- 18 ఏళ్ళు పైబడినవారందరికీ టీకాలు
- టీకాల బాధ్యత రాష్ట్రాల నుంచి స్వీకరించిన కేంద్రం
- కరోనా మహమ్మారిపై యుద్ధంలో విజయం సాధిస్తామని ప్రకటన
- 80 కోట్ల మంది ఉచిత రేషన్ సౌకర్యం దీపావళి వరకూ పొడిగింపు
దిల్లీ: వాక్సిన్ పంపిణీ బాధ్యతను కేంద్రం తిరిగి తన చేతుల్లోకి తీసుకున్నది. సోమవారంనాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవాసులతో మాట్లాడుతూ, ఇంతవరకూ వాక్సీన్ల (టీకాల) నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చామనీ, ఇప్పుడు ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తుందనీ, ఉచితంగా దేశ ప్రజలందరికీ టీకా మందులు ఇస్తామనీ ప్రధాని ప్రకటించారు.
వాక్సిన్ రెండో తరంగాన్న సమర్థంగా ఎదుర్కొంటున్నామనీ, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అందుబాటులోకి తెచ్చామనీ, టీకా మందును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని 2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 60 శాతం నుంచి 90 శాతానికి పెంచామనీ ప్రధాని చెప్పుకొచ్చారు. ఈ నెల 21వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తామనీ, 18 సంవత్సరాలు పైబడినవారందరికీ టీకాలు తీసుకునే అవకాశం ఉన్నదనీ ప్రధాని చెప్పారు. నవంబర్ నాటికి దేశ ప్రజలలో 80 శాతం మందికి టీకాలు వేసే విధంగా యుద్ధప్రాతిపదికపైన చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా టీకా మందు ఇస్తారనీ, ప్రైవేటు ఆస్పత్రులు సర్వీస్ చార్జి కింద రూ. 150 మాత్రం వసూలు చేయవచ్చుననీ, ప్రైవేటు ఆస్పత్రులకు టీకాకి రూ. 600 ఖర్చు అయితే దానికి రూ. 150లు కలిపి రూ. 750లు వసూలు చేయవచ్చుననీ చెప్పారు. ఉత్తత్పిదారుల నుంచి 25 శాతం టీకాలను ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కొనుగోలు చేయవచ్చునని అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇకమీదట కేంద్రమే చూసుకుంటుందనీ, ఆరోగ్యం రాష్ట్రాల జాబితాలో ఉన్న కారణంగా ఈ విషయాన్ని ఇంతకాలం రాష్ట్రాలకు వదిలిపెట్టామనీ, ఇక తామే ఈ కార్యక్రమం చూసుకుంటామనీ అన్నారు.
దేశంలో 80 కోట్లమంది పేదవారికి దీపావళి వరకూ ఉచిత రేషన్ ఇవ్వాలని నిర్ణయించామని ప్రధాని ప్రకటించారు. దేశం కష్టాలలో ఉన్నప్పుడు, ప్రభుత్వం కర్తవ్య నిర్వహణలో నిర్విరామంగా పని చేస్తున్నప్పుడు కొంతమంది పని కట్టుకొని విమర్శించారనీ, వారి పద్ధతి స్వయమో, అససవ్యమో దేశ ప్రజలే నిర్ణయించుకోవాలనీ వ్యాఖ్యానించారు.
వందేళ్ళలో ఇటువంటి మహమ్మారి ప్రపంచంలో ఎక్కడా రాలేదనీ, దీని రెండో దాడిని ధైర్యంగా, సమష్టిగా దేశ ప్రజలందరూ ఎదుర్కోవాలనీ ఉద్బోధించారు. కరోనా ఎంతోమంది ఆప్తులను పొట్టనపెట్టుకున్నదనీ, బాధిత కుటుంబాలకు తన సానుభూతి వెలిబుచ్చుతున్నాననీ ప్రధాని న్నారు. ఏప్రిల్ లో ఆక్సిజన్ కొరత ఊహించనంతగా ఏర్పడిందనీ, ఇప్పుడు ఆ సమస్యను అధిగమించామనీ చెప్పారు. వైద్యరంగంలో మౌలిక వసతులు పెంచామనీ, ల్యాబ్ లను భారీ గా విస్తరించామనీ చెప్పారు. దేశవిదేశాల నుంచి టీకాలు దిగుమతి చేసుకుంటున్నామనీ, మందులు కూడా తెప్పిస్తున్నామనీ తెలియజేశారు.
దేశంలోని శాస్త్రవేత్తలు గొప్ప కృషి చేశారనీ, ప్రపంచంలోని సంపన్న దేశాలకు దీటుగా భారత్ ను నిలబెట్టారనీ మోదీ చెప్పుకొచ్చారు. దేశంలో మే మాసంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయనీ, ఇప్పుడు పరిస్థితి కొంత అదుపులోకి వస్తున్నదనీ చెప్పారు. ‘మిషన్ ఇంద్రధనుస్సు’ పేరుతో టీకా ఉద్యమాన్ని ప్రభుత్వం ఉధృతం చేస్తున్నదని చెప్పారు.