- ఒలింపిక్స్ వీరులకు అభినందనలు
- గతిశక్తి యోజన ప్రకటన
- ఆగస్టు 14ను విభజన భయానక స్మారక దినంగా పరిగణించాలని పిలుపు
- నూటికి నూరు పాళ్ళూ ప్రాథమిక సౌకర్యాల కల్పనకు దీక్ష
దేశంలో ‘ప్రధానమంత్రి గతిశక్తి యోజన’ను ప్రవేశపెడుతున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ 75వ స్వాంతంత్ర్య దినోత్సవ సందేశంలో ఆదివారంనాడు ఎర్రకోట దగ్గర ప్రకటించారు. ప్రాథమిక అవసరాల కల్పన (ఇన్ ఫ్రాస్ట్రక్చర్)కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామనీ, ఉత్పత్తిరంగాన్ని అభివృద్ధి చేస్తామనీ, ఉద్యోగకల్పనకు కృషి చేస్తామనీ ఎర్రకోట ప్రసంగంలో ఉద్ఘాటించారు. స్థానిక ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసిన వస్తువులను ఎగుమతులు చేసే స్థాయికి చేరుకునే విధంగా గతిశక్తి మిషన్ తోడ్పడుతుందని చెప్పారు.
డెబ్బయ్ అయిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఒకే రోజుకు పరిమితం చేయరాదనీ, దీనిని రెండేళ్ళపాటు సుదీర్ఘంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాలనీ మోదీ అన్నారు. కొత్త లక్ష్యాలు పెట్టుకోవాలనీ, వాటి సాధనకోసం కొత్త మార్గాలు నిర్మించుకోవాలనీ చెప్పారు. ప్రజల జీవితాలలో ప్రభుత్వ ప్రమేయం ఉండరాదనీ, దేశ ప్రజల అందుబాటులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉండాలనీ, ప్రపంచంలో మరే దేశ ప్రజలకూ తీసిపోకుండా అత్యున్నత స్థాయి ప్రజలకు దీటుగా ఉండాలనీ ఆకాంక్షించారు.
ప్రజల జీవితాలలో ప్రభుత్వ ప్రమేయం తగ్గించాలనే విషయాన్ని ప్రధాని చెప్పడం ఇదే మొదటిసారి కాదు. నిరుటి స్వాతంత్ర్యోద్యమ సందేశంలో కూడా ఇదే మాట చెప్పారు. గత ఏడాదిగా ప్రభుత్వ ప్రమేయం పెరిగిందే కానీ తగ్గలేదు. ‘‘స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయిన తర్వాత కూడా సాధారణ పౌరుల జీవితాలలో ప్రభుత్వ ప్రమేయాన్నితగ్గించలేమా అని మా అధికారులను అడిగాను,’’ అని నిరుడు అన్నారు. ‘‘ప్రభుత్వం నుంచి ప్రజలపైన ఎటువంటి ఒత్తిడీ ఉండకూడదు. అదే విధంగా ఏదైనా సంక్షోభాన్ని ప్రజలు ఎదుర్కొనే పక్షంలో ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఉండకూడదు,’’అంటూ వ్యాఖ్యానించారు. సంకల్పం చెప్పుకోగానే ప్రయోజనం లేదనీ, సంకల్పం సాకారం చేయడానికి కృషి, ప్రయత్నం ఉండాలనీ ప్రధాని గుర్తు చేశారు.
‘‘నూటికి నూరు పాళ్ళూ దేశవ్యాప్తంగా అన్ని రకాల ప్రాథమిక వసతులూ కల్పించే దిశగా అడుగులు వేయాలి. వందశాతం గ్రామాలకు రోడ్లు ఉండాలి. ఆయుష్మాన్ భారత్ కార్డులు నూటికి నూరు మందికీ ఉండాలి,’’ అని ఉద్ఘోషించారు.
ఇక మీదట ఆగస్టు 14ను విభజన భయానకదురంతాల స్మారక దినంగా పరిగణించాలని ప్రధాని అన్నారు. దేశ విభజన సమయంలో భారతీయులు అనుభవించిన బాధనూ, వేదననూ గౌరవించే విధంగా ఈ స్మారకదినాన్ని జరుపుకోవాలని చెప్పారు. పేదలకు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తామనీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఇండియా కేంద్రం కావాలనీ, అమృత్ ఉత్సవంలో భాగంగా దేశంలో 75 వందే భారత్ రైళ్ళను 75 వారాలలో ప్రవేశపెడతామనీ అన్నారు. తొలి ప్రధాని నెహ్రూజీ, దేశ సమగ్రతకు కృషి చేసిన సర్దార్ పటేల్, రాజ్యాంగం ప్రసాదించి దేశప్రజలకు దిశానిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ లకు వందనాలు సమర్పించారు. 32మంది ఒలింపిక్ క్రీడాకారులను ఈ సందర్భంగా ఎర్రకోటకు ఆహ్వానించారు. పతకాలు గెలిచిన అథ్లెట్లు కూడా వీరిలో ఉన్నారు. వారికి అభినందనలు తెలిపారు. ‘వారి ఘనకార్యాలనూ, విజయాలనూ అభినందిస్తూ కరతాళ ధ్వనులు చేయాలని దేశప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వారు మన హృదయాలను దోచుకోవడమే కాదు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చారు,’’ అని అన్నారు.
కోవిద్ మహమ్మారిపై సాగుతున్న యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, 54 కోట్ల మందికి టీకాలు వేయించామనీ, ఎంత కృషి చేసినా కొంతమంది ప్రాణాలు కాపాడలేకపోయామనీ, చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారనీ అన్నారు.
జమ్మూ-కశ్మీర్ లో ప్రగతి కనిపిస్తోందనీ, భవిష్యత్తులో ఈశాన్యభారతం, హిమాలయ ప్రాంతం, కోస్తాతీరం ప్రగతిపథంలో ముందుంటాయనీ అన్నారు. భారత ప్రగతి యాత్రలో కీలక ఘట్టంలో ప్రవేశించామనీ, ఇది భారతదేశానికి అనువైన కాలమనీ, ఈ అమృతోత్సవ సమయంలో ప్రగతి వేగాన్నీ, విస్తృతినీ పెంచాలనీ ఉద్బోధించారు. ప్రభుత్వ పథకాలు ఫలితాలు చూపుతున్నాయనీ, పథకాలు వేగంగా, సమర్థంగా అమలు జరుగుతున్నాయనీ చెప్పుకొచ్చారు. ఆత్మనిర్భరతను పెంచుకోవాలని అన్నారు.