సింగరేణి ప్రవైటుపరం కాకుండా కాపాడుకోవాలి
తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా నేడు పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను, అమరుల బలిదానాలను అవహేళన చేసినట్లు ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మోడి పదే పదే తెలంగాణపట్ల వ్యతిరేకతను చాటుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పోలవరం ముంపు మండలాలను ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్‌లో కలపడం, అధికారంలోకి వచ్చి ఏడున్నర ఏండ్లు అయినా కాజీపేట కోచ్‌ప్యాక్టరీ, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన యూనివర్శిటీ, ఎ.పి. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా మోడి ప్రభుత్వం తెలంగాణతో ఆటలు ఆడుకుంటున్నదని మండిపడ్డారు. తాజాగా తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణిలోని కొత్త బొగ్గుగనులను ప్రవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తున్నదని దుయ్యబట్టారు. ఈ చర్యలతో ప్రధాని మోడికి, కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపుతున్నట్లు స్పష్టమవుతున్నదని అన్నారు. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి నాయకులు ప్రధాని వ్యాఖ్యలు, తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షతకు ఏమి చెబుతారని చాడ వెంకటరెడ్డి సూటిక ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మత రాజకీయాలతో విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్న బిజెపి కుయుక్తులను తెలంగాణ ప్రజలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి అంశంపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై వత్తిడి పెంచాలని అన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో తెలంగాణ నుండి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు సింగరేణి గనుల ప్రవేటీకణకు వ్యతిరేకంగా సభలో నిరసన గళాన్ని వినిపించాలని చాడ కోరారు.