ఎన్నికల సమయంలో పరస్పర నిందారోపణలు సహజం. ఎన్నికలలో గెలవడానికి ప్రత్యర్థులను బదనాం చేయడం, లేనిపోని ఆరోపణలు చేయడం, నిందాత్మకంగా మాట్లాడటం జరుగుతూనే ఉంటుంది. కానీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత సాధారణంగా ప్రజల తీర్పును అందరూ మన్నించాలి. అంతవరకూ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు సద్దుమణుగుతాయి. ఎవరి పరిధిలో వారు వ్యవహరిస్తారు. కానీ పశ్చిమబెంగాల్ లో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నది. ‘యాస్’ తుపాను వల్ల కలిగిన నష్టాన్ని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్రమోదీ బెంగాల్ ను సందర్శించినప్పుడు జరిగిన పరిణామాలను బీజేపీ ఒక రకంగానూ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందుకు పూర్తి విరుద్ధంగానూ చిత్రించడం విశేషం. పశ్చిమ బెంగాల్ లోని దక్షిన మిడ్నపూర్ జిల్లాలో కలైకుండలో ప్రధానమంత్రిని 30 నిమిషాలపాటు తనకోసం నిరీక్షించేలాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేశారని బీజేపీ నాయకుల ఆరోపణ. తీరా వచ్చిన తర్వాత కొన్ని కాగితాలు ప్రధానమంత్రికి అందజేసి ముఖ్యమంత్రి వెళ్ళిపోయారనీ, సమీక్షా సమావేశానికి ఉండలేదనీ, చాలా దురుసుగా వ్యవహరించారనీ, ప్రధానిని పరాభవం కలిగించడమే ఆమె ఉద్దేశమనీ బీజేపీ విమర్శ. మమత సంఘర్షణాత్మక వైఖరి ప్రదర్శించారని బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ బహిరంగంగానే విమర్శించారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యరద్శి బందోపాఖ్యాయని కేంద్రం ఏకపక్షంగా దిల్లీకి బదిలీ చేసింది.
Also read: ఏమున్నది గర్వకారణం?
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆమోదాన్ని కానీ సదరు అధికారి అంగీకారం కానీ తీసుకోకుండా ఉన్నతాధికారిని కోల్ కతా నుంచి దిల్లీకి బదిలీ చేయడం కేంద్రం పనిగట్టుకొని చేసిన ప్రతీకార చర్యగానే భావించవలసి వస్తుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో తుపాను నష్టాన్ని సమీక్షించేందుకు తాను ప్రధాని అనుమతి పొందిన తర్వాతనే వెళ్ళానని మమతా బెనర్జీ చెప్పారు. బెంగాల్ కు సహాయం చేసినట్లయితే ప్రధాని పాదాలను పట్టుకోడానికి సైతం తాను సిద్ధమని చెబుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోల్ కతాలో కొనసాగడానికి అనుమతించాలని మమతా బెనర్జీ కోరారు. ఇంతవరకూ ప్రధాన కార్యదర్శిని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం విధుల నుంచి విడుదల చేయలేదు. ప్రధాని విమానం దిగేందుకు ట్రాఫిక్ నియంత్రణ జరిగిన కారణంగానే తాను రావడం ఆలస్యమైందని ముఖ్యమంత్రి వివరించారు. బీజేపీ విడుదల చేసిన సమాచారం సత్యదూరమని ఆమె చెప్పారు. తనను చీటికీమాటికీ పరాభవించే ప్రయత్నం చేయవద్దని, ఎన్నికలలో పరాజయాన్ని జీర్ణించుకోవాలనీ ఆమె చెప్పారు.
Also read: ప్రశాంత్ కిశోర్ ప్రజాస్వామ్య ప్రమాణాలు ఉద్ధరించారా?
ప్రకృతి విలయం సంభవించి అపారనష్టం జరిగినప్పుడు భుజం కలిపి పని చేయవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇటువంటి కలహం చోటు చేసుకోవడం పశ్చిమబెంగాల్ ప్రజలకు మనస్తాపం కలిగిస్తోంది. సమీక్షా సమావేశానికి ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారినీ, గవర్నర్ ధంకర్ నీ ఆహ్వానించడం ద్వారా ముఖ్యమంత్రిని చిన్నబుచ్చాలని కేంద్రం అప్పటికే ఒక పథకం రచించిందని భావించాలి. బెంగాల్ వెళ్ళడానికి ముందు గుజరాత్ లోనూ, బెంగాల్ తర్వాత వెళ్ళిన ఒడిశాలోనూ ప్రధాని ముఖ్యమంత్రులతో తుపాను నష్టాన్ని సమీక్షించారు కానీ ప్రతిపక్ష నాయకులు లేరు. గవర్నర్లు అంతకంటే లేరు. అంటే, బెంగాల్ లో మాత్రం మమతా బెనర్జీతో సమీక్షించకుండా సమీక్షాకార్యక్రమంలో ఆమెతో రోజూ పేచీలు పెట్టుకునే గవర్నర్ నూ, అమె అనుచరుడిగా మొన్నటివరకూ పని చేసి ఎన్నికలు ముందు పార్టీ ఫిరాయించిన సువేందు అధికారిని ముందు కూర్చోబెట్టుకొని ప్రధాని ముఖ్యమంత్రితో చర్చలు జరపాలని అనుకోవడం విశేషం.
Also read: రఘురామకృష్ణంరాజు అరెస్టు, రాద్ధాంతం అవసరమా?
ఇటీవలి ఎన్నికలలో ఓటమిని బీజేపీ అధినాయకత్వం జీర్ణించుకోలేదని స్పష్టంగా కనిపిస్తున్నది. కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేసిన ఇద్దరిని సీబీఐ అరెస్టు చేయడం, మరి ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నాయకులను కూడా సీబీఐ అదుపులోకి తీసుకోవడం ప్రతీకారాత్మక కార్యాచరణకు సూచన. ఎప్పటి నుంచో ఉండిన నారద టేపుల కుంభకోణాన్ని అత్యవసరంగా ముందుకు తెచ్చి మంత్రులుగా పని చేయవలసినవారిని అరెస్టు చేయడం అసాధారణ విషయం. పెద్ద పదవులలో ఉన్నవారికి పెద్ద మనుసు ఉండాలని కోరుకోవడం సహజం. అప్పుడే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. లేకపోతే కునారిల్లుతుంది. కానీ ఎటు చూసినా పెద్ద మనసులు కనిపించడంలేదు. కురచ మనుషులే కనిపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రధాని, దేశీయాంగమంత్రి తమ వైఖరులను మార్చుకొని సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించాలి. దురహంకార ప్రదర్శన, అధికార దుర్వినియోగం ప్రజాస్వామ్యంలో చెడు సంప్రదాయాలను నెలకొల్పుతాయి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపైన ఒంటికాలిపై లేచి అనవసరంగా దాడి చేయడం, మమతా బెనర్జీకి సమస్యలు సృష్టించడం కేంద్ర ప్రభుత్వం ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది. ఇంత నగ్నంగా అధికార దుర్వినియోగానికి తెగించిన ప్రభుత్వం ఇది ఒక్కటే.
Also read: రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు