వోలెటి దివాకర్
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ‘నన్నయ మహా భారత రచన, రాజరాజ నరేంద్రుని పట్టాభిషేక సహస్రాబ్ది’ మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు సాహిత్య అకాడమీ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ఈ సందర్భంగా జరిగిన జాతీయ సదస్సులో తెలుగు ప్రాకృత మరియు సంస్కృత పండితులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బేతవోలు రామబ్రహ్మం మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన మహాభారత వ్యాఖ్యనంలో కొన్ని పొరపాట్లు దొర్లాయని వాటిని పరిష్కరించిన అనంతరం పునర్ముద్రించాలన్నారు. దీనిపై తెలుగు సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి స్పందించాలని కోరారు. ఇటువంటి సదస్సు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం చేపట్టడం సార్థమైన కార్యక్రమమని అన్నారు. విశ్వవిద్యాలయం వారిని, సాహిత్య అకాడమీ వారిని అభినందించారు.
తెలుగు సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ, ఈ నెల 29న గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ తరుపున కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రాజరాజనరేంద్రుడు సాహిత్యాన్ని పోషించారని, నన్నయచే మహాభారత ఆంధ్రీకరణ కు పూనుకున్నారని, నన్నయ ఆదికవి అని నొక్కి చెప్పారు. .
తెలుగు సంస్కృత పండితులు శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ, తెలుగు జాతికి గొప్ప విషయాలను తీసుకోవడం, ఇవ్వడం తెలుసన్నారు. శిల్పాన్ని, శబ్దశక్తిని ఉపయోగించడంలో ఆదికవి నన్నయకు ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు. పత్ని అనే పదాన్ని యజ్ఞ సమయంలో ఉపయోగించేవారని సూచించారు. నన్నయ రచనల్లో నూతన శిల్పాన్ని ఆయన ఆవిష్కరించారు.
వీసీ ఆచార్య కె. పద్మరాజు మాట్లాడుతూ ఆదికవి నన్నయ పేరుతో ఉన్న విశ్వవిద్యాలయంలో సహస్రాబ్ది ఉత్సవాలు జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
రాజరాజ నరేంద్రునికి ఇష్టమైన పనుల్లో భారతాన్ని వినడం ఒకటన్నారు. మహారాజు తమ పూర్వులు, చంద్రవంశపు రాజులైన కౌరవ, పాండవుల చరిత్ర అయిన మహాభారతం జయసంహిత పేరుతో సంస్కృత భాషలో ఉందని, తమిళ కన్నడ భాషల్లో అది తర్జుమా అయిందని తెలుగులో కూడా మహాభారతం ఉండాలని… దానిని తెలుగులో రచించాలని నన్నయ మహాకవికి రాజరాజ నరేంద్రుడు ప్రేరణ ఇచ్చారని అన్నారు. దాని ఫలితమే ఆంధ్ర మహాభారత రచన అయిందని, అది తెలుగులో ఆదికావ్యంగా నన్నయ ఆదికవి అయ్యారని వివరించారు.
సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, కన్వీనర్ సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సి.మృణాళిని, సదస్సు కన్వీనర్ డా.కె.వి.ఎన్.డి.వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నందంపూడి శాసనం ఆవిష్కరణ
ఈ సహస్రాబ్ది మహోత్సవాలు ప్రారంభ సూచికగా నందంపూడి శాసనాన్ని (రాగి రేకులపై ఉన్న వాటిని) శాశ్వతంగా పది మందీ వీక్షించేలా ‘సన్దమ పూణ్ణి శాసనం’ శిలా ఫలకంపై చెక్కించారు. ఈ శిలా శాసనాలను రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, తెలుగు సంస్కృత అకాడమీ- తెలుగు సలహా మండలి ఛైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతీ, వీసీ ఆచార్య కె.పద్మరాజు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఇటువంటి అరుదైన శాసనాలను పది కాలాల పాటు పరిరక్షించుకోవాలన్నారు. వెయ్యేళ్ళ చరిత్ర గల రాజమహేంద్రవర వైభవాన్ని ప్రతిబింబించే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేసారు.