Sunday, December 22, 2024

మోదీ నవభారతం, నెరవేరని ప్రజాభిమతం

మీ సంగతి నాకు తెలియదు కానీ నాకు మాత్రం నా చట్టూ జరుగుతున్న సంఘటనలను సంపూర్ణంగా సమీక్షించుకొని వాటి ప్రభావం మన సామూహిక జీవనంపై ఎట్లా ఉంటుందో అవగాహన చేసుకోవడానికి కొంత విరామం అవసరం. నేను కనుక ఆ పని చేయకపోతే ప్రతి ఘటనా తాజాగా సంభవించినట్టూ, ఇతర ఘటనలతో సంబంధం లేనట్టూ, ఒకే ఒక ఘటన అయినట్టూ కనిపిస్తుంది. ఊపిరి పీల్చే వ్యవధి లేకుండా వెంటవెంటనే సంభవిస్తున్న పరిణామాలలోని అంతస్సూత్రం, ఇతివృత్తం, వరుసక్రమం, సందర్భం అందకుండా పోతాయి. కొన్ని చెట్లు చూసి అదే వనం అని భ్రమిస్తాను. సమగ్రమైన పెనుచిత్రం నా కళ్ళకు కట్టదు. ఘటనల తాలూకు మొత్తం ప్రభావం రాజకీయరంగంపైనా, ఆర్థికరంగంపైనా, సామాజికరంగంపైనా ఏ విధంగా పడుతుందో, మన బహుళత్వ ప్రజాస్వామ్య గణతంత్రం మీద ఏ రకంగా ఉంటుందో తెలుసుకోలేకపోతాను. తాజా పరిణామం గత పరిణామాలను మన దృష్టి నుంచి దూరం చేస్తుంది. అప్పుడప్పుడూ కొంత ఆగి, జాగ్రత్తగా పరిశీలించి, ఘటనలను కలిపి చూడకపోతే పరిణామాల  భారం నా మనసుమీద ప్రభావం చూపదు. భారం పెరిగే కొద్దీ దానికి మనసు అలవాటు పడిపోతుంది. అప్పుడప్పుడు చేయవలసిన పని చేయడానికి ఈ రోజు ఒక సందర్భం. మన న్యూదిల్లీలో వేగంగా సంభవిస్తున్న పరిణామాల కార్యకారణ సంబంధాలను, వాటి ప్రభావాన్నీ తెలుసుకోవడానికి ఈ రోజు మౌనంగా ఆలోచించి నేను కనుగొన్న విషయాలను మీతో పంచుకుంటాను.

మోదీ జన్మదినం సందర్భంగా రికార్డు స్థాయిలో టీకాలు వేయడాన్ని పండుగ చేసుకుంటున్న కేంద్ర నాయకులు, పక్కన ప్రధాని

‘నవభారత’ ప్రయాణం 2014లో ప్రారంభమైంది. అప్పటి నుంచీ ఒక సారి ఈ ప్రయాణం పోకడను వీక్షిద్దాం. సంకేతం మైమరిపించే విధంగా ఉంది. సమ్మోహనాస్త్రం వశపరుచుకునేట్టు ఉంది. వాగ్దానం అనంతమైనది. వాచకం కట్టిపడేసేదిగా ఉంది. ప్రచారసంరంభం కళ్ళుమిరుమిట్లు గొలిపే విధంగా ఉంది. అచ్ఛే దిన్. మంచి రోజులు. నిర్ణయాత్మకమైన ప్రభుత్వం. సృజనాత్మకమైన విధానాలు. సరిహద్దుల్లో సోలార్ విద్యుత్ కర్మాగారాలు నెలకొల్పి వాటినే సరిహద్దు గోడలుగా ఉపయోగించుకోవాలనే సంకల్పం. మన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం. అక్రమంగా సంపాదించి స్విస్ బ్యాంకులలో దాచిన డబ్బును వెనక్కి తీసుకురావడం.  ఆ డబ్బుతో మన పౌరులలో ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేయడం. ధరలను అదుపు చేసి నేలమీదికి తీసుకురావడం. వ్వవసాయదారుల ఆదాయం రెట్టింపు చేయడం. సహకార సమాఖ్య విధానం. టీమ్ ఇండియాలో ప్రధాని, ముఖ్యమంత్రులందరూ కలసి ఒక జట్టుగా పని చేయడం. ప్రధాని ప్రధాన సేవకుడుగా ప్రజలను సేవించుకోవడం. మతసామరస్యం. హిందువులూ, ముస్లింలూ పరస్పరం కొట్లాడుకోకుండా రెండు మతాలవారూ కలిసి పేదరికంపైన యుద్ధం చేయడం. అదే పిలుపు. స్టార్ట్ అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ్ భారత్, 100 స్మార్ట్ సిటీస్, ముద్రా పథకం, ఆయుష్మాన్ భారత్, ప్రసాద్, జన్ ధన్ అగ్రగామిగా జామ్ త్రయం, ఒన్ నేషన్ ఒన్ టాక్స్ అంటే జీఎస్ టీ అనేటటువంటి ఆత్మీయమైన, గుండెలు పొంగించే పేర్లతో వివిధ కార్యక్రమాలు.  దేశానికి దిశానిర్దేశం చేసి సంపూర్ణంగా పరివర్తన తీసుకు వచ్చేందుకు ఉద్దేశించిన నీటి ఆయోగ్ వ్యవస్థాపన, ఇండియాను ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న సంకల్పాన్ని మరచిపోకూడదు. ఇది సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్. తాజా జోడింపుతో సబ్ కా ప్రయాస్ అనే మహాద్భుతమైన సద్భావనలు కలిగిన ప్రభుత్వం.

Also read: పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ మధ్యనే నువ్వా-నేనా?

ప్రగతిశీల వైఖరి

అది ఉల్లాసభరితమైన అనుభవం. ప్రచారం చేసిన కార్యాచరణ అభివృద్ధికి ఉద్దేశించింది, సమాఖ్య స్ఫూర్తితో కూడుకున్నది, అందరినీ కలుపుకుపోయేది, ఆహ్లాదకరమైది, ప్రగతిశీలమైనది.  ఇండియాకు పునర్ నిర్వచనం చెప్పే ప్రక్రియలో ప్రభుత్వం ఉన్నదని మనకు చెప్పారు.  స్వావలంబన సాధించిన దేశంగా చేయాలని సంకల్పం. దానినే ఇప్పుడు ‘ఆత్మనిర్భర్ భారత్’ అని పిలుస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో ప్రపంచ వేదికపైన ప్రస్ఫుటంగా కనిపించే దేశంగా, ప్రపంచ దేశాలలో తనదైన అగ్రాసనాన్ని పొందే దేశంగా ఇండియాను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మన ప్రధాని దగ్గరి దేశాలనూ, దూరపు దేశాలనూ అనేకం సందర్శించారు. ప్రపంచ నేతలతో భుజాలు రాసుకొని తిరిగారు. వారిలో చాలామందిని ఆలింగనం చేసుకున్నారు. వారిని చనువుగా హ్రస్వనామాలతో పిలిచారు. వారిలో ఒకరు రెండో సారి ఎన్నికలలో పోటీ చేస్తుంటే ఆయన అభ్యర్థిత్వాన్ని బహిరంగంగా బలపరిచారు. ఆయన పార్లమెంటులో ఓంప్రథమంగా ప్రవేశించిన శుభ సందర్భంలో గొప్ప వినయంగా వ్యవహరించారు. ఇటుకలతో నిర్మించిన పార్లమెంటు భవనానికి శిరస్సు వంచి ప్రణామం చేశారు. మన ప్రజాస్వామ్య దేశాలయం ప్రవేశద్వారం వద్ద గడపకి నుదురు ఆనించి ప్రజాస్వామ్య స్ఫూర్తి పట్ల తన ఆరాధనాభావాన్ని ఉద్వేగంగా ప్రదర్శించారు.

Also read: 5 రాష్ట్రాలలో ఎన్నికల రంగం – వివిధ పార్టీల బలాబలాలు

వివిధ కార్యక్రమాలను ప్రారంభించడంలో కళాత్మకంగా, బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన సమాహారం, వాటి ప్రభావం ప్రతిబింబించే విధంగా అమర్చిన అలంకారాలూ, మనసుకు ఆహ్లాదం కలిగించే కార్యక్రమాల పేర్లు ప్రజల జ్ఞాపకాలలో ఉండిపోయాయి. కానీ స్కిల్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ్ భారత్, స్మార్ట్ సిటీస్, ముద్ర వంటి కార్యక్రమాలను పర్యవేక్షించే వివిధ మంత్రిత్వశాఖల వార్షిక నివేదికలలో అచ్చులో ఉన్న వివరాలు ఆ కార్యక్రమాల పేలవమైన అమలు తీరును కప్పిపుచ్చలేకపోతున్నాయి. ఈ కార్యక్రమాల ఫలితాలను ప్రభుత్వ నాయకులు ఎవ్వరూ సగర్వంగా ప్రకటించకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఉదాహరణకు ముద్రా రుణాల కార్యక్రమం అమలు జరుగుతున్న దయనీయమైన పరిస్థితిని చూడండి. ఫలితాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ కార్యక్రమాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) చేసిన సమీక్షలో వెల్లడైన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. నీతి ఆయోగ్ ను స్థాపించి ఏడేళ్ళు. జాతిని మార్చివేసే విలువైన ఆలోచనలను ఈ సంస్థ ఇంతవరకూ ఒక్క సారి కూడా  ప్రతిపాదించలేదు. అది రూపొందించే పత్రాలు ప్రామాణికమైనవి కావు. కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు విధానాల రూపకల్పనలో మార్గదర్శనం చేసే అంశాలు ఏమీ ఆ పత్రాలలో ఉండవు. తన పాత్రపైనే ఆయోగ్ కు సంకోచం ఉంది. ఆలోచనలు పంచుకోవడానికి పరిమితం కావాలా లేక కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలా లేదా ఒకే సమయంలో రెండుపనులూ చేయాలా అన్న విషయంపైన స్పష్టత లేదు.

నల్లధనం వెనక్కి తీసుకురావడం జుమ్లా

నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడమనేది జుమ్లా

విదేశీ బ్యాంకులలో కూడబెట్టిన నల్ల ధనాన్ని వెనక్కి తీసుకురావడం అనే ఆలోచన ప్రభుత్వ అజెండాలో అదృశ్యమైంది. పైగా, బ్యాంకుల నుంచి భారీ రుణాలు తీసుకొని ఎగగొట్టినవారు ప్రస్తుత ప్రభుత్వ పర్యవేక్షణలో క్షేమంగా విదేశాలకు వెళ్ళిపోయి దర్జాగా సేద తీరుతున్నారు. వాతావరణ పరిరక్షణ కోసం ఉద్యమించే యువతీయువకులపైనా, విద్యార్థులపైనా, రైతులపైనా, జర్నలిస్టులపైనా, ఇతరులపైనా దేశద్రోహం కేసులు బనాయించడంలో అత్యంత ప్రతిభ ప్రదర్శించే వివిధ దర్యాప్తు సంస్థల అధికారులు మాల్యా, మెహుల్ భాయ్, నీరవ్ మోదీ వంటి వ్యక్తుల విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. ప్రతి పౌరుడి ఖాతాలో పదిహేను లక్షల రూపాలయలు జమ చేయడం అన్నది జుమ్లా (జోక్) అని చెబుతున్నారు.  కనుక ఆ హామీ అమలు జరుగుతుందని ఊహించడం వృధా. జీఎస్టీ వ్యవస్థ రేటు నిర్ధారించడంలోని నిర్హేతుకమైన పద్దతి వల్ల అది కుంటినడక నడుస్తోంది. దాని నిర్వహణలో నివారించదగిన సమస్యలు వ్యాపారస్థులను, ముఖ్యంగా చిన్న వ్యాపారస్థులను సతాయిస్తున్నాయి. ఇటువటి ఏకీకృత జాతీయ పన్ను వ్యవస్థను అమలు చేస్తున్న ఏ ఇతర దేశంలోనూ చిన్నచిన్న సమస్యలనూ, ఇబ్బందులనూ అధిగమించేందుకు ఇంత కాలం పట్టలేదు.  ప్రభుత్వం ఈ వ్యవస్థను అర్థం చేసుకోలేదంటే దాని అవగాహన స్థాయి ఏపాటిదో ఊహించుకోవచ్చు.

Also read: పెగసస్ పై సుప్రీంకోర్టు, ప్రభుత్వం మధ్య ఘర్షణ అనివార్యం

ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని రోజుల పాటు ప్రతిరోజూ ఇంధనం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దిగువ మధ్యతరగతి కుటుంబాలకు వంటగ్యాస్ శక్తికి మించిన విలాసమైపోయింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉందంటూ ఊదర కొడుతున్న ప్రభుత్వ నేతలు ఇటీవలి కాలంలో ఎన్నడైనా వస్తువులు కొనడానికి దుకాణాలకు కానీ కూరగాయలు కొనడానికి అంగళ్ళకు కానీ వెళ్ళారా అని అనుమానం కలుగుతుంది. కోవిద్ మహమ్మారికి పూర్వస్థితికి ఆర్థిక వ్యవస్థ చేరుకోలేదు. అంతకు ముందే పట్టణాలలోనూ, పల్లెల్లోనూ కార్మికులనూ, కూలీలనూ నియమించడం తగ్గడం, వస్తు వినియోగం తగ్గడం, రుణాలు తీసుకోవడం తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక వ్యవస్థ స్వయంగా మందగించింది. అప్పటికే దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను కోవిద్ మహమ్మారి మరింత కుంగదీసింది. మహమ్మారి రాకకు పూర్వమే అనవసరంగా పెద్దనోట్లను రద్దు చేసే కార్యక్రమాన్ని తలకెత్తుకోవడంతో ఆర్థికవ్వవస్థ అస్తవ్యస్తమైపోయింది. ఆ బృహత్తర నిర్ణయాన్ని పొగడడాన్ని ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు నిలిపివేసినందుకు సంతోషించాలి. కానీ ఈ అనాలోచితమైన చర్యవల్ల వెన్ను విరిగిన అసంఘటితరంగానికి చెందిన అసంఖ్యాకమైన  చిరువ్యాపారులకు ఇదేమీ ఓదార్పు కాదు.

Also read: టీకామహోత్సవంలో ఏమున్నది గర్వకారణం?

కార్పొరేట్ రంగానిదే ప్రగతి

డిమాండ్ ను సవ్యంగా అర్థం చేసుకోకపోవడం, ప్రోత్సాహక ప్యాకేజీ నిర్ణయంలో అవకతవకల కారణంగా, హస్తలాఘవం మూలంగా  పరిస్థితులు మరింత క్షీణించాయి.  ప్రభుత్వానికి కనిపిస్తున్న ఆర్థిక ప్రగతి కార్పొరేట్ రంగానికే పరిమితం. మధ్యతరహా, చిన్న సంస్థల రంగానికి ఇంకా ప్రగతి ఫలాలు చేరవలసి ఉంది. పరిశ్రమలు, నగరాల నుంచి వ్యవసాయానికీ, గ్రామీణ ప్రాంతాలకూ కార్మికులు వలస పోవడం వల్ల గ్రామీణ వ్యవస్థలో పరిస్థితులు మరింత క్షీణించాయి. కార్మికుల ఉపాధికి సంబంధించిన గణాంకాలు సంతోషకరంగా లేవు. ఈ సమస్యల వాస్తవికతను అంగీకరించడానికి అధికారపార్టీ నాయకులు ఇప్పటికీ సిద్ధంగా లేరు. మన ఆర్థిక వ్యవస్థను వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన విధానాలు కనిపించడంలేదు. ప్రధాని నాయకత్వంలో ఉన్న ఆర్థిక సలహా మండలి, ఆర్థిక మంత్రిత్వశాఖలో ఉన్న ఆర్థిక వివేకం ప్రభుత్వ చర్యలలో కనిపించడం లేదు. విలువైన ప్రభుత్వ ఆస్తులను విచక్షణారహితంగా  కారుచౌకకు అమ్మివేయడానికి ఉద్దేశించిన నిరుపయోగమైన పథకాలను రచించేందుకు ప్రభుత్వం దగ్గర ఉన్న ఉత్తమమైన ప్రావీణ్యాన్ని వినియోగిస్తున్నారు. అటువంటి అపసవ్యమైన ప్రణాళికలను ప్రజలకు ఆర్థిక సంస్కరణల పేరిట మభ్యపెట్టి వారిని ఒప్పించేందుకు చేసే ప్రయత్నంలో అధికారపార్టీలో వాక్చాతుర్యం కలిగిన ప్రవీణులను వినియోగిస్తున్నది.

కోవిద్ -19 రెండో తరంగాన్ని తట్టుకొని నిలవడంలో ప్రభుత్వం ప్రదర్శించిన అసమర్థతను ప్రభుత్వం ప్రమత్తంగా ఉండటం వల్ల టీకాల విషయంలో కలిగిన సంక్షోభంతో పోల్చవచ్చు. అపరిపక్వమైన ‘వాక్సిన్ మైత్రి’ విధానం, అంతలోనే మన దేశంలో వాక్సీన్ ఉత్పత్తిదారులు ఇదివరకే అంగీకరించిన ఎగుమతులను చేయకుండా ఆంక్షలు విధించడం, రిస్కు తీసుకొని భారత టీకా మందు ఉత్పత్తి సంస్థలకు ముందస్తుగా నిధులు విడుదల చేయకపోవడం, భారత మార్కెట్ కు సరఫరా చేసేందుకు విదేశీ వాక్సిన్ ఉత్పత్తి సంస్థలను అనుమతించకపోవడం, కేంద్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రభుత్వాలకీ వేర్వేరు రేట్లలో టీకా మందు విక్రయించాలనడం,  రాష్ట్రాల చావు రాష్ట్రాలు చావాలంటూ వాటిని వాటి గతికి వదిలివేయడం… ఈ జాబితా పొడవైనదీ, బాధకరమైనదీనూ. వందల వేలమంది మరణించారు. అవన్నీ నివారించదగినవే. సామూహిక అంత్యక్రయలు, మన నగరాలలో పేవ్ మెంట్ల మీద కోవిద్ మృతుల దేహాలు పడి ఉండటం, పవిత్ర గంగానదిలో కోవిద్ మృతుల శవాలు తేలుతూ వస్తున్నప్పటి దృశ్యాలు మనసును కలవరపరిచాయి.

ప్రభుత్వాలకు మిలటరీ గూఢచారి పరికరాలను (పెగసస్) విక్రయించిన ఇజ్రేయిల్ కంపెనీ ఎన్ఎస్ఓను అమెరికా నిషేధించినట్టు (బ్లాక్ లిస్ట్ చేసినట్టు) తనకు తెలియదని ప్రభుత్వం మొన్న లోక్ సభలో కళ్ళార్పకుండా బొంకింది. ఆ నిఘాయంత్రాన్ని కొన్నారా లేదా చెప్పమని సుప్రీంకోర్టు అడిగితే ప్రభుత్వం ససేమిరా అన్నది. ఈ యంత్రాలను దేశవాసులపైన ఉపయోగించారనే ఆరోపణపైన విచారణ జరిపించేందుకు అత్యున్నత న్యాయస్థానం దర్యాప్తు సంఘాన్ని నియమించవలసి వచ్చింది. ఈ నిఘా యంత్రాలను ఎవరు వినియోగించారో, ఉపయోగించే అధికారం వారికి ఎవరు ఇచ్చారో కనుక్కోవడం కూడా దర్యాప్తు సంస్థ చేయవలసిన పనులలో ఒకటి. ఇటీవల రద్దయిన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ దీక్షలో కూర్చున్న రైతులలో ఎంతమంది చనిపోయారన్నవివరాలు తన దగ్గర లేవని కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంటులో చెప్పింది. అదే విధంగా కోవిద్ మహమ్మారి విజృంభించిన కాలంలో ఎంతమంది పోలీసు ఉద్యోగులు మరణించారో, ఎంతమంది డాక్టర్లూ, ఇతర సిబ్బంది మరణించారో తన దగ్గర లెక్కలు లేవని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పారిశుద్ధ్య సిబ్బంది ఎంతమంది చనిపోయారో వివరాలు కూడా లేవని చెప్పింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ దేశంలోని నిరుద్యోగులకు ఇచ్చిన సమాచారాన్ని అణచిపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పెద్ద నోట్ల  రద్దు నిర్ణయం అమలు తర్వాత పాత కరెన్సీలో ఎంత మేర వెనక్కు వచ్చిందో రిజర్వుబ్యాంక్ ఇప్పటికీ వెల్లడించవలసే ఉన్నది. భారత దేశంలో అందుతున్న గణాంకవివరాల పట్ల చాలా దేశాలు సంకోచం వెలిబుచ్చాయి. ఇండియా గణాంకవివరాల విశ్వసనీయత తగ్గిపోవడం పట్ల ఆందోళన వెలిబుచ్చుతూ ప్రపంచవ్యాప్తంగా వందమందికిపైగా విద్యావేత్తలు ఒక మెమోరాండంపైన సంతకాలు పెట్టారు.

Also read: ఆర్ఎస్ఎస్ బలం పెరిగింది, దృష్టి మందగించింది

గణాంకాల ప్రభావం పరిమితం

ఒక ప్రధానమైన అంశాన్ని ప్రభుత్వం గుర్తించలేదు. గణాంకాలని అణచిపెట్టడం, జటిలం చేయడం, అనుకూలంగా మార్చినంత మాత్రాన దీర్ఘకాలిక అభిప్రాయాలు మారవు. కొద్ది కాలం ఆశించిన ఫలితం ఉంటుందేమో, మీడియాలో శీర్షికలు అనుకూలంగా రావచ్చునేమో. ఎందుకంటే ఎవరైనా తమ అభిప్రాయాలను తమ జీవనానుభవాన్ని బట్టి ఏర్పరచుకుంటారు.

మన పార్లమెంటు చట్టాలపైన సమాలోచనకు కానీ ప్రభుత్వ విధానాల వల్ల కలిగే కష్టనష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి నివారించడానికి కానీ ఉపయోగించే వేదిక ఏ మాత్రం కాదు. బిల్లులను కాంతి వేగంతో ఆమోదిస్తున్నారు. స్థాయీ సంఘాలకు నివేదించిన డేటా ప్రొటెక్షన్ బిల్లు వంటివి కొన్ని సంవత్సరాల దాకా బయటికి రావు.  పార్లమెంటు చెప్పే విషయాలు వినేందుకు ప్రభుత్వం అయిష్టంగా ఉంది. పార్లమెంటు కార్యక్రమాల గురించి రాయకుండా మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించడం తాజా మలుపు. పౌరసమాజమే దేశానికి శత్రువు అని నిర్ధారించేవరకూ ఒక పెద్ద స్థాయిలో ఉన్న ముఖ్యమైన ప్రభుత్వ సలహాదారు వెళ్ళారు. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలో 1960లూ, 1970లలో సైనిక నియంతలు ప్రవచించిన భ్రష్టుపట్టిన సిద్ధాంతాలనే తాను తిరిగి ప్రతిపాదిస్తున్నానన్న సంగతి విస్మరించినట్టున్నారు.

Also read: లఖీంపుర్ ఖేరీ: బీజేపీ, మోదీ మన్ కీ బాత్

ఒక వైపు విచారం, మరో వైపు ఆందోళన

ఈ జాబితాను తాయారు చేయడం ప్రారంభించాను. ఇప్పుడు ప్రభుత్వం సమగ్రమైన ఇతివృత్తం స్పష్టంగా కనిపిస్తోంది. జాబితాను ఇక్కడ ఆపుజేయనివ్వండి.  ఇది నన్ను విచారంలో ముంచుతోంది. ఆందోళన కలిగిస్తోంది. 2014లో చేసుకున్న సంకల్పానికి మనం చాలా దూరంలో నిలిచిపోయినందుకు  ఆందోళన కలుగుతోంది.  సంపూర్ణమైన విశ్వాసంతో, ఆశావాదంతో, గొప్ప అంచనాలతో నవభారత స్వప్నం సాకారం అవుతుందని భావించాం. ఆ అంచనాలూ, విశ్వాసం, ఆశాభావం వమ్ము అయినందుకు ఆందోళన. 2014లో దేశ రక్షకుడిగా అభివర్ణించిన నాయకుడూ, ఆయన పార్టీ నాయకులూ అధికారంలో కొనసాగేందుకూ, మళ్ళీ ప్రజామోదం పొందేందుకూ, రాష్ట్రాలలో ఎన్నికలు గెలిచేందుకూ, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకూ, తమ అస్థిత్వాన్ని తామే అనుమానించే విధంగా ప్రజలను తయారు చేసేందుకూ, దేశ తొలిప్రధాని గురించి అసభ్యంగా మాట్లాడటం, చరిత్రను వక్రీకరించడం, మన సమాజంలో అట్టడుగున ఉండే పాశవిక లక్షణాలను ప్రకోపించే విధంగా బూటకపు విన్యాసాలు చేయడం వంటి పాడుపనులకు ఒడిగట్టుతున్నారు.  ఇండియాలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి దిగజారి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలలో నాలుగు సీట్లు సంపాదించుకోవడానికి ప్రతిపక్షాలపైన అవాకులు చవాకులు పేలుతున్నారు కనుక ఆందోళక కలుగుతోంది. రెండుసార్లు వరుసగా ఎన్నికలలో విజయం సాధించిన వ్యక్తి రాజకీయ అస్థిత్వంకోసం లేనివి ఉన్నట్టూ, ఉన్నవి లేనట్టూ చూపించే అవాస్తవాలపైనా, పత్రికలలో, న్యూస్ చానళ్ళలో శీర్షికలు అనుకూలంగా వచ్చేట్టు చూసుకోవడంపైనా, కండబలం కలిగిన జాతీయవాదాన్ని ప్రోత్సహించడంపైనా, మతం పేరుతో సమాజంలో చీలికలు తేవడంపైనా ఆధారపడుతున్నందుకు విచారంగా ఉంది. టీకాల విషయంలో గందరగోళం చేసి, కోవిద్ మహమ్మారి చేతిలో వేలమంది దుర్మరణం పాలైన వాస్తవాలను ప్రజల మనోఫలకంపై నుంచి చెరిపివేయడం కోసం ప్రధాని జన్మదినం రోజు రెండులక్షల మందికి టీకాలు వేసినట్టు ఒక మైలురాయిని సృష్టించడం చూస్తే విచారం కలుగుతోంది. చాలా ఆలస్యంగా పూర్తి చేసిన వంద కోట్ల మందికి టీకాలు వేయాలనే లక్ష్యాన్ని సాధించడం ఒక విజయంగా చెప్పుకుంటున్నందుకు విచారంగా ఉంది. వెనకమొహం వ్యక్తి, మధ్యయుగాలనాటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అయిన ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికలలో గెలవడంపైన ప్రధాని రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని చెప్పుకుంటున్నందుకు విచారంగా ఉంది. దేవాలయాల నిర్మాణం, పవిత్ర స్థలాల పునరుజ్జీవనం, అలంకరణ, మతవలయాలను సృష్టించడం, పిడివాదుల కార్యకలాపాలపైన, మైనారిటీలను దూరం చేయడంపైన, దేశవిభజన నాటి నిప్పులాంటి  జ్ఞాపకాలను గుర్తుచేసి రాజవేయడంపైనా ఆధారపడి రాజకీయంగా ప్రాసంగికతలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు కనుక విచారంగా ఉంది. ఈ చీకటి కార్యక్రమానికి అభినందనపూర్వకంగా  చప్పట్లు చరిచేవారు కొందరు మీడియాలో తయారైనారు కనుక విచారంగా ఉంది. ఇవన్నీ చాలవని అనుకుంటే సరిహద్దులో ఆత్మహత్యాసదృశమైన దుస్సాహసానికి పాల్పడటానికి అధినాయకుడు కాలుదువ్వే అవకాశం లేకపోలేదు. అది మరింత ఆందోళన కలిగిస్తోంది.  

Also read: కాంగ్రెస్ పార్టీ కోలుకోవాలంటే…

(మిడ్ వీక్ మ్యాటర్స్ MwM ఎపిసోడ్ 39కి స్వేచ్ఛానువాదం)

Dr. Parakala Prabhakar
Dr. Parakala Prabhakar
The author is an Economist, Policy Consultant, Former Adviser to Government of Andhra Pradesh. Managing Director of RightFOLIO, a knowledge enterprise based in Hyderabad.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles