“సజీవుల్లో రాయ్ అంత విస్తృతంగా ఆసియా విప్లవంలో పాల్గొన్న వాడెవ్వడూ లేడు. 20 సంవత్సరాల క్రితం రాయ్ ని గురించి చెప్పా లంటే, మూర్తీభవించిన ఆసియా విప్లవంగా చెప్పవచ్చు.”
– గుయ్ వింట్
“ఆ రోజుల్లో రాయ్ స్థానాన్ని ఆక్రమించగల వారెవ్వరూ లేరు….ఆయన మహాశక్తి సంపన్నుడు. విద్వాంసుడు. విస్తృతంగా రాశాడు. భారత కమ్యూనిస్టు నాయకుల్లో ఈ ప్రధాన లక్షణాలు లేకపోవడం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.”
– లిబరేషన్ (నక్సల్బరీ గ్రూపు మాసపత్రిక)
“1920 ప్రారంభంలో ఇండియాలో కానీ తాష్కెంట్ లో కానీ భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడలేదు. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు అనే అర్థంలో, మెక్సికో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా రాయ్ ఒక్కడే కమ్యూనిస్టు. అప్పటికే కమ్యూనిజాన్ని గురించి ఆయన లోతుగా అవగాహన చేసుకున్నాడు.”
– జి.ఎం. అధికారి
“ఆ విజ్ఞానం, అవగాహన, ఆ ధైర్యం స్థైర్యం, అంత సహనం, తులనాత్మకను ఎక్కడో కల్పనా సాహిత్యంలో తప్ప చూసే అదృష్టం మాకు లేదు. అద్భుతమైన నీ అనన్యతలో రహస్య మేమిటా అని నేను విస్తుపోతూ ఉంటాను. అవకాశవాదిగా వుండటమంటే ఏమిటో నీవింకా నేర్చుకోలేదు. నీవు ఆశావాదివి…”
– సురేంద్రనాథ్ దత్తా (రాయ్ కి రాసిన లేఖలో)
“వీరోచిత కార్యాలు ప్రదర్శిస్తూ విదేశాలకు తప్పించుకుపోయి భారత స్వాతంత్ర్యం కోసం విదేశాలలో పోరాడుతున్న విప్లవకారుల్లో నూరుగాథల కథానాయకుడైన ఎం.ఎన్. రాయ్ లాగా మా విస్మయాన్ని చూరగొన్నవాడు మరొకడు లేడు. “
– శిశిరకుమార ముఖర్జీ
“ఆయన జీవించింది ఒక్క జీవితమేనా? అనేక జీవితాలా? ఈ క్షణంలో ఆర్కిటిక్ వలయం కింద తిరిగి దానికెదురుగా ఎక్కడో ధృవశీతలంలో మరో క్షణంలో అత్యుష్ణ భూమద్య రేఖామండలం దగ్గర ఇలా కన్పించి అలా మాయమయ్యే తిమింగలం లాగా రాయ్ తన విప్లవ జ్వాలల్ని బెంగాల్ లో, మెక్సికోలో, రష్యాలో, చైనాలో వెలిగిం చుకొంటూ పోయాడు. ఆయన అద్భుత చేష్టలింకా పూర్తి కానేలేదు.”
– ఆచార్య శ్రీనివాస్ అయ్యంగార్
“విజ్ఞానాన్నంతా తన సొత్తు చేసుకున్నవాడు ఎం.ఎన్. రాయ్. నిరంతర విప్లవ కార్యాల్లో నిమగ్నమై ఉండి కూడా అన్ని శాఖల్లో అన్ని భాషల్లో ఎప్పుడు ఎలా అంత ప్రావీణ్యత సంపాదించగలిగాడో – ఆ విషయం ఎన్నటికీ ఆశ్చర్యంగానే మిగిలిపోతుంది. ఆయన మహా పండితుడు, గొప్ప భాషావేత్త, జన్మతః విప్లవకారుడు, సునిశిత సిద్ధాంత కర్త, బ్రహ్మాండమైన మేధావి, అచంచల హేతువా ది. స్థితప్రజ్ఞుడు. విప్లవ చైతన్యం కల రాజకీయ నైతిక వైరుధ్యాలతో సంక్షుభితమైన యుగంలో విశ్రాంతి ఎరగకుండా కృషి చేసిన ఉత్తమ పురుషుల్లో రాయ్ ఒకడు.”
– ఆచార్య నిర్మలచంద్ర భట్టాచార్య
“1920 లో మేము రష్యా చేరేటప్పటికే తాష్కెంటులో రాయ్ సర్వాధికారి.”
– షౌకత్ ఉస్మానీ
“అసంతృప్తులైన భారత మేధావుల్లో కొందరికి సోషలిస్ట్ సిద్ధాంతాన్ని కార్యాచరణను పరిచయం చేసి వారిని పూర్తిగా మార్క్సిజం లోకి మార్చడంలో ఎం.ఎన్.రాయ్ కృత కృత్యుడైనాడు. వ్యవస్థాపరంగా కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ కి, అప్పుడే ఆవిర్భవిస్తున్న కమ్యూనిజానికి ఎం.ఎన్.రాయ్ మొదటి సంధానకర్త.”
– డి.సి.గ్రోవర్
“రాయ్ని గురించి వాడని రాజకీయ సమాసం లేదు. ఉద్దండపిండం, కొరకరాని కొయ్య – అని ఆయన్ని ఏమేమో అన్నారు. ఆయన అందరి జుట్టుల్లో గుండానూ వెళ్ళాడు. సింహం జూలు మొదలు బ్రాహ్మడి పిలక వరకు ఆయన పట్టించుకోని విషయమూ, విమర్శించని విషయమూ లేదు. దేనికీ జంకి కానీ ఎవరనీ లెక్కచేసి కానీ ఎరగడు. ఆయన నిజాయితీ పునాదులు చాలా బలమైనవి. వజ్రాలయినా దొరుకుతాయి కానీ నిజాయితీ బలంగల భారత రాజకీయవేత్తలు దొరకడం కష్టం.”
– బెవర్నీ నికోలస్
“పారిశ్రామికీకరణ పొందిన ప్రాంతాలకు కాకుండా ప్రపంచంలో అభివృద్ధి చెందని దేశాలకు కమ్యూనిస్టు విధానాన్ని అభివృద్ధి పరచడంలో రాయ్ లెనిన్, మావోల శ్రేణిలో ఉంటాడనడం అతిశయోక్తి కాదు….”
– ఫిలిప్ శ్ఫ్రాట్
“బెంగాల్ విప్లవకారుల్లో ఎవరి మీదనైనా నాకు నిజమైన గౌరవం వున్నదంటే అది ఒక్క యం.యన్.రాయ్ మీద మాత్రమే.”
– లాలాలజపతి రాయ్
** ** ** **
మహా విప్లవకారుడైన మానవేంధ్రనాధ రాయ్ వర్ధంతి ఈరోజు. ఆయన గురించి పరిచయం చేయడమంటే ఆకాశపుటంచుల్ని, సముద్రపు లోతుల్ని అక్షరాల్లో ఇమడ్చాలని ప్రయత్నించడమే!
రాయ్ జైల్లో ఉన్నప్పుడు ఐన్ స్టీన్ అంతటి శాస్త్రజ్ఞుడే స్వయంగా రాయ్ ని విడుదల చేయాలంటూ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశాడని ఊహించగలమా? సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సాంస్కృతిక శాఖ UNESCO అధినేత జూలియన్ హాక్సీ ప్రపంచ మానవవాద సంఘం ఏర్పాటుకు గాను రాయ్ ని ఆహ్వానించాడని విని విస్తుపోకుండా ఉండగలమా?.
“ప్రమాద భూయిష్టమైన సాహసోపేత జీవితాన్ని గడపడంలో రాయ్ తో పోల్చదగ్గవారు ఇటీవలి కాలపు భారతీయుల్లో లేరు. నేతాజీ కూడా ఆయనకు తీసికట్టే…” అన్న లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, రాయ్ మరణిం చినప్పుడు, “రాయ్ మరణంతో భారతదేశమే కాదు, ఆసియాయే ఒక మహానాయకుడ్ని కోల్పోయింది…” అంటారు.
ప్రపంచంలో మొట్టమొదటి నవీన మానవవాద సిద్ధాంతకర్త గా ఆయన స్థానం అజరామరం. అందుకే నెహ్రూ నుండి లెనిన్ వరకూ, స్టాలిన్ నుండి బోస్ దాకా ఆయన జీవితం పట్ల విస్మయం చెందని నేత ఒక్కరు కూడా లేరు.
“రాయ్ వీరాధివీరులకు వీరుడు. విప్లవ కారులకు నిరంతర విప్లవమూర్తి. జిజ్ఞా సువులకు జిజ్ఞాసా తపస్వి. తత్త్వవేత్తలకు మానవవాద స్రష్ట. అన్నింటినీ మించి సంపూర్ణ మానవత్వం వైపు చాలా దూరం పయనించిన మనిషి – కాదు మనీషి – మహా మనీషి యం.యన్.రాయ్ ” అంటారు తెలుగులో రాయ్ ని గురించి విస్తృతంగా పరిచయం చేసి వందకు పైగా గ్రంథాలు రాసిన మిత్రులు , వందేళ్ళ రాయిస్టు, రావిపూడి వెంకటాద్రి గారు.రాయ్ శతజయంతి ఉత్సవాలు తెనాలిలో ఘనంగా నిర్వహించిన సందర్భంలో ఆయన గురించి చిన్న పొత్తం ఎం.వి. రమణయ్య ప్రచురించారు. అందులో రాయ్ గురించి జి.కృష్ణ అనే జర్నలిస్టు రాసిన దాన్ని ఉదహరిస్తూ,
“రాయ్ గారిలో పెద్ద లోపం ఆయన క్షుణ్ణంగా చదువుకోవడం. చదివిన దానిని అనుభవ పూర్వకంగా ఆలోచించుకోవడం. విమర్శగా అర్థం చేసుకుని దేశకాల పరిస్థితులకు అన్వ యించుకొనడం. అందువల్ల పలువురు రాజకీయ వాదులకు ఆయనంటే ఇష్టం లేదని తేల్చుకున్నాను.” అంటూ,
“నినాదాల నల్లమందు ఎక్కించే ఈరోజుల్లో ప్రజల్ని వివేకవంతుల్ని చేసే కృషి జరగాలన్న రాయ్ వాదాన్ని ఎంతమంది అంగీకరిం చగలరు? ..” అని ప్రచురించారు. నేటికీ నిజమే అనిపిస్తుంది.
మొట్టమొదటి భారత రాజ్యాంగ చిత్తుప్రతిని రాసి ప్రకటించిన రాయ్, అందులో మొదటి ఆర్టికల్ లోనే…
“The people have the inalienable right to alter and modify the political organization of Society.”
“The right of Revolt against tyranny and oppression is sacred”
అంటూ నియంతృయ్వం పై ప్రజలకు తిరుగుబాటు చేసే హక్కును రాజ్యాంగంలో కల్పించాలంటాడు. ప్రపంచంలో ఏ రాజ్యాంగ నిర్మాతా కనీసం ఊహించని సూత్రమిది.
“ఇంతగా వీరపూజకు అంకితమైన ఈ దేశంలో జనం దృష్టిలో రాయ్ ఆరాధ్యుడు కాకపోవడం విడ్డూరం.” అంటాడు ఫిలిప్ శ్ర్పాట్. నిజమే, ఆయన జీవితం గురించి చేసిన కృషి గురించి ఈ దేశ ప్రజలకు తెల్సింది చాలా తక్కువ.
ఆయన పుట్టిన బెంగాల్ మొదలుకొని నడయాడిన దేశంలోని ప్రతీ ప్రాంతంలో ఈ రోజు ఆయన పేరు బొత్తిగా అపరిచితం. ఎంతో గొప్ప ఆశావాద దృక్పథంతో డెహ్రాడూ న్ లో రాయ్ స్థాపించిన “ఇండియన్ రినైజాన్స్ ఇన్స్టిట్యూట్” (భారత సాంస్కృతిక పునరుజ్జీవన కేంద్రం) కూడా పూర్తిగా నిష్ర్కియాపరంగా ఉంది. ఆయన సమాధిని కూడా నాశనం చేసుకున్న ఘనత మనది.
ప్రపంచంలోనే మొట్టమొదటి రష్యనేతర కమ్యూనిస్టు పార్టీ స్థాపకుడిగా, భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపకుడిగా, కాంగ్రెస్ చరిత్రలో మొదటిసారి Radicalismని చేర్చి లీగ్ ఆఫ్ రాడికల్ కాంగ్రెస్ మెన్ పెట్టినవాడిగా , రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడి గా, రాడికల్ హ్యూమనిస్ట్ గా ఆయన నిర్వహించిన పాత్రలు అనితర సాధ్యం.
ఏదేమైనా, నవ్య మానవవాద దిక్సూచిగా రాయ్ జీవితం, కృషి సత్యాన్వేషకులు అందరికీ ఒక నిత్య పాఠ్యాంశం. జె.పి. అన్నట్లు, “అంతా నాటకంలాగా విజయ పరంపరలతో స్వార్ధరహితమైన అంకిత భావంతో గడచిన ఆయన జీవితం భవిష్యత్ తరతరాలవారికి ఉత్తేజం ఇస్తూనే ఉంటుంది. రాజకీయ, సామాజిక ఆలోచనా రంగాల్లో ఆయన చేసిన మార్గదర్శక కృషి జాతీయ- అంతర్జాతీయ అధికార రాజకీయ రంగంలో కమ్ముకున్న అంధకారం గుండా దూసుకువచ్చే కాంతిపుంజాలను మనకు ప్రసరింప జేస్తుంది.”
(ఆర్.వి. రచన మహామనీషి ఎం.ఎన్.రాయ్ గ్రంథం నుండి)
(జనవరి 25, రాయ్ వర్ధంతి సందర్భంగా మహావ్యక్తిని స్మరించుకుంటూ….)