- భారత తొలి మహిళా క్రికెటర్ గా రికార్డు
- 38 ఏళ్ల వయసులోనూ అదేజోరు
భారత మహిళా క్రికెట్లో ఎవర్ గ్రీన్ స్టార్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డుల పరంపర కొనసాగుతోంది.లక్నో వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లోని మూడోమ్యాచ్ లో 36 పరుగుల స్కోరు సాధించడం ద్వారా క్రికెట్ చరిత్రలోనే 10వేల అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత తొలి మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది.
1999 నుంచి 2021 వరకూ:
1999 సీజన్లో 16 ఏళ్ల మిథాలీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన నాటినుంచి వెనుదిరిగి చూసింది లేదు. వివాహాన్ని,వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కన పెట్టి తన జీవితాన్నే క్రికెట్ కు మిథాలీ అంకితం చేసింది.గత 22 సంవత్సరాలుగా భారత టెస్టు,వన్డే ఫార్మాట్లలో భారత కీలక ప్లేయర్ గా తన ప్రత్యేకతను కాపాడుకొంటూ వచ్చిన మిథాలీ మొత్తం మూడు ఫార్మాట్లలోనూ కలసి 10వేల పరుగుల మైలురాయిని చేరుకోగలిగింది.వన్డే క్రికెట్లో 6 వేల 974 పరుగులు, టీ-20ల్లో 2 వేల 364 పరుగులు, టెస్టు క్రికెట్లో 663 పరుగులు సాధించడం ద్వారా 10 వేల పరుగుల రికార్డును అందుకోగలిగింది.
Also Read: టీ-20 రికార్డుల వేటలో కొహ్లీ,రోహిత్
రెండో మహిళా మిథాలీ:
మహిళా క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ 10వేల అంతర్జాతీయ పరుగులు సాధించిన తొలి మహిళ గౌరవాన్ని ఇంగ్లండ్ ప్లేయర్ చార్లొట్టీ ఎడ్వర్డ్స్ దక్కించుకోగా మిథాలీ రెండో మహిళగా నిలిచింది.50 ఓవర్ల వన్డే క్రికెట్లో మిథాలీ 212 వన్డేలు ఆడి 7శతకాలు, 54 అర్థశతకాలు నమోదు చేసింది. 89 టీ-20ల్లో 17 హాఫ్ సెంచరీలు సాధించింది. 2019 సెప్టెంబర్లో మిథాలీ టీ-20 ఫార్మాట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించింది. టెస్టు క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన రికార్డు సైతం మిథాలీపేరుతో ఉంది.
Also Read: టీ-20 సిరీస్ లో అతిపెద్ద సమరం
మిథాలీకి సచిన్ హ్యాట్సాఫ్:
10వేల అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించిన మిథాలీరాజ్ ను క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్, భారత మాజీ ఓపెనర్ వాసిం జాఫర్ , బీసీసీఐ వేర్వేరు సందేశాల ద్వారా అభినందించారు.క్రికెట్ కోసం వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసిన మిథాలీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మరి.