ఉగ్రవాదాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవడం ప్రమాదకరమని భారత ప్రధాని నరేంద్రమోదీ 76వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఉద్ఘాటించారు. ‘‘ప్రపంచంలో ప్రతీపవాదం, తీవ్రవాదం పెరుగుతున్నాయి. ఉగ్రవాదాన్ని రాజకీయ ఆయుధంగా వినియోగించే ప్రయత్నం చేస్తున్నవారు అదే ఉగ్రవాదం తమకూ ప్రమాదకరంగా పరిణమిస్తుందని గుర్తించాలి,’’ అంటూ మోదీ పాకిస్తాన్ ను పరోక్షంగా ప్రస్తావించి హెచ్చరించారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇదే సభను ఉద్దేశించి శుక్రవారంనాడు ప్రసంగించారు. ఆయన కశ్మీర్ ప్రస్తావన చేసినందుకు భారత శాశ్వత ప్రతినిధి స్నేహదుబే దీటైన సమాధానం ఇచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆతిథ్యం ఇవ్వడం, వారికి అవసరమైన ఆయుధాలు సమకూర్చడం, శిక్షణ ఇవ్వడం కొత్త కాదు. ఇదే అంశాన్ని ఇండియా అంతర్జాతీయ వేదికలపైన పలుసార్లు ప్రస్తావించింది. లష్కరే తొయ్యబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను పోషిస్తూ కశ్మీర్ పైకి ఉసిగొలిపి పంపుతున్న పాకిస్తాన్ అదే ఉగ్రవాదంతో నష్టపోతోంది కూడా. 11 సెప్టెంబర్ 2001న న్యూయార్క్ లోని జంట శిఖరాలను (ట్విన్ టవర్స్) కూల్చివేసిన అల్ ఖాయిదా నాయకుడు ఒసామా బిన్నలాదెన్ కు కూడా పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చిందనీ, పాకిస్తాన్ భూభాగంలోనే అమెరికా కమాండోలు ఒసామాను హతమార్చారనీ తెలిసిందే. 2019 ఫిబ్రవరిలో పాకిస్తాన్ లో బాలాకోట్ పైన భారత వాయుసేన దాడి చేసి అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసిన సంగతి విదితమే. ఉగ్రవాదంపట్ల ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు.
‘‘అఫ్ఘానిస్తాన్ లోని మైనారిటీలకు సహాయం అవసరమైతే మనం ఆ సహాయం అందించగలిగే పరిస్థితులు ఉండాలి. మన సముద్రాలలో మనందరికీ భాగస్వామ్యం ఉంది. ఈ వనరులను సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరూ విస్తరించకుండా, ఈ వనరులను కాజేయకుండా చూసుకోవాలి,’’ అంటూ మోదీ ఉద్ఘాటించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలను స్వేతభవనంలో జరిపి వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి భవనాలకు మోదీ వెళ్ళారు. ‘కోవిద్ నుంచి కోలుకోవడానికి అవసరమైన మనో నిబ్బరాన్ని, కృషినీ కొనసాగిద్దాం’ అన్నది ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి సమావేశాల లక్ష్యం.
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇండియా ఎన్ డీఏ టీకాను కనిపెట్టిందనీ, దానిని 12 ఏళ్ళ బాలబాలికలకు ఇవ్వవచ్చుననీ ప్రధాని చెప్పారు. ‘‘రండి. ఇండియాలో టీకా మందు తయారు చేసుకోండి,’’అంటూ ప్రపంచ దేశాలను మోదీ ఆహ్వానించారు. సేవే పరమధర్మం అనే నానుడిలో విశ్వాసం కలిగిన దేశంగా పరిమితమైన వనరులు ఉన్నప్పటికీ ఇండియాలో టీకాలకు కొదవలేదని ఆయన వ్యాఖ్యానించారు. తమ దేశంలో శాస్త్రజ్ఞులు ముక్కు ద్వారా ఇచ్చే టీకా మందులు కూడా కనుగొనే ప్రయత్నంలో ఉన్నారనీ, ఎం-ఆర్ఎన్ఏ టీకాలు కూడా సిద్ధం అవుతున్నాయనీ మోదీ తెలియజేశారు. మానవాళిపట్ల బాధ్యతను గుర్తించిన ఇండియా ఏ దేశానికైనా అవసరమైతే టీకామందులు పంపుతున్నదని చెప్పారు. అక్టోబర్ చివరినాటికి 80 లక్షల టీకా మందులను ఇండియా ఎగుమతి చేస్తుందనీ క్వాడ్ దేశాల కూటమి సమావేశంలో మోదీ చెప్పారు. ఈ కూటమిలో ఇండియాతో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి.
ప్రధాని హోదాలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించడం ఇది నాలుగోసారి. వందేళ్ళలో ఎన్నడూ ఎరుగని వ్యాధితో ప్రపంచం కుస్తీ పడుతోందని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత వైవిధ్యభరితంగా ఉండాలని కోవిద్ ప్రపంచానికి పాఠం చెప్పిందని అన్నారు. ‘‘భారత దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలం ఎటువంటిదంటే యువకుడిగా ఉన్నప్పుడు టీ అమ్మిన వ్యక్తి ఈ రోజు మీముందు ఐక్యరాజ్య సమితిలో నాలుగో సారి మాట్లాడుతున్నాడు,’’ అని మోదీ చెప్పారు.