Tuesday, January 21, 2025

ఏడేళ్ళ మోదీ పాలన మోదమా, ఖేదమా?

నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. భారతదేశానికి 14 వ ప్రధానమంత్రి. 2014 మే 26వ తేదీన ప్రధానమంత్రిగా అధికారాన్ని చేపట్టారు. ఇప్పటికి ఏడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తయింది.  ప్రస్తుతం ఉన్న కరోనా కష్టకాలంలో  విజయోత్సవాలు చేసుకొనే పరిస్థితులు లేవు. అయినప్పటికీ, ఇప్పటికీ నరేంద్రమోదీ తిరుగులేని, ఎదురులేని నాయకుడుగానే వెలుగొందుతున్నారు. దానికి కారణాల్లో ప్రతిపక్షాల వైఫల్యం కూడా ఒకటి. జమిలి ఎన్నికలు వస్తే? కాస్త ముందుగా, లేకపోతే,2024లో జరిగే ఎన్నికల్లోనూ మళ్ళీ నరేంద్రమోదీదే అధికారం, అనే విశ్వాసంలోనే ఎక్కువమంది ఉన్నారు. కరోనా కష్టాలు, ఒత్తిళ్ళు, వివిధ అంశాల నేపథ్యంలో, మోదీ గ్రాఫ్ పడిపోయిందనే మాటలు  ఈ మధ్య కాస్త ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఈ విమర్శలను అధిగమించి, తానేంటో నిరూపించి, ప్రజాహృదయాలను మళ్ళీ గెలుస్తాడనే మాటలు కూడా వినపడుతున్నాయి. ఈ ఏడేళ్ళ పాలనను ఒకవైపు నుంచి చూస్తే  అంతా మంచిగానూ, ఇంకోవైపు నుంచి చూస్తే ఆన్నీ చెడుగానూ అనిపించే, కనిపించే దృక్పథాలను కూడా పూర్తిగా కొట్టిపారెయ్యలేం.

Also read: కన్నీళ్ళు కాదు, కార్యాచరణ కావాలి!

గుజరాత్ నేతృత్వం వేరు, ప్రధానమంత్రిత్వం వేరు

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన సుదీర్ఘకాలం పరిపాలించారు. అప్పటి దాకా ఆయన కేవలం ఒకరాష్ట్ర పాలకుడు మాత్రమే. కేంద్రమంత్రిగా ఎప్పుడూ పనిచెయ్యలేదు. పార్టీ పరంగానూ జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద పదువులు కూడా ఎన్నడూ చేపట్టలేదు. కానీ, ఆయన శైలికి, తీరుకు ఎందుకో దేశ ప్రజలంతా ఆకర్షితులయ్యారు. ఇలాంటి వ్యక్తి మన దేశానికి ప్రధానమంత్రి అయితే ఎంత బాగుంటుందో కదా అనే ఆలోచనలోకి అనేకులు వచ్చారు. ముఖ్యంగా యువత, విద్యాధికులు  ఆయనకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆయన పట్ల అచంచలమైన విశ్వాసాన్ని, అనిర్వచనీయమైన ప్రేమను, ఆకర్షణను పెంచుకున్నారు. సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియా స్రవంతిలోనూ నరేంద్రుడిని గొప్పగా కీర్తించారు. గొప్ప గొప్ప కథనాలు వరుస కట్టించారు. 2014 ఎన్నికల్లో, ఇవ్వన్నీ ప్రతిఫలించాయి, అమేయమైన విజయం రూపంలో  ప్రతిధ్వనించాయి. 2014లో నరేంద్రమోదీ ప్రధాన మంత్రి సింహాసనాన్ని రంగరంగ వైభవంగా అలంకరించారు. 2019లోనూ అంతకు మించిన గెలుపును సొంతం చేసుకున్నారు. వరుసగా రెండవసారి కూడా ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకుని తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు.

Also read: నల్ల చట్టాలపై నిరసన ప్రదర్శనకు రైతుల సన్నాహాలు

జైత్రయాత్ర

ఈ ఏడేళ్ళల్లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనూ బిజెపిని గెలుపు బాట పట్టించారు.

ఈసారి బిజెపి /ఎన్ డిఏకు మెజారిటీ తగ్గుతుందని 2019 ఎన్నికల ముందు ఎక్కువమంది భావించారు. కానీ, ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. దీనితో మోదీ గ్రాఫ్ మరింతగా పెరిగిపోయింది. అదే సమయంలో 2014 నుంచి కాంగ్రెస్ /యుపిఏ గ్రాఫ్ గణనీయంగా తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీతో పాటు అగ్రనేతలైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వారి వ్యక్తిగత గ్రాఫ్ ను పెంచుకోవడంలోనూ ఘోరంగా విఫలమయ్యారు. అసలు 2014లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడానికి ప్రధానమైన కారణాలలో   కాంగ్రెస్  పరిపాలనా వైఫల్యం ఎన్నదగినది. ముఖ్యంగా 2009 నుంచి 2014 వరకూ సాగిన మన్ మోహన్ సింగ్ పాలన చాలా చెడ్డపేరు తెచ్చుకుంది. మన్ మోహన్ సింగ్ ను ధృతరాష్ట్రడుగానూ కొందరు అభివర్ణించారు. వ్యక్తిగతంగా అవినీతిలేని, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తిగా మన్ మోహన్ కు మంచిపేరు ఉన్నప్పటికీ, సోనియా గాంధీ మొదలైన వారి నీడలో ఆయన పాలనకు చెడ్డపేరు వచ్చింది. పదేళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలకు మొఖం మొత్తింది. కాంగ్రెస్ ను దించాలి అని ప్రజ కంకణం కట్టుకుంది. ప్రత్యామ్నాయంగా బిజెపికి, నరేంద్రమోదీకి ప్రజలు ఆకర్షితులయ్యారు, అందాలన్ని ఎక్కించారు. ఇదీ టూకీగా, ఈ ఏడేళ్ల బిజెపి రాజకీయ విజయ ప్రయాణం.

Also read: కరోణా కట్టడికి విశ్వప్రయత్నం

విజయపరంపర

ఇక,నరేంద్రమోదీ పరిపాలనను సమీక్షించుకుందాం. (1) మెజారిటీ సభ్యుల అండతో ఏడేళ్ల పాటు సుస్థిరంగా పాలించడం. దీన్ని రాజకీయ, పాలనా స్థిరత్వంగా భావిద్దాం (2) అంతర్జాతీయ సంబంధాలు బాగానే పెరిగాయి. ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికాతో సంబంధాలు విస్తృతమయ్యాయి (3) చైనా దాదాపుగా యుద్ధానికి సిద్ధమైనా, ఆ పరిస్థితి రాకుండా నిరోధించారు (4) కవ్వింపులు పెంచిన పాకిస్తాన్ ను కట్టడి చేశారు (5) రష్యాతో బంధాలను పూర్తిగా తెగగొట్టాలని చైనా ప్రయత్నం చేసినా, బంధాలు పెద్దగా దెబ్బతినకుండా చూశారు (6) అంతర్జాతీయ సమాజంలో, ప్రపంచ దేశాలకు భారతదేశం పట్ల విశ్వాసాన్ని, గౌరవాన్ని పెంచడంలో కృతకృత్యులయ్యారు (7)15వ ఫైనాన్స్ కమిషన్ సూచనల మేరకు, రాష్ట్రాల ఆదాయాన్ని పెంచడంలో తోడ్పాటును అందించారు (8) డిఫెన్స్, స్పేస్, టెలీకమ్యూనికేషన్స్ రంగాలలో కొంత ప్రగతిని నమోదు చేశారు (9) అవినీతిని అరికట్టడంలో గతంలో ఎన్నడూ లేని విజయాన్ని సాధించారు (10) సనాతన భారతీయ విధానాలను, అత్యాధునిక అంశాలను మేళవిస్తూ దార్శనిక దృక్పథంతో,  అంతర్జాతీయ ప్రమాణాలతో, ఉపాధి, ప్రగతి, విజ్ఞానం సంగమంగా, అమెరికా తరహా “నూత్న విద్యా విధానం” రూపొందించారు. ఇవన్నీ తెరకు ఒక పక్కన కనిపించే అంశాలు.

Also read: కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స ఎప్పుడు?

అప్రజాస్వామిక చర్యలు

1.రెండు సార్లు అమేయమైన మెజారిటీ లభించడం వల్ల, నియంతృత్వ పోకడలతో ఏకస్వామ్యంగా సాగుతున్నారు (2) బిజెపిని రాష్ట్రాల్లో విస్తరించే క్రమంలో ప్రతిపక్షాలపై అప్రజాస్వామికంగా వెళ్తూ  సీబిఐ, ఈడి వంటి వ్యవస్థలను దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ సంస్కృతిని మించి ముందుకు వెళ్తున్నారు (3) ఫెడరల్ విధానాన్ని పూర్తిగా మరచి, పక్షపాత వైఖరితో సాగుతున్నారు. బిజెపియేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో తమకు వ్యతిరేకులు అనే భావనలో ఉన్న ముఖ్యమంత్రులు, నేతల పట్ల కక్షసాధింపు ధోరణిని అవలంబిస్తున్నారు (4) అమిత్ షా వంటి ఒకరిద్దరు నేతలు తప్ప,మిగిలిన మంత్రులు, నేతలను దూరం పెడుతున్నారు. వారికి పెద్దగా విలువ, ప్రాముఖ్యత ఉండటం లేదు (5) ఆర్ ఎస్ ఎస్ వంటి వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేస్తున్నారు. వాటికి అతీతంగా రాజకీయ వ్యవస్థను నిర్మాణం చేసుకుంటున్నారు (6) హిందూత్వ ఎజెండాతో మైనారిటీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. లౌకికవాదానికి తూట్లు పొడుస్తున్నారు (7) పెద్దనోట్ల రద్దు, జి ఎస్ టి అమలు (8) జమ్మూ,కశ్మీర్ లో ఆర్టికల్ 370రద్దు (9) పౌరసత్వ సవరణ బిల్లు (10) రైతు వ్యతిరేక చట్టాలు (11) ఎన్నికల సమయంలో తప్ప, మిగిలిన సమయాల్లో రాష్ట్రాలలో పర్యటించి, సాధకబాధకాలు తెలుసుకొని, అసమానతలు, ఇబ్బందులు, కష్టాలు తెలుసుకొక పోవడం (12) కరోనా కష్టనష్టాలను అరికట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందడం. వీటన్నింటినీ నాణానికి మరోవైపుగా, ప్రతిపక్షాలతో పాటు కొందరు రాజకీయ పరిశీలకులు చూస్తున్నారు.

Also read: తాత్పర్యం లేని టీకాలు

నరకం చూపిస్తున్న కరోనా

ఒక్కటి మాత్రం నిజం.  2014లో ఎన్నికల సమయంలో, నరేంద్రమోదీపై ప్రజలు పెట్టుకున్న అచంచలమైన విశ్వాసానికి తగ్గట్టుగా పాలన, ప్రవర్తన లేదు. దానికి కారణాలు, పరిణామాలు ఏవైనా కావచ్చు కాక. నరేంద్రమోదీ దేశభక్తిని ఎవ్వరూ శంకించరు , నాయకత్వ పటిమను ఎవ్వరూ తక్కువ చేసి మాట్లాడరు. కాకపోతే, ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలు లేకపోవడం, మాటల్లో కనిపించినట్లుగా చేతల్లో దొర్లకపోవడం ఈ అనుమానాలకు హేతువులు. పెద్దనోట్ల రద్దు, జి ఎస్ టి అమలు వల్ల ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు కరోనా వల్ల దాదాపు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ కష్టాల జాబితా చాలా పెద్దది, నిడివి, సాంద్రత చాలా ఎక్కువ.  భవబంధాలు లేవు, వ్యక్తిగత స్వార్ధాలు లేవు, జీవితమంతా మాతృదేశానికే అంకితం అని చెప్పుకొనే నరేంద్రమోదీ ఆలోచనలు,ఆశయాలు, సంకల్పం మంచివే అయిఉండవచ్చు. భిన్న కులాలు, మతాలు, సంస్కృతికి నెలవైన భారతదేశాన్ని పాలించి, ప్రజలను ఒప్పించి, మెప్పించడం ఆషామాషీ కాదు. ఎంతో చిత్తశుద్ధి, సంకల్పసిద్ధి, యోగం వుంటే తప్ప, సుపరిపాలకుడనే ముద్ర పడదు.

Also read: అంతా ఆరంభశూరత్వమేనా?

ఆత్మపరిశీలన అవసరం

ఈ ఏడేళ్ల పాలన,ప్రవర్తన, ప్రగతిపై సమీక్ష, ఆత్మసమీక్ష, పరిశీలన చేసుకొని ముందుకు సాగితే సుపరిపాలకుడనే కీర్తి తప్పక దక్కుతుంది. ప్రజాపతి నుంచి ప్రజలు కోరుకొనేది సంక్షేమం, అభివృద్ధి, సమత, మమత, శాంతి సౌభాగ్యాలు మాత్రమే. ఆ దిశగా నరేంద్రమోదీ ముందుకు సాగుతారని ఆకాంక్షిద్దాం. ఆయనపై భారత ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొన్నారు. ఓట్లు వేసి, రెండు సార్లు గొప్ప గెలుపును అందించారు. దాన్ని మోదీ గ్రహించి, ప్రతిగా, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారని విశ్వసిద్దాం. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇంకా సుమారు మూడేళ్ల సమయం ఉంది. దాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని, ప్రజా విశ్వాసాన్ని చూరగొంటే  మళ్ళీ ఆయనను ప్రధానిగా కూర్చోపెడతారు. లేకపోతే, ఇంకో పక్షానికి, మరో నాయకుడిని పట్టం కడతారు. అధికారం ఎల్లకాలం ఏ ఒక్కరి సొత్తు కాదని చరిత్ర చెబుతూనే వుంది. టీ అమ్ముకొనే ఒక అతి సాధారణమైన దశ నుంచి, ఇంతటి భారతదేశానికి ప్రధానమంత్రి కాగలిగిన గొప్ప అవకాశాన్ని, అద్భుతాన్ని “ప్రజాస్వామ్య వ్యవస్థ” కలిపించింది. దాన్ని నిలబెట్టాల్సిన, నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనదే. గొప్ప విజేతగా విఖ్యాతమైన నరేంద్రమోదీ గొప్ప పరిపాలకుడిగా గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం. ఏడేళ్ల పాలన సంపూర్ణమైన సందర్భంగా అభినందనలు అందిద్దాం.

Also read: కోరలు చాచుతున్న కరోనా

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles