- తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ఉద్బోధ
- సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అత్యంత భారీ సభ
- కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో ప్రవేశం
జంట ఇంజన్ల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దిల్లీలోనూ, హైదరాబాద్ లోనూ బీజేపీ ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి శీఘ్రంగా జరుగుతుందనీ, మంచి సదవగాహనతో విధానాలు రూపొందించుకోవచ్చుననీ ప్రధాని చెప్పారు.
సికిందరబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం సాయంత్రం జరిగిన పెద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, తెలంగాణలో అనేక పథకాలకు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామనీ, ఇంకా రింగ్ రోడ్డు, నగరంలో జనసమ్మర్దం తగ్గించేందు కు మరిన్ని ఫ్లయ్ వోవర్లూనిర్మించబోతున్నామనీ చెప్పారు. దేశంలోనే నాలుగు పెద్ద టెక్సెటైల్ పార్క్ లు రాబోతున్నాయనీ,వాటిలో ఒకటి తెలంగాణలో రాబోతోందనీ మోదీ వెల్లడించారు. హైదరాబాద్ ను విజ్ఞానకేంద్రంగా అభివృద్ధి చేస్తామనీ, ఇప్పటికే బయో ఇండస్ట్రీకి కేంద్రంగా ఉన్నదనీ, ఐటీరంగంలో ముందంజ వేస్తున్నదనీ, బీజేపీ అధికారంలోకి వస్తే మరింత వేగిరం అభివృద్ధి జరుగుతుందని ప్రధాని అన్నారు.
ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి ప్రస్తావన కానీ, తెలంగాణ రాష్ట్ర సమితిపేరు కానీ ప్రదాని తీసుకురాలేదు. కుటుంబ పాలన అనే విమర్శ కూడా ఇతరులు చేశారు కానీ ప్రధాని నోటిమీదుగా ఆ మాట రాలేదు. ఎక్కువగా అభివృద్ధి గురించీ, గుళ్ళూ గోపురాల గురించీ, తెలంగాణ శౌర్యం గురించీ, రైతుల నైపుణ్యం గురించీ మాట్లాడారు. భద్రాద్రి నుంచి యాదాద్రివరకూ, జోగులాంబ గుడి నుంచి బద్రకాళి గుడి వరకూ తెలంగాణ అత్యంత పవిత్రమైన భూమి అని ప్రధాని అన్నారు.
ప్రధాని కంటే ముందు బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బండి సంజయ్, అంతకంటే ముందు పీయూష్ గోయెల్, అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, కిషన్ రెడ్డి, అరుణ, తదితరులు మాట్లాడారు. నితిన్ గడ్కరీ,రాజ్ నాథ్ సింగ్, తదితర జాతీయ నాయకులూ, ఈటల రాజేంద్ర,రామచంద్రరావు వంటి రాష్ట్రస్థాయి నాయకులూ వేదికపైన కూర్చున్నారు. కెవిరంగారెడ్డి మనుమడు, అపొలో ఆస్పత్రుల సంస్థ యజమాని అల్లుడు, చేవెళ్ళ మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డిని వేదికపైన బీజేపీ జాతీయఅధ్యక్షుడు నడ్డా శాలువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.