- తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
- పింగళి వెంకయ్య కుమార్తెను సన్మానించిన ఏపీ సీఎం జగన్
- హైదరాబాద్, వరంగల్ లో వేడుకలను ప్రారంభించిన కేసీఆర్, గవర్నర్ తమిళ సై
స్వాతంత్ర్య సంగ్రామంలో అమర వీరుల స్ఫూర్తిని కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నేతలరందరినీ ప్రధాని ప్రశంసించారు. అహ్మదాబాద్ లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలను మోదీ లాంఛనంగా ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా సబర్మతీ ఆశ్రమంనుంచి ప్రధాని నరేంద్ర మోదీ దండి యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. 75 వ స్వాతంత్ర్యవార్షికోత్సవ వేడుకలు 2023 ఆగస్టు 15 వరకు కొనసాగుతాయని మోదీ తెలిపారు.
241 మైళ్ల దూరం 25 రోజుల పాటు కొనసాగనున్న ఈ పాదయాత్ర ఏప్రిల్ 5న దండిలో ముగుస్తుంది. దేశ ప్రజలను ఐక్యం చేసిన మహాత్ముడి స్ఫూర్తితో ఈ పాదయాత్ర జరగనుంది. ఈ ప్రదర్శనల్లో దండి పాదయాత్ర, మహాత్మ గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ సహా ఉద్యమ నాయకుల త్యాగాలను ప్రతిబింబించే కార్యక్రమాలు ఉంటాయని అధికారులు తెలిపారు.
Also Read: గాంధీల ఒంటరి పోరాటం సఫలమా? విఫలమా?
పింగళి కుమార్తెను సన్మానించిన ఏపీ సీఎం జగన్:
జాతీయ పతాకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని ఏపీ సీఎం జగన్ కలిశారు. గుంటూరు జిల్లా మాచర్లలో నివాసముంటున్న ఆయన కుమార్తె ఘంటసాల సీతామహలక్ష్మిని సన్మానించారు. పింగళి వెంకయ్య జీవిత విశేషాలతో కూడిన చిత్ర ప్రదర్శనను సీఎం జగన్ తిలకించారు.
Also Read: వాలంటీర్లకు ఉగాది సత్కారాలు
తెలంగాణలో అమృత్ మహోత్సవ్:
స్వాతంత్ర్య భారత్ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రాష్ర్టంలో రెండు చోట్ల ప్రారంభించింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 75 వారాలపాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.
Also Read: హైదరాబాద్ లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు
వేడుకలకు 25 కోట్లు కేటాయింపు :
రాష్ర్టంలో 75 వారాల పాటు నిర్వహించనున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలకు 25 కోట్లు కేటాయించినట్లు కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న రమణాచారి ఈ కమిటీ అధ్యక్షులుగా నియమించుకుని ముందుకు కొనసాగుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థల్లో వకృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. రచయితలు, కవులతో కవి సమ్మేళనాలు నిర్వహించడంతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు.
వరంగల్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు:
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వరంగల్‌లో ప్రారంభించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ అనంతరం మొక్కలు నాటారు. అమర వీరులకు సంబంధించిన చిత్ర ప్రదవర్శనను తిలకించారు.
Also Read: ముంచుకొస్తున్న ఉపద్రవం