- మా తపస్సులో ఏదో లోపం ఉంది, అందుకే రైతులకు నచ్చజెప్పలేకపోయాం
- చట్టాలు రైతుల మేలు కోసం తెచ్చినవే, కొందరు వ్యతిరేకిస్తున్నారు
- చట్టాలు రద్దు చేస్తూ పార్లమెంటు సమావేశాలలో తీర్మానం చేస్తాం
- అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా దిగివచ్చిన కేంద్రం
దిల్లీ: వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలనూ రద్దు చేయబోతున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం ప్రకటించారు. దేశవ్యాప్తంగా రైతుల నిరసనోద్యమం చాలా కాలంగా జరుగుతూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అనుకోవలసి ఉంటుంది.
‘‘నా అయిదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో రైతుల కడగండ్లను కళ్ళారా చూశాను. దేశం నన్ను ప్రధానిగా ఎన్నుకున్నప్పుడు నేను కృషి వికాస్ కు (వ్యవసాయాభివృద్ధికి) దోహదం చేయాలనే విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాను. క్షేత్ర ఆరోగ్య కార్డులను వ్యవసాయదారులకు జారీ చేశాం. ఉత్పత్తి పెంచడం దీని ఉద్దేశం. రైతులకు నష్టపరిహారం కింద ఒక లక్ష కోట్ల రూపాయలు చెల్లించాం. రైతు బీమా, పెన్షన్లు ఏర్పాటు చేశాం. రైతులకు నేరుగా లబ్ధి కలిగించే కార్యక్రమాలు అమలు చేశాం. గ్రామీణ మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేశాం. కనీస గిట్టుబాటు ధరను పెంచాం.
‘‘మైక్రో ఇరిగేషన్ ఫండ్ ను ఏర్పాటు చేశాం. పంట రుణాలను రెట్టింపు చేశాం. వ్యవసాయ బడ్జెట్ ను గణనీయంగా పెంచాం. రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి నా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. ఈ దిశగానే వ్యవసాయ చట్టాలను తీసుకొని వచ్చాం. ఈ చట్టాలను రైతులు స్వాగతించారు. చాలా వర్గాలవారు అభినందించారు. కానీ కొంతమంది రైతులు చాలా మాసాలుగా నిరసనోద్యమం కొనసాగిస్తున్నారు. ఈ మూడు చట్టాలనూ అమలు చేయకుండా సస్పెన్షన్ లో ఉంచుతామని హామీ ఇచ్చాం. అవసరమైతే చట్టాలను మార్చుతామని చెప్పాం. ఈ చట్టాలు రైతుల మేలు కోసం తెచ్చినవేననీ, నష్టం కలిగించడానికి కాదనీ రైతులకు నచ్చజెప్పడానికి శతవిధాలా ప్రయత్నించాం. చట్టం వల్ల కలిగి ప్రయోజనాలను వారికి వివరించేందుకు ప్రయత్నించాం. ఆ పనిలో మేము విఫలమైనాం. వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఇది ఎవ్వరినీ నిందించే సమయం కాదు.
‘‘ఈ రోజు గురునానక్ జయంతి. గురు పూరబ్. మా తపస్సులో ఏదైనా లోపం ఉన్నదేమో. అందుకే మేము వ్యవసాయ చట్టాల గురించి రైతులకు నచ్చజెప్పలేకపోయాం. ఈ సందర్భంగా రైతులకు సంతోషం కలిగించేవార్త చెప్పాలని అనుకుంటున్నాను. వ్యవసాయ చట్టాలని వాపసు తీసుకోవాలని నిర్ణయించాం. ఈ నెలాఖరులో జరగనున్న పార్లమెంటు సమావేశంలో ఈ విషయం ప్రకటించి అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. మీరందరూ ఇళ్ళకు వెళ్ళండి. ఆందోళన విరమించండి. రైతులకూ, ముఖ్యంగా సన్నకారు రైతులకు మేలు చేయడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ మూడు వివాదాస్పద చట్టాలనూ రద్దు చేస్తున్నాం,’’ అని ప్రధాని నరేంద్రమోదీ టీవీ ప్రసంగంలో వివరించారు.