్టుకు అందుబాటులో లేకపోడంతో ..సిరీస్ కే కీలకంగా మారిన బ్రిస్బేన్ టెస్టులో భారత పేస్ ఎటాక్ కు సిరాజ్ పెద్దదిక్కుగా నిలిచాడు. శార్దూల్ ఠాకూర్, నటరాజన్, నవదీప్ సైనీలతో కూడిన పేస్ బౌలింగ్ కు సిరాజ్ ప్రేరణగా నిలిచాడు. రెండోఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం ద్వారా విజయానికి మార్గం సుగమం చేశాడు. మొత్తం మూడుటెస్టులు, ఆరు ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసిన సిరాజ్ 13 వికెట్లతో బౌలర్ నంబర్ వన్ గా నిలిచాడు.
ఐపీఎల్, ఆస్ట్రేలియా పర్యటనల కారణంగా ఐదునెలలపాటు కుటుంబానికి దూరంగా ఉన్న సిరాజ్…స్వస్థలానికి తిరిగి వచ్చిన వెంటనే…తండ్రిసమాధి వద్దకు వెళ్లి పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించాడు.
అందరి ప్రోత్సాహం మరువలేనిది
భారత కెప్టెన్లు విరాట్ కొహ్లీ, అజింక్యా రహానేలతో పాటు ప్రధాన శిక్షకుడు రవి శాస్త్రి,బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్,సహఆటగాళ్లంతా తనకు అండగా నిలిచి ఎంతగానో ప్రోత్సహించారని, కష్టసమయంలో వెన్నుతట్టి ఆత్మస్థైర్యాన్ని నింపారని గుర్తు చేసుకొన్నాడు.
ఐదునెలల తర్వాత అమ్మచేతి వంట తిన్నానని, కొద్దిరోజుల విశ్రాంతి తర్వాత ఇంగ్లండ్ తో జరిగే సిరీస్ కు సన్నాహాలు మొదలు పెడతానని తెలిపాడు. తాను అప్పటికీ జూనియర్ నేనని, సీనియర్ ను ఏమాత్రం కాదని చెప్పాడు.
Also Read : ధోనీ సరసన అజింక్యా రహానే
టెస్ట్ క్రికెట్లో హైదరాబాద్ నుంచి భారతజట్టుకు ఆడిన రెండో ఫాస్ట్ బౌలర్ గా రికార్డుల్లో చేరిన సిరాజ్ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలుగుతున్నాడు. ఆస్ట్ర్రేలియా వన్ డౌన్ ఆటగాడు లబుషేన్ ను పడగొట్టడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ప్రకటించాడు. ఐపీఎల్ లో బెంగళూరు ఫ్రాంచైజీ…సిరాజ్ కు సీజన్ కు 3 కోట్ల రూపాయల చొప్పున వేలం ధరను చెల్లిస్తూ వస్తోంది.