మన గౌరవ ప్రధాని మోడీకి రికార్డులంటే గొప్ప సరదా. ఇప్పటివరకు భారతదేశంలో ఏ ప్రధానీ చేయలేని, చేయని, చేయకూడని పనులన్నీ చేయడం ద్వారా చరిత్ర సృష్టించాలని భావిస్తున్నట్టుంది. ఇంతవరకు ప్రధానమంత్రి పదవి చేపట్టిన తరువాత ఒక్కటంటే ఒక్క ఇంటర్వూ కూడా ఏ పత్రికకూ, ఏ జర్నలిస్టుకూ ఇవ్వకుండా చరిత్ర సృష్టించడం మామూలు విషయం కాదు. గొప్ప ఉపన్యాసకుడైన మన ప్రధాని, తన ఉపన్యాసాలద్వారా ప్రజలను ఉర్రూతలూగించగల మన ప్రధాని ఎవరికీ ఇంతవరకూ ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం విడ్డూరమే. నోట్ల రద్దు విషయమే తీసుకోండి, ముందుచూపున్న ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేయని ధైర్యం, మొండి తనంలో మోడీని మించిన ప్రధాని ఇందిరాగాంధీ సైతం చేయలేని సాహసం నోట్ల రద్దు. ఏకపక్షంగా ఎవ్వరితో చర్చల్లేకుండా ఉన్నపళంగా ఐదువందల, వెయ్యిరూపాయల నోట్లు రద్దు చేసి పారేశారు. దాని ఫలితం ఏమీ లేకపోయినా మధ్యతరగతి ఆర్థికవ్యవస్థ కోలుకోవడానికి మరికొన్ని దశాబ్దాలు పడుతుందని కొందరు సీనియర్ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
Also read: ఇదే మన ప్రస్తుత భారతం!
జనాభా గణన మరి లేనట్టేనా!
అక్కడితో ఆగకుండా మరి రెండు రికార్డులు నెలకొల్పాలని మన ప్రధాని ఉవ్విళ్లూరుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే గౌరవ పార్లమెంటు సభ్యులను సభనుంచి సస్పెండ్ చేయడంలో సాధించిన రికార్డును మొదట చెప్పుకోవాలి. మోడీ ప్రభుత్వం సభ్యులను సస్పెండ్ చేయడంలో ఇప్పటికే 170 శాతం అదనపు ఘనతను సాధించింది. 2014 నుంచి ఇప్పటివరకు చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా లోకసభ సభ్యులను సస్పెండ్ చేయగా, మోడీ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత అంటే 2019 నుంచి అత్యధిక రాజ్యసభ సభ్యులను కూడా సస్పెండ్ చేసి సభనుంచి మెడ పట్టి గెంటేయడంలో రికార్డు సాధించారు. ఒక గిరిజన అభ్యర్థిని ఇంతకుముందు కూడా భారతీయ జనతా పార్టీ తన తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడగట్ట లేకపోయింది. 2012లో 14వ రాష్ట్రపతిగా యుపిఏ తరఫున పి.ఏ. సంగ్మా నిలబడినా లాభం లేకపోయింది. కానీ మోడీ చాతుర్యంతో ఈసారి మరో గిరిజన అభ్యర్థినిని రంగంలోకి దించి, చాలా జాగ్రత్తగా పావులు కదిపారు. ద్రౌపది ముర్మును తొలి మహిళా గిరిజన రాష్ట్రపతిగా గెలిపించుకున్నారు.
Also read: వారు చేసే తప్పు.. మనం చేస్తే ఒప్పు
స్మృతి ఇరానీ స్వైరవిహారం
అయినా, ఈ ఏడాది పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఎలాగైనా చర్చలు జరగకుండా చేయాలని నిర్ణయించుకున్న ఏలినవారు మొదటి రోజే అవకాశం కోసం ఎదురుచూశారు. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి పిలిచిన ఒక పిలుపు పట్టుకుని సభను నడవనివ్వకుండా చేసారు. రాష్ట్రపతిని పట్టుకుని మగదురహంకారంతో రాష్ట్రపత్ని అని ఆయన అనడం, వెంటనే కాంగ్రెస్ పార్టీ పెద్దలు తప్పును గుర్తించి సరిచేయడం చకచకా జరిగిపోయాయి. కాని స్మృతి ఇరానీ తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో సభలో ఆ పదం గురించి నానాయాగీ చేసి రెండు రోజుల పాటు సభను నిలువరించగలిగారు. నోరు జారిన కాంగ్రెస్ కు అస్త్రం లేకుండా పోయింది. ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా తమను మించి ఎవ్వరూ సభ్యులను సస్పెండ్ చేయలేనంత సంఖ్యలో రాబోయే రెండేళ్లలో గౌరవ సభ్యులను సభనుంచి సాగనంపాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రభుత్వపు ధోరణిని చూస్తుంటే అసలు ప్రతిపక్షమే లేని సభ ఏర్పాటు కావాలని కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది.
Also read: సభ ముగిసింది.. సందేశం చేరింది..
జనాభా లెక్కల సేకరణపైనా నియంత్రణ
అక్కడితో ఆగకుండా మరో ఘనమైన పనికి మోడీ ప్రభుత్వం పచ్చజెండా ఊపడం విస్మయం కలిగిస్తోంది. ప్రతి దశాబ్దానికి ఒకసారి మన దేశపు జనాభాను లెక్కించే సంప్రదాయం మనది. దాని ఆధారంగానే మన పంచవర్ష ప్రణాళికలు రూపొందేవి. ఇదివరకే ఒక్క కలంపోటుతో పంచవర్ష ప్రణాళికను రద్దుచేసిన ఎన్ డీఏ ప్రభుత్వం మరో ముందడుగు వేసి జనాభా లెక్కింపు రద్దు విషయంపై దృష్టి సారించినట్టుంది. 2021 జనాభా లెక్కింపును మళ్లీ ఆదేశాలు ఇచ్చేవరకు అంటే తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు గత మంగళవారం పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంటు ఉభయసభలలోను చాలా రభస జరుగుతున్న మూలాన ఈ వార్త మన తెలుగు పత్రికలలో ఎక్కడా వచ్చినట్టు లేదు. మన దేశానికి స్వతంత్రం రాకముందు 1881లో ఇలా జనాభా లెక్కింపు మొదలుపెట్టాం. తరువాత స్వతంత్ర భారతంలో 1949లో హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనాభా గణన కమిషన్ ఏర్పాటుచేసి జనాభా సేకరణ చేస్తున్నాం. దీనికి మోడీ ప్రభుత్వం మంగళం పాడబోతోందా లేదా అని వేచి చూడాలి. పంచవర్ష ప్రణాళికలను అటకెక్కించి దేశ ఆర్థికాభివృద్ధిని వార్షిక ప్రణాళికలకు కుదించి.. దేశభక్తిని వాట్సప్ డిపి పిక్ లకు కుదించి చోద్యం చూస్తున్న ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతలను ప్రపంచం విస్తుపోతూ చూస్తున్నది.
Also read: కార్పొరేట్ల మాయ.. గ్రేడ్ల గారడీతో విద్యావ్యవస్థకు తుప్పు
వరదల్లో పత్రికల బురద వేట
ఎగువకు వచ్చిన గోదావరి వరద పోటెత్తి నదీ పరీవాహక ప్రదేశాన్ని బురదమయం చేసింది. గత కొన్ని దశాబ్దాలలో చాలా భారీ ఎత్తున వర్షం వెల్లువెత్తి, వాగులు వంకలు ఏర్లు నదులు పొంగి పొర్లి భీతావహ దృశ్యంతో వళ్లు గగుర్పొడిచింది. తెలంగాణ ముఖ్యమంత్రి వరద బీభత్సాన్ని కళ్లారా చూసి ఇందులో విదేశీ కుట్ర కూడా ఉండొచ్చన్న ఊహాగానాలు చేశారు. చైనాలాంటి దేశాలు క్లౌడ్ బరస్ట్ వంటి విధ్వంసకర విన్యాసాలకు తెగబడినా ఆశ్చర్యపోనక్కర్లేదని మన తెలుగు టీవీ చానెళ్లు రెండు రోజులపాటు గగ్గోలు పెట్టాయి. ఈ ఊహాగానాలకు ఊతమిచ్చేట్టుగా ఇంత పెద్దఎత్తున వరద బురద కొట్టుకురావడం ఇప్పటివరకూ మనం ఎరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి చాలా దూరంగా ఉంటూనే, అందుబాటులో ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ మోహరించి, వరద సహాయక చర్యలు చేపట్టి ఒక్క ప్రాణానికి కూడా నష్టం వాటిల్లకుండా అన్ని చర్యలు చేపట్టినందుకు అభినందించాలి. ప్రతిపక్షం ఎంత రెచ్చగొట్టినా ప్రభుత్వంగాని, ప్రభుత్వ యంత్రాంగం కాని సంయమనం కోల్పోకుండా బాధితుల పక్షాన నిల్చుంది. వరద సహాయక చర్యలలో పెద్ద ఎత్తున తమ ప్రాణాలకు తెగించి పాల్గొన్న వాలంటీర్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. క్షేత్రస్థాయిలో కష్టకాలంలో సాంత్వన అనుభవించిన ప్రజానుకూలత గుంభనంగా ఉంటుంది. అది అవసరమైనప్పుడు మాత్రమే ప్రజల హృదయాలలోంచి పెల్లుబికి వస్తుంది. కొన్ని సార్లు ఓట్ల రూపంలో, మరికొన్ని సార్లు సంఘటిత సహానుభూతి రూపంలో. ప్రతిపక్షాల విసుర్లు, వారి మీడియా వార్తలు చూసి అధైర్యపడాల్సింది లేదు.
Also read: మనిషి నిజనైజం పోరాడడమే!
రోష్ని నాదర్ మల్హోత్రా
2021లో దేశంలో అత్యంత సంపన్నురాలైన మహిళగా హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోష్ని నాదర్ మల్హోత్రా 84,330 కోట్ల రూపాయలతో ముందంజలో ఉండడం విశేషం. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా ఉద్యోగం మానేసి సౌందర్య అలంకరణల ఉత్పత్తుల నైకా బ్రాండ్ తో ఫాల్గుని నాయర్ 57,520 కోట్ల రూపాయలతో కుటుంబ వ్యాపారాల తోడ్పాటు లేకుండా తనంతట తాను అత్యంత సంపన్నురాలిగా ఎదిగిన ఈ ఏటి మహిళగా రికార్డు సృష్టించింది.
Also read: తప్పు ఎక్కడ జరిగింది!
–దుప్పల రవికుమార్