సుప్రసిద్ధ సంపాదకులు చక్రవర్తి రాఘవాచారితో నాగసూరి వేణుగోపాల్
ఆకాశవాణి లో నాగసూరీయం –10
‘బొమ్మా-బొరుసా’ అంటూ విజయవాడలో పాతికేళ్ళ క్రితం (అంటే 1996-97లో) చేయించిన జంట ప్రసంగాల ప్రయోగం నా వరకు ఒక మధురస్మృతి! తుమ్మెద, కళ్ళు, చిలుకా-గోరువంక, నెమలి, వసంతం, గంధం, మల్లెపూలు, కోయిల, ఆకాశం, జింక, సముద్రం, పాము, నెమలి, నాసిక, హంస, వేణువు వంటి వీటి గురించి ఎంతోమంది ఎంతో రాశారు!
Also read: చిరస్మరణీయమైన ‘వెలుగుజాడ’ ధారావాహిక!
చిలుకా-గోరింక
భార్యా భర్తల అనురాగం గురించి వారు చిలుకా-గోరింకలంటారు. అసలు చిలుకా-గోరింక … వేర్వేరు పక్షి జాతులు కదా! వాటి మధ్య అనురాగం, దాంపత్యం ఉంటుందా? నాగస్వరానికి పాము నాట్యం చేస్తుంది! ఎందుకు? అదెలా సాధ్యం? అసలు, పాముకు సంగీత ఆస్వాదన ఉంటుందా? పాముకు చెవులుండవు కనుక, స్పర్శతో భూమిలో జరిగే కంపనల ద్వారా, వచ్చే జంతువులను, ఇతర వాటిని గుర్తిస్తుంది. అందుకే చీకటిలో పొలాల్లో వెళ్ళేటప్పుడు ఆ కర్రను కొడుతూ వెడుతూ వుంటారు, పాములను బెదరగొట్టడానికి ! మరి ఈ పాములు నాట్యం వ్యవహారం ఏమిటి? నాకే కాదు, చాలా మందికి ఇలాంటి విషయాల పై ఆసక్తి ఉంటుంది. దేని గురించి వివరించే అవకాశం ఉందో వాటిని మనం ‘ఆధునిక రచయిత సమయాలు’ గా అనుకోవచ్చు!
Also read: అన్నమయ్య పదగోపురం
సుమారు శతాబ్దం క్రితమే తెలుగు తొలి కార్టూనిస్టు తెలిశెట్టి రామారావు కవుల వర్ణనలతో అమ్మాయి ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో ఒక కార్టూన్ చమత్కారం చేశారు!! దీనిని ఇప్పటికీ ఎంతోమంది ప్రస్తావిస్తూ ఉంటారు. వర్ణనలలోని అతిశయోక్తులనూ, అసంగతాలను బట్టబయలు చేయడమే, అందులోని వ్యవహారం.
అప్పటికి కవులకున్న అవగాహన బట్టి ఊహలు ఏర్పడి ఉంటాయి. కల్పనకు కూడా ఏదో ఒక రకమైన వాస్తవికతయే ఆలంబన! మనిషి గమనం, జిజ్ఞాస, అధ్యయనం బట్టి అనేకరకాల అవగాహన పెరుగుతూ రావడంతో పూర్వ అభిప్రాయాలకు కాలం చెల్లిపోతుంది.
నెమలి పాటలు
కవుల కల్పనలో నెమలి, నెమలి గురించి సైన్స్ – అనేవి రెండూ భిన్న అంశాలు! సాహిత్య పరిచయం లోతుగా ఉంటే ఏ రచయిత, కవి ఎలా వర్ణించారో తెలుసు కోవచ్చు. అలాగే రెండోది కూడా! ‘బొమ్మా-బొరుసా’లో ప్రణాళిక ఏమిటంటే ఇద్దరు ప్రసంగ కర్తలు ఇలా చెరో 8 నిమిషాలు ప్రసంగాలు చేస్తారు. నెమలికి సంబంధించిన మూడు వేర్వేరు సినిమా పాటల మధ్య రెండు ప్రసంగాలను అమర్చేవారం. ఉపోద్ఘాతం, ముగింపు, చర్చిస్తున్న విషయం పట్ల ఉత్సుకత కల్గించే రీతిలో కొన్ని వాక్యాలను పాట-ప్రసంగం, ప్రసంగం-పాట మధ్య ముందే రూపొందించుకునేవారం. మొత్తంగా చూస్తే ఇది ఒక కదంబం, లేదా రూపకం!
Also read: ఉత్సవరథానికి ఉజ్వల సందర్భం
ప్రణాళిక బ్రహ్మాండంగా ఉంటే సరిపోదు, అది సవ్యంగా కార్యరూపం దాల్చాలి. దానికోసమే ఇంత వ్యవస్థ, ఇంతమంది ఉద్యోగులు పని చేస్తారు – ఎక్కడైనా! వ్యూ – కౌంటర్ వ్యూ, ఫర్ – ఎగైనెస్ట్, వాదం – ప్రతివాదం, కితాబు – జవాబు వంటి శీర్షికలు కూడా ఈ ‘బొమ్మా – బొరుసా’ కు ఇవ్వచ్చు. అయితే, సాధ్యమైనంత మృదువైన రీతినే ఎంచుకున్నాను. నిజానికి, ఈ ఆలోచన 1996లో రూపుదాల్చినపుడు అంతక్రితం అనంతపురం ఆకాశవాణిలో ప్రయోగాత్మకంగా చేశాను. సంగీతం మేళవిస్తే వినడానికి శ్రమ ఉండదు, కమ్యూనికేషన్ ఫలితం ఎక్కువ శాతం సాధ్యమవుతుంది.
పావుగంటలో రెండు ప్రసంగాలు
అనంతపురంలో రాత్రి తొమ్మిది గంటలకు ఒక పావుగంటలో రెండు ప్రసంగాలు ఇచ్చేవారం. అయితే, విజయవాడలో దీన్ని మరింత సంపూర్తిగా ప్రయత్నించగలిగాను. జంట ప్రసంగాలలో ఒక మహిళ, ఒక పురుషుడు ఉండేలా కూడా శ్రమ పడ్డాం. అప్పట్లో నేను ప్రతిరోజు ఉదయం తెలుగు వార్తల తర్వాత ఒక అరగంట పాటు ‘ఉదయరేఖలు’ అనే కార్యక్రమం నా ప్రధాన బాధ్యత. అందులో ఒకటి రెండు పాటలు (సినిమా/ లలిత/ జానపద) వినియోగించడం కూడా అవసరం.. కనుక ఆ కార్యక్రమంలో సంగీతం జోడించే అవకాశం ఉంది. ప్రణాళిక చేసే వ్యక్తికి ఒక వైపు సైన్స్ పరిజ్ఞానం, మరోవైపు సాహిత్య పరిచయం అవసరం. ఇవి రెండూ నా డొమైన్ లోని అంశాలే!
Also read: వెళ్ళలేనిచోటే లేని రెక్కల గుర్రం!
అనంతపురం జిల్లా కళాకారులతోనే అనంతపురం అకాశవాణి కార్యక్రమాలు రూపొందించాలి. విజయవాడ కేంద్రం పరిధిలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు వస్తాయి. ఈ ప్రాంతం నుంచి ప్రసంగాన్ని చక్కగా పండించే వీలుంది. అవసరమైతే మిగతా విభాగాల నుంచి మెరుగైన కళాకారులను ఎంపిక చేసుకునే వెసలుబాటు కూడా అక్కడ ఉంది.
అలా రక్తి కట్టిన ‘బొమ్మా – బొరుసా’ జంట ప్రసంగాల కదంబ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది ప్రసంగకర్తల పేర్లు మాత్రమే గుర్తుకువస్తున్నాయి : జంధ్యాల జయకృష్ణ, బాపూజీ (కరుణశ్రీ కుమారులు), జమ్మి కోనేటిరావు, ఎం.కె. దుర్గాప్రసాద్, కె.ఆర్.కె.మోహన్, రసరాజు (సినిమా గేయకర్త), బాలాంత్రపు శ్యామలరావు, వి. నాగరాజ్యలక్ష్మి…! మిగతావారి పేర్లు ఇప్పుడు గుర్తుకు లేవు. డైరీ రాసుకునే అలవాటు లేదు కదా! అప్పటికీ మొబైల్ ప్రపంచం రాలేదు, కంప్యూటర్ ప్రపంచం ఇంతగా లేదు.
Also read: గుక్క తిప్పుకోనివ్వని ఆ రెండేళ్లు!
అనౌన్సర్ ప్రశంస
ప్రసంగాలు మాత్రం రికార్డు చేసి మిగతా వాటిని అప్పటికప్పుడు (లైవ్) గా ప్రసారం చేసే వారం. టేపులలో రికార్డు చేసే కాలం కనుక అన్నింటిని ఆ కేంద్రంలో భద్రపరిచే అవకాశం లేదు. అందువల్ల నేడు ‘బొమ్మా-బొరుసా’ జంట ప్రసంగాల కదంబ కార్యక్రమాల ఆనవాళ్ళు కేవలం శ్రోతల మదిలో, ప్రసంగ కర్త మనసుల్లో, నా జ్ఞాపకాలలో నిక్షిప్తమయ్యాయి. మిలమిలా మెరిసే కళ్ళతో అప్పటి అనౌన్సర్ శ్రీమతి ఆవాల శారద ప్రసంగకర్తలు కూడా చాలా బాగా రాసుకొస్తున్నారు, ప్రోగ్రాం బాగా రక్తికడుతోంది అన్న అభినందన నేటికీ నా మనసు పొరల్లో జాగ్రత్తగా ఉంది!
యూపియస్సి నన్ను తెలుగు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ (స్పోకన్ వర్డ్స్& ఫీచర్స్)గా (1988 అడ్వర్ టైజ్ మెంట్) ఎంపిక చేసిందని నాకు సదా గుర్తు! ఆ దారిలో నా కృషి సాగేది. ఇక్కడ స్పోకన్ వర్డ్స్ అంటే ప్రసంగాలు, పరిచయాలు, చర్చలు, సంచికలు, నివేదికలు, సమీక్షలు వగైరా! ఫీచర్ అనేదాన్ని తెలుగులో రూపకం అంటాం.
నిజానికి రూపకం ఒకటే సిసలైన రేడియో ప్రక్రియ అనీ, మిగతా అన్ని అప్పటికే జనబాహుళ్యంలో ఉండే ప్రక్రియలకు అనుకరణలే అనేది వేరేగా చర్చనీయాంశం. రూపకంలో ఫాక్ట్ (సమాచారం, వాస్తవం) ఉండాలి, దాంతో పాటు ఫిక్షన్ (కల్పన) కూడా ఉండాలి. అయితే, ఆ కల్పన అసంగతంగా ఉండకూడదు. సృజనాత్మకంగా ఉండాలి. ఇక్కడ ఆ కల్పనా గుణాన్ని కవుల ఊహల్లో, సినిమా పాటల సంగీతం ద్వారా సాధించాం.
Also read: మేళత్తూరు భాగవత మేళ నాట్యనాటకాలు
నాగస్వరం
అలవోకగా సైన్స్ అనకుండా సైన్స్ విషయాలను రంగరించి శ్రోతల చేతిలో ఊరగాయతో పెరుగన్నం ముద్ద పెట్టినట్టు ప్రయోగం చేశాం. 1997లో ఎన్ సి ఎస్ టిసి విగ్యాన్ ప్రసార్ సంస్థలో ఆడియో విజువల్ కోఆర్డినేటర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం వెళ్ళినపుడు, ఈ ప్రయత్నం గురించి చెబితే అక్కడి డైరెక్టరు నరేందర్ సెహగల్ ఎంతో అభినందించారు.
నాగుపాము ముందు నాగస్వరం త్రిప్పుతూ ఊదుతూ ఉంటే, కొడతారేమో అని అది తల తిప్పుతూ జాగ్రత్తపడుతూ ఉంటుంది. మనం దాన్ని ఆనందనృత్యం అని భావిస్తాం! రెండు పక్షి జాతుల మధ్య సృష్టి కార్యం జరుగదు. చిలుకలలో ఆడ చిలుకకూ, గోరువంకలలో మగ గోరువంకకూ ప్రేమించే ధర్మం ఎక్కువగా ఉంటుందట! అలాంటి లక్షణాలు ప్రేయసీ ప్రియులలో; భార్యా భర్తలలో ఉంటాయనీ, ఉండాలని కవులు ‘చిలుకా – గోరింకా’ అని అంటూ కవులు ఊహలు చేస్తారు. అది ఒక ఆశావాదం, అంతే!
Also read: ఆంధ్రా ‘యూనివర్సిటీ యువత’ గా మారిన సందర్భం!
డా. నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు
మొబైల్: 9440732392