ప్రధాని నరేంద్రమోదీ 71 వ జన్మదినోత్సవం శుక్రవారం జరుపుకుంటున్నారు. ఈ రోజు 20 రోజుల పాటు ‘సేవా, సమర్పణ్ అభియాన్’ను ప్రారంభిస్తున్నారు. మోదీ ప్రజారంగంలో అడుగిడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తోంది. ‘‘మనం టీకా సేవ చేద్దాం. ఇంతవరకూ టీకా వేయించుకోనివారికి టీకా వేయించి ప్రధాని మోదీకి బహుమతిగా ఇద్దాం,’’ అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయా సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించవలసిందిగా బీజేపీ నేతలకు మాండవీయా పిలుపునిచ్చారు.
నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 7 అక్టోబర్ 2001నాడు ప్రమాణస్వీకారం చేశారు. ఆ తేదీని కూడా పండుగలాగా జరుపుకునే ఉద్దేశంతో 17 సెప్టెంబర్ 2021 నుంచి అక్టోబర్ 7 వరకూ ఇరవై రోజులపాటు ప్రజల సమక్షంలోకి పెద్ద ఎత్తున వెళ్ళాలనీ, ప్రజలతో సంపర్కం పెంచుకోవాలనీ, వారికి సేవ చేయాలనీ, వారికి తమను తాము సమర్పించుకోవాలనిీ బీజేపీ నాయకత్వం నిర్ణయించుకుంది. ఈ అభియాన్ (ఉద్యమం)లో భాగంగా పార్టీ కార్యకర్తలు పారిశుద్ధ్య కార్యక్రమాలలోనూ, రక్తదానం కార్యక్రమాలలోనూ విరివిగా పాల్గొంటారు. ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అయిదు కోట్ల పోస్టుకార్డులు పంపే ఉద్యమానికి సైతం శ్రీకారం చుట్టారు. ప్రధాని జన్మదినాన్ని పెద్దఎత్తున ఉత్సవంగా జరుపుకోవాలన్నది పాలక పక్షం నిర్ణయం. ప్రజలకు ఉచితంగా ఆహారధాన్యాలు ఇస్తున్నందుకూ, ఉచితంగా టీకాలు వేయిస్తున్నందుకూ మోదీకి ధన్యవాదాలు చెబుతూ హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. గంగానదిని 71 ప్రదేశాలలో పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ లో అమలు చేస్తారు. ఆ రాష్ట్రంలో కొన్ని మాసాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయన్నది విదితమే.
మోదీ కేంద్రంగా సంబరాలు జరుపుకోవడానికీ, దేశవ్యాప్తంగా మేధావుల చేత వ్యాసాలు రాయించడానికీ, ప్రసంగాలు చేయించడానికీ పార్టీ సమాయత్తం అవుతోంది.
రాష్ట్రపతి రామనాథ్ కోవిద్, కేంద్ర మంత్రులూ, బీజేపీ నాయకులూ మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్వీటర్ వినియోగదారులు కూడా పెద్ద సంఖ్యలో ప్రధానికి అభినందనలు తెలిపారు.
నరేంద్రమోదీ గుజరాత్ లో పుట్టిపెరిగారు. పిన్న వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చేరారు. ఆ తర్వాత బీజేపీలో ప్రవేశించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 లో ప్రధాన మంత్రిగా గురుతర బాధ్యతలు స్వీకరించేవరకూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తన పార్టీ బీజేపీని వరుసగా మూడు విడతల జైత్రయాత్రలో నడిపించారు. ప్రధాని పదవిలో ఉంటూ 2019లో లోక్ సభ ఎన్నికలలో 2014లో కంటే బీజేపీ కి ఎక్కువ స్థానాలు సంపాదించారు.
పూరీ సముద్రతీరంలో ఇసుకతో మోదీ బొమ్మ చిత్రించి ప్రఖ్యాత చిత్రకారుడు సుదర్శన్ పట్నాయక్ ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు వినూత్న రీతిలో తెలిపారు. ట్వీటర్ లో తను సృష్టించిన చిత్రాన్ని ఇతరులతో పట్నాయక్ పంచుకున్నారు. దేశ ప్రజలకు భవిష్యత్తు గురించి ఆలోచించాలంటూ మోదీ ప్రబోధించారని పుట్టినరోజు సందర్భంగా అభినందిస్తూ దేశీయాంగమంత్రి అమిత్ షా సందేశం ఇచ్చారు. తన హయాంలో ఎన్నో ప్రగతి అధ్యాయాలను మోదీ రచించారంటూ రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు.
Happy Birthday PM Modi. Love from Bangladesh.