• విద్యావేత్త, రామానందతీర్థ నిర్వాహకురాలు
• పీవీ జయంత్యుత్సవ కమిటీ సభ్యురాలు
హైదరాబాద్ : మహబూబ్ నగర్–రంగారెడ్డి –హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి అభ్యర్థిగా సురభి వాణీదేవిని నిలబెట్టాలని టీఆర్ఎస్ పార్టీ తర్జనభర్జన తర్వాత నిర్ణయించింది. వాణీదేవి మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు కనిష్ఠ కుమార్తె. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాణీదేవి అభ్యర్థిత్వాన్ని ఆదివారంనాడు ఖరారు చేశారు. వాణిదేవి సోమవారంనాడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల గడువు మంగళవారంతో ముగుస్తుంది.
01 ఏప్రిల్ 1954లో జన్మించిన వాణీదేవి జేఎన్ టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి డిప్లొమా, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ చదివారు. తండ్రి పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా ఆయనతో కలిసి నలభై దేశాలకు పైగా సందర్శించారు. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు అధ్యక్షతన పని చేస్తున్నపీవీ శతజయంత్యుత్సవ కమిటీలో వాణిదేవి, ఆమె సోదరుడు పీవీ ప్రభాకరరావు సభ్యులు. ‘నేను ఏ నాడూ పదవులు ఆశించలేదు. కేసీఆర్ కూడా నాకు ఎలాంటి హీమీ ఇవ్వలేదు. నన్ను ఎంపిక చేసినట్టు ఆదివారంనాడు తెలియజేయడంతో విస్మయం చెందాను. ఎంతో ఆనందించాను. టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజల అభిమానంతో పాటు నాన్నగారి ఆశీస్సులు నాకు ఉన్నాయి. దేశానికి పీవీ చేసిన సేవలు నాకు దీవెనలుగా భావిస్తున్నాను. ఎన్నికల్లో సానుకూల ఫలితాన్ని సాధిస్తా,’ అంటూ ఆమె స్పందించారు. కొంతకాలంగా ఈ నియోజకవర్గంలో కె. నాగేశ్వర్ కి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ భావించింది. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు, రాష్ట్ర ప్రణాళికాసంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ రావుల సలహా మేరకు ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమెను గెలిపేంచే బాధ్యతను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారకరామారావుకు ముఖ్యమంత్రి అప్పగించారు.
Also Read: నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?
దీనితో ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా వాణీదేవి, కాంగ్రెస్ అభ్యర్థిగా జి. చిన్నారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఎన్. రామచంద్రరావు, టీడీపీ తరఫున ఎల్ రమణ, స్వతంత్ర అభ్యర్థిగా కె. నాగేశ్వర్ పోటీ చేస్తారు. ఈ నియోజకవర్గంలో 5,17, 883 మంది ఓటర్లు ఉన్నారు. రెండో శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గమైన నల్లగొండ-వరంగల్లు-ఖమ్మం లో 4,91,396 మంది ఓటర్లు ఉన్నారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గానికి శాసనమండలి ప్రతినిధిగా ఎన్ రామచంద్రరావు ఉన్నారు. ఆయన పదవీకాలం మార్చి 28తో ముగుస్తుంది. నల్లగొండ-వరంగల్లు-ఖమ్మం నియోజకవర్గంలో అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరామ్ (టీజెఎస్), పల్లారాజేశ్వరరెడ్డి (టీఆర్ఎస్), రాములు నాయక్ (కాంగ్రెస్), రాణిరుద్రమ (యువతెలంగాణపార్టీ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటిపార్టీ), జయసారథి (సీపీఐ) పోటీ చేస్తున్నారు.
వాణీదేవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ముందు ముఖ్యమంత్రి ఆ మూడు జిల్లాల పార్టీ నాయకులను సంప్రదించినట్టు తెలుస్తోంది. నల్లగొండ-వరంగల్లు-ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డి మరోసారి పోటీ చేస్తారని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించి వారం రోజులు దాటింది. పీవీ నరసింహారావు శతజయంత్యత్సవాలు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న కారణంగా ఆయన కుమార్తెను ఎంఎల్ సీ చేయడం సముచితంగా ఉంటుందని కేసీఆర్ భావించి ఉంటారు. వాణీదేవి అగ్రజుడు పీవీ రంగారావు ఎంఎల్ సీగా చేశారు. మరో సోదరుడు రాజేశ్వరరావు పార్లమెంటు సభ్యుడుగా ఒక సారి ఎన్నికైనారు. పీవీ కుటుంబం నుంచి రాజకీయాలలో ప్రవేశించివారిలో వాణీదేవి నాలుగో సభ్యులు.
Also Read: రాష్ట్ర కాంగ్రెస్ లో మూడు ముక్కలాట
నిజానికి, ఇటీవల గవర్నర్ కోటాలో వాణీదేవికి అవకాశం ఇచ్చి ఉంటే ఆమెకు ఎన్నికలలో పోటీ చేయవలసిన అవసరం ఉండేది కాదు. ఈ నియోజకవర్గంలో బీజేపీ ఆధిక్యం ఉన్నదనే అభిప్రాయం ప్రజలలో ఉంది. బీజేపీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావు బ్రాహ్మణవర్గానికి చెందినవారు కావడంతో అదే వర్గానికి చెందిన వాణీదేవిని నిలబెట్టడం ద్వారా బీజేపీకి చెందని బ్రాహ్మణ ఓట్లను పొందవచ్చుననీ, పీవీకి భారతరత్న మొన్న గణతంత్రదినోత్సవం నాడు కూడా మోదీ ప్రభుత్వం ప్రకటించకపోవడం పట్ల పట్టభద్రులలో ఏమైన ఆగ్రహం ఉంటే దానిని కూడా ఉపయోగించుకోవచ్చుననీ కేసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలుపుతున్నాయి.
వాణిదేవి విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా పలు సేవాకార్యక్రమాలు చేస్తూ వచ్చారు. శ్రీవెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. స్వామీ రామానంద స్మారక సంస్థ అద్యక్ష హోదాలో ఉన్నారు.