- మమతకు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహాలు
- బెంగాలీ ప్రముఖులకు గాలం వేస్తున్న బీజేపీ
బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీలు హోరా హోరీ తలపడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల విమర్శలు, ప్రతివిమర్శలతో బెంగాల్ రాజకీయం వేడెక్కుతోంది. గత కొన్ని నెలలుగా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో కొంత బలహీనమవుతున్నా మొక్కవోని దీక్షతో హ్యాట్రిక్ కొట్టాలని మమతా బెనర్జీ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అదే సమయంలో తృణమూల్ కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడంద్వారా బీజేపీ బలం పుంజుకుని మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది. తాజాగా బెంగాల్ కు చెందిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి చేరికతో బీజేపీకి మరికొంత బలం చేకూరినట్లయింది. అయితే దశాబ్ధాల పాటు వేళ్లూనుకుపోయిన కమ్యూనిస్టులను కూకటివేళ్లతో పెకలించిన మమతను ఢీకొట్టేందుకు బీజేపీ బలం సరిపోతుందా! మిథున్ చక్రవర్తి ప్రచారం ఎన్నికల్లో అక్కరకొస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
సినీ గ్లామర్ పై గంపెడాశలు పెట్టుకున్న బీజేపీ:
మరోవైపు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ సినీ గ్లామర్ పైనే భారీగా ఆశలు పెట్టుకుంది. ఇందుకు సినీరంగంలో వెలుగొందుతున్న నటీ నటులను పార్టీలో చేర్చుకుని బలోపేతమయ్యేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. కోల్ కతా లోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరిగిన భారీ ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్న వేదికపైనే మిథున్ చక్రవర్తి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బెంగాల్ లో బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కైలాష్ విజయ్ వర్గీయ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత కొంత కాలంగా పార్టీలో మిథున్ చక్రవర్తి చేరికపై ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
విందు రాజకీయాలు:
ఇటీవల ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముంబయిలో మిథున్ చక్రవర్తి ఇంటికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. మిథున్ కు బీజేపీ నేతలు, అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. 70 ఏళ్ళ మిథున్ చక్రవర్తికి బెంగాల్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బెంగాలీ సినిమాల్లో నటించడంతో పాటు పలు టీవీ షోలలో న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన మిథున్ చక్రవర్తి బెంగాల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ లో చేరారు. ఆయన్ను బీజేపీ ఎన్నికల బరిలో దింపుతుందా లేదా ప్రచారానికి మాత్రమే పరిమితం చేస్తారా అన్నది తేలాల్సిఉంది.
తృణమూల్ కొత్త నినాదం:
ఈసారి ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ కొత్త నినాదాన్ని అందుకుంది. గతంలో మా మాటి, మనుష్ అంటూ నినదించి ఎన్నికల్లో భారీ విజయాలను నమోదు చేసిన మమతా బెనర్జీ ఈ సారి ఎన్నికలకు ముందు మరో కొత్త నినాదంతో బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఢిల్లీకి చెందిన పార్టీ అని తాను పశ్చిమ బెంగాల్ కుమార్తెనని మమతా బెనర్జీ ప్రకటించుకున్నారు. అయితే మమత వ్యూహాలను అడ్డుకునేందుకు బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ మిథున్ చక్రవర్తిని బెంగాల్ కుమారుడంటూ సంబోధించారు. తాను బెంగాల్ కుమార్తెనంటూ మమత చేస్తున్న వ్యాఖ్యలకు మోదీ చెక్ పెట్టారని పలువురు భావిస్తున్నారు.
బెంగాలీ ప్రముఖులకు బీజేపీ గాలం:
బెంగాల్లో మమతా బెనర్జీని ఎదుర్కొనేందుకు ప్రముఖ బెంగాలీల కోసం బీజేపీ ఎప్పటి నుంచో అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా భారత మాజీ క్రికెట్ కెప్టెన్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని పార్టీలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా గంగూలీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రముఖ బెంగాలీ నటుడు ప్రసేన్ జిత్ ఛటర్జీని చేర్చుకోవాలని పావులు కదిపారు. జనవరి 23న నేతాజీ సుభాస్ చంద్రబోస్ పుట్టినరోజు సందర్భంగా విక్టోరియా మెమోరియల్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ఛటర్జీ హాజరయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఛటర్జీ రాజకీయాలపట్ల ఆసక్తి లేదని ప్రకటించడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది.
మిథున్ చక్రవర్తి రాజకీయంగా అన్ని పార్టీలలోని వ్యక్తులతో దగ్గర సంబంధాలున్నాయి. గతంలో సీపీఎం ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన సుభాస్ చక్రవర్తికి సన్నిహితంగా మెలిగారు. ఆ సమయంలో ఆయన సీపీఎంలో చేరతారనే ఊహాగానాలు బలంగా వినిపించినా తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. 2014లో రాజ్యసభకు ఎంపికయ్యారు. కోట్లాది రూపాయల శారదా చిట్ ఫండ్ స్కాంకు సంబంధించిన అవకతవకల్లో మిథున్ ప్రమేయముందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో ఆయనను ఈడీ విచారించగా శారదా చిట్ ఫండ్ కు ప్రచారకర్తగా ఉన్న మిథున్ కు వచ్చిన పారితోషికాన్ని ఆయన ఈడీకి తిరిగిచ్చేశారు. రెండు సంవత్సరాల తరువాత ఆరోగ్యం సహకరించడంలేదనే నెపంతో రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
ఇదీ చదవండి: నేతాజీ చుట్టూ బెంగాల్ రాజకీయాలు…ఎందుకంటే ?
చిత్రపరిశ్రమలో ఎదురులేని చక్రవర్తి:
1976లో మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన మృగయా చిత్రంలో ఆయన చేసిన గిరిజన విలుకాడి పాత్ర మంచి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి గాను మిథున్ చక్రవర్తికి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు లభించింది.
మిథున్ చక్రవర్తి బాలీవుడ్ లోనే కాకుండా అంతర్జాతీయ చిత్రపరిశ్రమలో కూడా ఖ్యాతి గడించారు.1980 దశకంలో సోవియట్ యూనియన్ లో మిథున్ చక్రవర్తి సినిమాలను మంచి ఆదరణ లభించింది. మిథున్ చక్రవర్తి నటించిన యాక్షన్ సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను ఎంతగానో అలరించాయి. డిస్కో డాన్సర్, కసం పైడా కర్నే వాలేకి, కమెండో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. 1980 నుండి 2000 సంవత్సరం వరకు దేశవ్యాప్తంగా యువతతో ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది.
మమతకు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహాలు:
2016 అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తోంది. మమతను గద్దె దింపేందుకు వీలైనంత ఎక్కువమంది ప్రముఖులను ముఖ్యంగా పలు రంగాలలో పేరెన్నికగన్న బెంగాలీలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు రుద్రానిల్ ఘోష్, యస్ దాస్ గుప్తా, హిరాన్ ఛటర్జీ, పాయల్ సర్కార్, స్రబంతి ఛటర్జీ లతో పాటు బుల్లితెర నటీ నటులకు గాలం వేస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నటుడు ఫిర్దౌస్ కూడా టీఎంసీ తరపున ప్రచారం నిర్వహించారు. బెంగాలీగానే కాకుండా దేశవ్యాప్తంగా మంచి నటుడిగా పేరొందిన మిథున్ చక్రవర్తి బీజేపీ ర్యాలీలు, బహిరంగ సభలకు భారీ జన సమీకరణ చేసుందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
ఇదీ చదవండి:పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ అమీతుమీ
నందిగ్రామ్ పై ప్రత్యేక దృష్టి :
మిథున్ చక్రవర్తి బెంగాల్ మాజీ మంత్రి సుబేందు అధికారితో మంచి సబంధాలు కొనసాగిస్తున్నారు. నందిగ్రామ్ నుంచి సీఎం మమతా బెనర్జీని ఢీకొట్టేందుకు సుబేందు అధికారి బీజేపీ తరపున ఎన్నికల బరిలో దిగుతున్నారు.
మిథున్ చక్రవర్తి 2014 లోక్ సభ ఎన్నికల్లో సుబేందు తరపున ప్రచారం నిర్వహించారు. తాజాగా ఇద్దరూ బీజేపీలో చేరడంతో మళ్లీ సుబేందుకు మిథున్ చక్రవర్తి ప్రచారం నిర్వహించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: నందిగ్రామ్ నుంచి మమత పోటీ