తాజా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవాయే కొనసాగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వ, వాక్పటుత్వ ప్రభావాలే ప్రధాన చోదక శక్తులుగా పనిచేశాయి. కాంగ్రెస్ బలహీనత జాతీయ స్థాయిలో మరోమారు రుజువైంది. ప్రాంతీయ పార్టీలను, యువతను తక్కువ అంచనా వేయరాదని ఆర్ జె డి ఫలితాలు, తేజస్వీ యాదవ్ వ్యూహ ప్రతివ్యూహ నాయకత్వ పటిమ గట్టిగా చెబుతోంది. గెలిచిన నితీశ్ కుమార్ మొదలు ఓడిన సీనియర్ నాయకులందరూ పునఃసమీక్ష చేసుకోవాల్సిందే. ఎన్నికల్లో ఎప్పటికీ విజయం మాదేనని గర్వం తలకెక్కించుకుంటే, మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ ఎన్నికలు చాలామందిని హెచ్చరిస్తున్నాయి.
బీజేపీ విజయ కారణాలు
బీజేపీకి ఇంతటి గెలుపును ప్రజలు ఇచ్చారంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ప్రభావశీలమైన ప్రతిపక్షం లేకపోవడం, ముఖ్యంగా ప్రధాన కాంగ్రెస్ పార్టీ చతికిలబడిపోవడం. ప్రాంతీయ పార్టీల స్వరం, నాయకత్వ బలం తగ్గిపోవడం, రేపటి పట్ల బలమైన విశ్వాసాన్ని కలుగజేయగల నాయకులు కానరాకపోవడం, నరేంద్రమోదీ పట్ల ప్రజల్లో విశ్వాసం పదిలంగా ఉండడం మొదలైనవాటిని చెప్పవచ్చు. తెలంగాణలోని దుబ్బాకలో బిజెపి గెలుపు తెలుగు రాష్ట్రాల భావి పరిణామాలను సూచన ప్రాయంగా చెబుతున్నాయి.
తిరుగులేని జాతీయపార్టీగా బీజేపీ
అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు జనరంజకంగా, ప్రజాస్వామ్య యుతంగా పాలన అందించక పోతే జాతీయ పార్టీలు అధికారాన్ని ఎగరేసుకుపోతాయని ఈ ఫలితాలు చెబుతున్నాయి. జాతీయ పార్టీలంటూ ప్రస్తుతం ఏమీ లేవు. బీజేపీ ఒక్కటే ప్రస్తుతం జాతీయ పార్టీగా రెపరెపలాడుతోంది. రాష్ట్రాల్లోనూ బలం పెంచుకుంటోంది. వాస్తవంగా దేశంలో పరిస్థితులు ఏమీ బాగాలేవు. ఉపాధి సమస్యాత్మకంగానే ఉంది. నిరుద్యోగం ప్రబలుతోంది. ధరలు భగ్గుమంటున్నాయి. కోవిడ్ కల్పించిన కష్టాలు తీరడం లేదు.కరోనా వైరస్ నుండి ఇంకా విముక్తి రాలేదు, వలస కార్మికులకు జీవనం ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. ఇంత వ్యతిరేక వాతావరణంలోనూ, ఆరేళ్ళ నుండి అధికారంలో ఉన్నా, బిజెపికి ప్రజలు ఇంకా మద్దతు పలుకుతున్నారంటే నరేంద్రమోదీ నాయకత్వంపై ప్రజలు పెంచుకున్న విశ్వాసం.
బలమైన ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకం
మధ్యలో జమిలి ఎన్నికలు రాకపోతే, రాబోయే ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలపైగా సమయం ఉంది. అన్ని రాష్ట్రాలలో ప్రజలు పడుతున్న అన్ని ఇబ్బందులను గుర్తెరిగి, పరిష్కారాలు చూపించి, దేశాన్ని ప్రగతి పథంలో నడిపితే, వచ్చే ఎన్నికల్లోనూ నరేంద్రమోదీకి బ్రహ్మరథం పడతారు. అదే సమయంలో, బలమైన ప్రతిపక్షం లేకపోతే, ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నారర్ధకమవుతుందనీ పండితులు హెచ్చరిస్తున్నారు. పాలక పార్టీలు నియంతృత్వ ధోరణిలు అవలంబించే ప్రమాదం ఉంటుందనీ రాజనీతిశాస్త్ర నిపుణులు హితవు చెబుతున్నారు.
మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా మోదీ
ఈ నేపథ్యంలో, జాతీయ స్థాయిలో ఉన్న ఏకైక పెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పుంజుకోకపోతే, దేశ స్థాయిలో ప్రతిపక్షం సీటు ఖాళీ అవుతుంది.రాహుల్ గాంధీ వంటి నాయకులు ప్రజాక్షేత్రంలో నిరంతరం నిలబడక పోతే, నిగ్గతీసి అడగకపోతే ఇలాగే వెనకబడి పోతారు. మొత్తంమీద ఈ ఎన్నికల్లో, నరేంద్రమోదీ మ్యాన్ అఫ్ ది సిరీస్ గా, తేజస్వీ యాదవ్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా, జ్యోతిరాదిత్య సింధియా బెస్ట్ బౌలర్ గా, నితీశ్ కుమార్ నాట్ ఔట్ బ్యాట్స్ మెన్ గా అభివర్ణించాలి.