మొదటి కరోనా తరంగం మన ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి ప్రజానీకాన్ని బెంబేలెత్తించిన తరువాత మనకు జరిగిన అతి తక్కువ నష్టాన్ని చూసి మనలాగే మన దేశ ప్రధాని కూడా కరోనా ఫెయిలయ్యిందనే అనుకున్నారు. దాదాపుగా రిలాక్స్ అయిపోయారు. కాని, సైన్స్ పట్ల శ్రద్ధాసక్తులు, తమ పౌరులపట్ల బాధ్యత, పరిపాలన పట్ల అప్రమత్తత ఉన్న దేశ నాయకులంతా తమ ప్రజలను సాధారణ జీవితానికి చేరువ చేస్తూనే, సెకండ్ వేవ్ తమను కబళించకుండా తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. పరిపాలన గురించి కనీసపు అవగాహన లేని మన ప్రధాని ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలను నట్టేట ముంచారు. కరోనా రెండో రాకడ విలయతాండవం చేయడం మనం విస్తుపోతూ చూస్తున్నాం. శవాలు బూడిద కావడానికి క్యూలో దిక్కులేకుండా రోడ్డుమీద పడిగాపులు కాయడం ఈ దేశం బహుశా ఎప్పుడూ చూసివుండదు. బతుకు ఎలాంటిదైనా మరణించిన తరువాత నలుగురు మోసుకెళ్లి అంత్యక్రియలు జరిపి సాగనంపుతారు. ఈ దేశంలో మృత కళేబరాలకు కనీసం ఆ అదృష్టం కూడా మన దేశాధినేత దక్కనివ్వలేదు.
దోషులకు స్వేచ్ఛ, జర్నలిస్టుకు సంకెళ్ళు
ఉత్తరప్రదేశ్ లో హత్రాస్ గ్రామంలో ఒక బాలికను గుడిలో గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన దుశ్చర్యను ప్రపంచానికి తెలియచెప్పడానికి కేరళ నుంచి ఒక యువ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్ బయలుదేరాడు. నేరానికి మరెక్కడైనా శిక్షలు ఎలా ఉన్నా, భాజపా జమానాలో మాత్రం విచిత్రంగా ఉంటాయి. హంతకులు అచ్చేసిన ఆంబోతుల్లాగా స్వేచ్ఛగా తిరుగుతుంటే, ఆ వార్త రాసిన సిద్ధిక్ గత ఏడాదిన్నరగా మధుర జైల్లో మగ్గుతున్నాడు, దేశద్రోహం నేరం మీద. ఆయన భార్య రహస్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాసింది. తన భర్తను టాయిలెట్‌కు కూడా పోనివ్వకుండా కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి ఒక మామూలు ఆసుపత్రిలో మంచానికి కట్టి పడేసారని వాపోయింది. సిద్ధిక్ కు కరోనా సంక్రమించిందని తెలిపింది. సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయాల్సిందిగా ఆదేశించింది. కాని, గత వారం ఎవ్వరికీ తెలియనివ్వకుండా అతడిని తిరిగి మధుర జైల్లో పడేశారు. ఘనత వహించిన మోడీ పాలనను వర్ణించడానికి ఇలాంటి ఉదాహరణలు లెక్కలేనన్ని.
అరుంధతీరాయ్ అభ్యర్థన
ఆలోచనపరులు అందరిలో ఉండే ఆగ్రహావేశాలు ఎందుకీ కొరగానివయ్యాయి. ఈ అసంతృప్తి తేనెతుట్టెను అరుంధతీ రాయ్ కదిపారు. మోడీ దిగిపోవయ్యా, నీకు పాలించడం చేతకాదు గానీ, దయచేసి రాజీనామా చేసెయ్… అంటూ సంక్షిప్తమైన లేఖను రాశారు. ఆది వైరల్ అయింది. మోడీ దిగిపో హ్యాష్ ట్యాగ్ దేశందాటి ప్రపంచమంతా తిరుగుతోంది. మన దేశంలో అయితే కొన్ని గంటలపాటు ట్విట్టర్లో ఈ ప్రచారాన్ని కేంద్రం ఆపించింది. కానీ, వెంటనే ట్విట్టర్ తేరుకుంది. మోడీ అసమర్ధతను ఇంగ్లండుకు చెందిన ‘ది సండే టైమ్స్’ పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. రోజురోజుకు దేశంలో పెరిగిపోతున్న చావులను అరికట్టలేక చేతులెత్తేసిన మోడీ నిస్సహాయతను ఈ కథనం అన్ని దేశాలకు చాటిచెప్పింది. దానిని తిరిగి ప్రచురించిన ‘ది ఆస్ట్రేలియన్’ పత్రికపై మాత్రం మన కేంద్రం కారాలు మిరియాలు నూరింది. ఆ దేశ ప్రధానికి ఒక లేఖ రాసింది. ఇలాంటి నిరాధార కథనాలు రాస్తే మీ పరువు పోతుందని హెచ్చరించింది. ఎప్పుడూ ప్రభుత్వానికి భజంత్రీలు కొట్టే ‘ఇండియాటుడే’ వారపత్రిక “విఫల రాజ్యం ” ( ఫెయిల్డ్ స్టేట్) పేరిట కవర్‌స్టోరీ ప్రచురించింది. ‘అవుట్ లుక్’ వార పత్రిక ప్రభుత్వం “తప్పిపోయింది” (మిస్సింగ్) అంటూ కవర్ కథనం వెలువరించింది.
బీజేపీ అవాస్తవిక ప్రచారం
కరోనా కట్టడి మీద బిజెపీ ఐటీ స్లీపర్ సెల్స్ దేశంలోని అన్ని భాషల్లో కొన్ని వందల కథనాలు తయారుచేసి ఈ దేశ ప్రజలకు వడ్డిస్తున్నారు. అవి నేరుగా మన మొబైల్ ఫోన్లలోకి చేరిపోతున్నాయి. మోడీ కరోనాను ఆపడానికి సూపర్ మేన్ లా పనిచేస్తున్నాడని అవి నూరిపోస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయి. ఆక్సిజన్ అందక దేశవ్యాప్తంగా రోజుకు కొన్ని వేలమంది గిలాగిలా కొట్టుకుని ప్రాణాలు కోల్పోతుంటే ప్రజలు తమ కళ్లతో తామే ఇదంతా చూస్తున్నారు. స్మశానాలలో స్థలం దొరక్క అనేక రాష్ట్రాలలో పార్కులలో, ఇతర స్థలాలలో శవదహనాలు కానిచ్చేస్తున్నారు. తమకు ఒక విపత్తు ఎదురైనప్పుడు తమ పాలకుడు తమకు అండగా నిలబడతారని భారతీయుల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మోడీ నిర్దయగా కాలరాయడం ద్వారా తన చుట్టూ హిందూత్వ మీడియా ఆల్లిన సూపర్ హీరో ముసుగు చిరిగిపోతోంది. దానికి నిదర్శనమే వెల్లువెత్తుతున్న ఈ హ్యాష్ ట్యాగ్ ప్రభంజనం. మొన్న ఆయిదు రాష్ట్రాలలో వెలువడిన ఎన్నికల ఫలితాలు కూడా దానినే చాటి చెప్తున్నాయి.
ట్రంప్ ని ఆహ్వానించడం తప్పు
కరోనా వార్తలు తెలిసిన తరువాత కూడా అత్యంత నిర్లక్ష్యంతో ట్రంపుని దేశానికి ఆహ్వానించి లక్షలాది మందిని గుమికూడేట్టు చేయడం మోడీ బాధ్యతారాహిత్యానికి మొదటి అడుగు. దానిని కప్పిపుచ్చుకోవడానికి తెలియక చేరిన కొన్ని వందల మంది తబ్లీగీ జమాత్ భక్తుల నెపంతో నిందను ఈ దేశపు ముస్లిముల మీదకు నెట్టారు. ఇక ఇంత పెద్ద దేశంలో నాలుగు గంటల వ్యవధినిచ్చి లాక్ డవున్ ప్రకటించి, వలస భారతాన్ని వట్టి కాళ్లమీద వందల మైళ్లు నడిపించి కొన్ని వేలమంది ఆకలి చావులకు కారణమవడం మోడీ నిర్దాక్షిణ్యపు రెండో తప్పిదం. శాస్త్రవేత్తలు సెకండ్ వేవ్ గురించి హెచ్చరించినా పెడచెవిన పెట్టి ఎన్నికలకు పోవడాన్ని ఏ పదంతో వర్ణించగలం! ఆంధ్రప్రదేశ్ కంటే, లేదా తెలంగాణ కంటే భౌగోళికంగా చిన్న రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ లో ఎనిమిది దశలలో ఎన్నికలు నిర్వహించడం మోడీ హంతక స్వభావానికి నిదర్శనం. పశ్చిమ బెంగాల్ లో భాజపా పాలన కోసం తాను స్వయంగా వేషం మార్చడమే కాకుండా, మాస్క్ వేసుకోకుండా కొన్ని లక్షల మంది మాస్క్ లేని ప్రజా సమూహాలను పోగు చెయ్యడం ఎవరి బాగు కోసం! మద్రాసు హైకోర్టు హత్య అభియోగాన్ని ఎన్నికల కమిషన్ పై మోపాలని భావించినట్టు చెప్పింది. కాని అది ఈ దేశ పాలకులకే వర్తిస్తుంది అని ప్రజలు భావిస్తున్నారు.
కుంభమేళా, ఎన్నికలవేళ
కరోనా రెండో పర్యాయపు ఉధృతి గురించి తెలిసిన తరువాత కూడా, కేవలం ఓట్ల కక్కుర్తి కోసం, ఏడాది తరువాత జరగాల్సిన కుంభమేళాను ముందుకు తెచ్చి కొన్ని లక్షల మందిని ప్రభావిత కరోనా క్యారియర్స్ గా మార్చిన ఘనత నిస్సందేహంగా మోడీదే. తన రాజకీయ జీవితమంతా ప్రజలలో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే మోడీ మొత్తం ప్రజా జీవితంలో ప్రశ్నను ఎదుర్కోకపోవడం ఆయన వ్యక్తిత్వాన్ని పట్టిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రజలు దీనిని అర్థం చేసుకుంటున్నారు. దీనికితోడు బలహీన ప్రతిపక్షం మోడీ అరాచక పాలనకు ఊతమిస్తోంది. ప్రజాధనం సమకూర్చి భారీ ఎత్తున ఫండింగ్ ఇచ్చి తయారు చేయించిన వ్యాక్సిన్ ఒకవైపు, విదేశాల నుంచి వెల్లువలా వస్తున్న సాయంలో భాగంగా సమకూరిన వ్యాక్సిన్ మరోవైపు, కేంద్ర ప్రభుత్వమే డబ్బు వెచ్చించి కొనుగోలు చేసిన వ్యాక్సిన్ ఇంకోవైపు… అయినా దాని పంపిణీలో మోదీ ప్రణాళికలేమి ఆయన క్రూరత్వాన్ని చాటింది. ఒకటే పన్ను, ఒకటే మతం, ఒకటే ఎన్నికలు అని గప్పాలు కొట్టే పాలకుడు ఒకే వ్యాక్సిన్ ఒక్కొక్కరికీ ఒక్కోలా ఇవ్వడం ఏం సంకేతాన్నిచ్చింది. ఆస్తవ్యస్తమైన వ్యాక్సిన్ పంపిణీ, పారదర్శకత లేని వ్యాక్సిన్ నిల్వల సమాచారం, వృధా అవుతున్న డోసులు మనకేం చెప్తున్నట్టు?
Also read: మేలుకో జగన్!
కరోనా విపత్తు సమసిపోయేవరకూ రెండు చేతులూ పైకెత్తి నిస్సహాయంగా చూస్తూ ఈ దేశ పౌరుడు మిగిలిపోవడం బతికున్న భారతీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. మనల్ని ఈ నిస్సహాయ స్థితిలోకి నెట్టినవారిని మాత్రం వారు ఎన్నటికీ క్షమించరు.
(మోదీ ప్రధానిగా ఏడేళ్లు పూర్తి చేసుకుని ఎనిమిదో వత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా…)
(ఈ వ్యాసంలో వెల్లడించిన అభిప్రాయాలు రచయితవి)
(రచయిత మొబైల్ : 9989265444)