పీవీఆర్ నరసింహారావు నూటికి నూరు పాళ్ళు తెలుగువారు. అమెరికాలో నివాసం. ఐటీ వృత్తి. జ్యోతిష్యం చెప్పడం ప్రవృత్తి. మద్రాసు ఐఐటీలో ఇంజనీరింగ్ చదివి, అమెరికాలోని హూస్టన్ లో రైస్ యూనివర్శిటీలో మాస్టర్స్ చేశారు. శాస్త్రవిజ్ఞానంపైన కొన్ని అనుమానాలు ఉండటం వల్ల జోతిష్య శాస్త్రంలో పరిశోధన చేశారు. ఈ రోజున ఆయనను అందరూ జ్యోతిషశాస్త్రవేత్తగా గుర్తించి గౌరవిస్తున్నారు. దివంగత బెజాన్ దారూవాలా లాగానే నరసింహారావు కూడా భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందుగానే చెప్పడం, ఆయన చెప్పినవి నిజం కావడం చూసినవారు ఆయనకు ఫిదా అయిపోతున్నారు.
తనకున్న సంస్కృత భాషా పరిజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం కలిపి పరిశోధన చేశాననీ, చేస్తున్నాననీ చెబుతారు నరసింహారావు. కోవిద్ మహమ్మారి ఎప్పుడు ఆవిర్భవిస్తుందో, ఎంతకాలం వేధిస్తుందో, ఎంతమందిని కబళిస్తుందో ఆయన చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ ఓటమి ఖాయమని కూడా జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జాతకం బాగున్నదనీ, ఆయన వచ్చే ఎన్నికలలో సైతం నెగ్గుతారనీ నరసింహారావు చెప్పారు. తాజాగా చెప్పిన మొదటి రెండూ నిజం కావడంతో ఆయన జ్యోతిషానికి ఆదరణ, గిరాకీ పెరిగింది. నరసింహారావు జ్యోతిషం చెప్పిన 12 ప్రధానమైన అంశాలను కింద చూడండి:
- యోగి ఆదిత్యనాథ్ 2022లో ఉత్తర ప్రదేశ్ లో జరగబోయే విధాన సభ ఎన్నికలలో విజయం సాధిస్తారు.
- 2024 ఎన్నికలలో బీజేపీ గెలుస్తుంది. కానీ 2026 ప్రథమార్ధంలోనే నరేంద్రమోదీ ప్రధాని పదవీ బాధ్యతలు యోగి ఆదిత్యనాథ్ కు అప్పగిస్తారు. ఆయన పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటారు.
- పెద్ద ప్రపంచ యుద్ధం, మహాభారత సంగ్రామం వంటి ఘటన జరిగే అవకాశాలు 2030-2031లో ఉండవచ్చు. ఆ క్లిష్ట పరిస్థితులలో భారత్ కు యోగి ఆదిత్యనాథ్ సమర్థంగా నాయకత్వం వహిస్తారు.
- పది, పదిహేను సంవత్సరాలలో టిబెట్ స్వాతంత్ర్యం పొందుతుంది. చైనా చాలా భాగాలుగా చీలిపోతుంది.
- రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ప్రాధాన్యం తగ్గిపోయినట్టే అమెరికా ప్రాధాన్యం కూడా క్రమంగా తగ్గుతుంది.
- అఫ్ఘానిస్తాన్ కి మంచి రోజులు రావడానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. 2042 వరకూ నాకు అఫ్ఘానిస్తాన్ కి ఆశాజనకమైన పరిస్థితి కనిపించడం లేదు.
- 2022 మధ్య కాలం నుంచి పాకిస్తాన్ కి చాలా చెడు రోజులు దాపురించబోతున్నాయి. తాలిబాన్ సృష్టించే అలజడి, తిరుగుబాటు పాకిస్తాన్ కీ, చైనాకీ నష్టం కలిగిస్తుంది. (ముస్లింలు అధికంగా నివసించే) సింగ్జియాంగ్ రాష్ట్రంలో యూఘిర్స్ తిరుగుబాటు కారణంగా చాలా అశాంతి చోటుచేసుకుంటుంది.
- మధ్యప్రాచ్యం (పశ్చిమాసియా) తగులబడుతుంది. మధ్యప్రాచ్యంలోని ప్రధాన దేశాలలో కార్చిచ్చు బయలుదేరుతుంది. ఈ అలజడికి ఇరాన్ కేంద్రం అవుతుంది.
- 2019 నుంచి 2036 వరకూ ప్రపంచానికి అస్థిరత కలిగించే కాలం. ఇరవయ్యో శతాబ్దిని ఒక సారి పరిశీలించండి. 1920 నుంచి 1945 వరకూ (పాతికేళ్ళ పాటు) పరిస్థితులు అత్యంత ప్రమాదభూయిష్టంగా ఉన్నాయి. అంటువ్యాధులు యూరప్ లో కలకలం సృష్టించాయి. ద్రవ్యమాద్యం (గ్రేట్ డిప్రెషన్) 1929లో మొదలై ప్రపంచ యుద్ధానికి దారితీసింది. 21వ శతాబ్దంలో కూడా అదే రకమైన పరిణామాలు దాపురిస్తాయి. కానీ అంతకాలం చెడ్డరోజులు ఉండవు. ద్రవ్యమాంద్యం 2026 తర్వాత సంభవం. ఆ తర్వాత 2030-32 మధ్య కాలంలో చిన్న ప్రపంచయుద్ధం రావచ్చు. ఆ తర్వాత పరిస్థితులు చల్లబడతాయి.
- మతాతీత వ్యక్తులూ, నిరీశ్వరవాదుల సంఖ్య ప్రతి ఖండంలోనూ విపరీతంగా పెరిగిపోతుంది. ఇది హిందూ మతానికి మంచే చేస్తుంది కానీ క్రైస్తవానికీ, ఇస్లాంకీ చెడు చేస్తుంది.
- పాశ్చాత్య సంస్కృతి మనుగడ కష్టం. అది ప్రకృతికి విరుద్ధం. భారతీయ, లాటిన్ అమెరికన్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలోని ఆదిమవాసుల జీవనశైలి ప్రకృతికి సమీపంగా ఉంటుంది. ఇప్పటి నుంచి కొన్ని దశాబ్దాల తర్వాత పాశ్చాత్య సంస్కృతిని ప్రకృతి సహించదు.
- వచ్చే ఉపద్రవం ప్రకృతి ప్రవేశపెట్టే ఒక సవరణ వంటిదే. ప్రపంచం సనాతన ధర్మం వైపు క్రమంగా ప్రయాణిస్తుంది.
Also read: ఇద్దరు ఎంఎల్ఏలు రాజీనామా చేసే అవకాశం
(గమనిక: మేము హేతువాదాన్నే విశ్వసిస్తాం. కానీ పీవీఆర్ నరసింహారావు చెప్పిన జోస్యం రాజకీయాల గురించి కనుక, ఒక రాజకీయ విశ్లీషణ వంటి అంశమే కనుక ఇక్కడ ప్రచురిస్తున్నాం. ఇందులో పేర్కొన్న అంశాలు నిజమైనా, అబద్ధమైనా మా పూచీ లేదు – ఎడిటర్)