Sunday, December 22, 2024

అమెరికా విశిష్ఠ అతిధిగా మోదీ మూడు రోజుల పర్యటన

అమెరికాలో మూడు రోజులు పర్యటించేందుకు భారత ప్రధాని ఢిల్లీ నుంచి మంగళవారం బయలుదేరి వెళ్ళారు. ఇదే రోజు (మంగళవారం) అర్ధరాత్రి ఆయన న్యూయార్క్ చేరుకుంటారు. అక్కడ ఐక్యరాజ్యసమితి కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రదర్శనలో పాల్గొంటారు. బైడెన్ హయాంలో అమెరికా ప్రభుత్వవిశిష్ఠ అతిథిగా పర్యటించిన మూడో దేశాధినేతగా మోదీ చరిత్రలోకి ఎక్కుతారు. ఫ్రాన్స్ కు చెందిన ఎమాన్యుయల్ మాక్రాన్ కూ, దక్షిణ కొరియా అధినేత యూన్ సెక్ యోల్ కు ఇటువంటి గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ తో కలిసి మోదీకి డిన్నర్ (రాత్రి భోజనం) ఉంటుంది. అమెరికాలో మోదీ 21 నుంచి 23 వరకూ ఉంటారు.

మోదీ ప్రధానిగా అమెరికాలో పర్యటించడం ఇది ఆరోసారి. ఆయన అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)ను  ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన 2016లో కూడా అమెరికా పార్లమెంటులో ప్రసంగించారు. రెండు విడతల అమెరికా పార్లమెంటులో ప్రసంగించిన ఘనత సొంతం చేసుకున్న కొద్దిమంది దేశాదినేతలలో మోదీ ఒకరు అవుతారు. విన్ స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా వంటి వారికే ఈ గౌరవం దక్కిందని భారత విదేశాంగమంత్రి జైశంకర్ అన్నారు. వణిక్ ప్రముఖులను మోదీ కలుసుకుంటారు. భాతర సంతతికి చెందిన ఇండియన్ అమెరికన్లను సంబోధించి ప్రసంగిస్తారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో స్టేట్ డిన్నర్ ఉంటుంది.

ఇండియన్ అమెరికన్ల కీలక పాత్ర   

బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ సందర్భంగా న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో యోగా కార్యక్రమానికి మోదీ నాయకత్వం వహిస్తారు. వాషింగ్టన్ లోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియన్ అమెరికన్లు 45 లక్షల మంది మాత్రమే ఉన్నప్పటికీ వారి ప్రాబల్యం ఎక్కువ. సంపన్నవర్గం కింద లెక్క. వీరి జీతాలూ, వ్యాపారాలూ, ఆదాయాలూ సగటు అమెరికన్ల జీతాలూ, ఆదాయం కంటే అధికం. అమెరికా ప్రతినిధుల సభలో నలుగురు భారతీయులు ఉన్నారు – అమీ బోరా, రో ఖన్నా, రాజాకృష్ణమూర్తి, ప్రమీలా జైపాల్. వీరు కాకుండా కొంతమంది మేయర్లుగా ఉన్నారు. భారత సంతతికి చెందిన 35 మంది న్యాయమూర్తులుగా పని చేస్తున్నారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి నల్ల మహిళ. రెండు డజన్లకు పైగా కంపెనీలకు భారతీయులు సారథ్యం వహిస్తున్నారు. గూగుల్ కి సుందర్ పిచ్చాయ్, మైక్రోసాఫ్ట్ కి సత్యానాదెళ్ళ అధినాకులుగా పని చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వంలో వివిధ హోదాలలో 130 ఇండియన్ అమెరికన్లను బైడెన్ నియమించారు. ట్రంప్, ఒబామా నియమించిన ఇండియన్ అమెరికన్ల సంఖ్య కంటే ఇది ఎక్కువ.

అధ్యక్షుడు బైడెన్ తో మూడు విడతల మోదీ సమావేశం ఉంటుంది. జెట్ విమానాల సాంకేతికత నుంచి సెమీకండక్టర్ల పరిశ్రమలో పెట్టుబడుల నుంచి 5జీ, 6జీ సాంకేతిక ఉన్నతీకరణ నుంచి ఉన్నత విద్యవరకూ చాలా విషయాలు చర్చకు వస్తాయి. చాలా ఒప్పందాలు కూడా జరగనున్నాయి. 2005లో నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ తో కలసి అణుఒప్పందం చేసుకున్న తీరుగానే ఇప్పుడు మోదీ సైతం ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. విదేశీ వ్యవహారాలలో రష్యా-ఉక్రేన్ యుద్ధం, ఇండో-పెసిఫిక్ వ్యవహారాలు, ఉగ్రవాదం, దూకుడుమీద ఉన్నా చైనా వ్యవహారం గురించీ చర్చ జరుగుతుంది. చైనాకు వ్యతిరేకంగా భారత్ ను నిలపాలని అమెరికా ప్రయత్నిస్తున్నదనే అపోహ దేశంలో ఉన్నది. చైనాను ఎదుర్కోవడం భారత్ వల్ల కాదనే స్పష్టత మోదీకి ఉన్నది. బైడెన్ కు కూడా ఉన్నది. భారత్ కంటే ఆర్థికంగా అయిదు రెట్లు బలమైన చైనాతో తలబడే ఉద్దేశం ఇండియాకు లేదు. అమెరికా సైతం చైనాతో సామరస్య పూర్వకమైన సంబంధాలనే కోరుకుంటోంది. అందుకే చైనా రాజధాని బీజింగ్ లో చైనా అధినేత షీ జీపింగ్ తో అమెరికా విదేశాంగమంత్రి అంటోని బ్లింకన్ సోమవారంనాడు సమాలోచనలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించుకునే విషయంపైన మాట్లాడుకున్నారు. అదే బ్లింకన్ మోదీతో కూడా అమెరికాలో చర్చలు జరుపుతారు.

స్టేట్ విజిట్ అంటే ఏమిటి?

స్టేట్ విజిట్ అంటే ఏమిటి? అమెరికా అత్యంత సన్నిహిత మిత్రులను విశిష్ఠ అతిధులుగా ప్రత్యేకంగా, అధికారికంగా ఆహ్వానిస్తుంది. అమెరికా అధ్యక్ష కార్యాలయం ఆహ్వానం పంపుతుంది. విమానాశ్రయానికి అమెరికా అధ్యక్షుడు స్వయంగా స్వాగతం చెబుతారు. ఇప్పుడు ప్రధాని మోదీ నేరుగా న్యూయార్క్ వెడుతున్నారు కనుక వాషింగ్టన్ లో వైట్ హౌస్ దగ్గర బైడెన్ స్వాగతం ఉంటుంది. మోదీ విమానం వైట్ హౌస్ దగ్గర దిగగానే విమానం దగ్గరికి అధ్యక్షుడు  బైడెన్ వెళ్ళి స్వాగతం చెబుతారు. 21 విడతల తుపాకీలు పేల్చి వందనం సమర్పిస్తారు. అధ్యక్షుడి అతిథి గృహం బ్లియర్ హౌస్ లో మోదీ బస చేస్తారు. ఆ సమయంలో స్వేతభవనం పచ్చిక బయళ్ళలో ఏడువేలమంది భారతీయ అమెరికన్లు ఉంటారు. వీధులలో అమెరికా, భారత జాతీయ పతాకాలు ఉంటాయి. వెలుగులు చిమ్మే లైటింగ్ ఏర్పాట్లు జరుగుతాయి.  ఇటువంటి స్వాగతం పొందిన మూడవ భారత దేశాధినేతగా మోదీ చరిత్రలో నిలిచిపోతారు. ఇంతకు పూర్వం నాటి (1963 జూన్ లో) రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కీ, నాటి (2009 నవంబర్ లో) ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కీ స్టేట్ గెస్టులుగా పర్యటించే అవకాశం దొరికింది.

జెట్ ఇంజన్ సాంకేతికతను భారత్ కు బదలాయించాలన్న అమెరికా నిర్ణయం కీలకమైంది. ఈ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా ఏ ఇతర దేశానికీ ఇంతవరకూ బదిలీ చేయలేదు. ఈ విషయంలో అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ భారత దేశంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంటుంది.

‘‘అన్ని రంగాలకు చెందినవారు, కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యులు, మేధావులు, ఇతరులు నా పర్యటన పట్ల ఆసక్తి కనబర్చుతున్నారు. వారు చెప్పిన మంచి మాటలకు నేను వారికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఇటువంటి విభిన్న రంగాల నుంచిమద్దతు రావడం భారత-అమెరికా సంబంధాల లోతును సూచిస్తున్నది’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

మణిపూర్ మంటలు

మణిపూర్ తగులబడుతూ ఉండగా ప్రధాని నరేంద్రమోదీ  అమెరికా పర్యటన రావడం కొంత ఇబ్బందికరం. మణిపూర్ లో ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించి, మన్ కీ బాత్ లోమణిపూర్ ప్రస్తావన చేసి ఉంటే బాగుండేది. మణిపూర్ లో నెలరోజులుగా రావణకాష్టం రగులుతున్నా ఒక్క మాట కూడా దానిపైన మాట్లాడకుండా ప్రధాని మౌనం వహించడం వివాదానికి దారి తీసింది.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles