Tuesday, January 21, 2025

హిందూ ధర్మ ప్రచారంలో తప్పటడుగులు

ఈ మధ్య జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశంలో తీసుకున్న రెండు ముఖ్యమైన నిర్ణయాలు వార్తాపత్రికలలో విశేషంగా ప్రచురించబడ్డాయి. ఒకటి తిరుమల గోపురానికి బంగారు తాపడం చేయించడం. రెండవది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులతో ఆలయాల నిర్మాణాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ, కలెక్టర్ల సహాయంతో చేపట్టడం.

Also read:ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రత్యామ్నాయంగా బిజెపి-జనసేన కూటమి

ఈ రెండు నిర్ణయాలలో మొదటి నిర్ణయాన్ని గురించి సందేహం వ్యక్తం చేస్తూ కొంత మంది పాత్రికేయులు నాకు ఫోన్ చేయడం జరిగింది. ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ ప్రాజెక్టు నేను ఈవోగా ఉన్న రోజులలో ప్రతిపాదించబడితే దానిని నేను పూర్తిగా వ్యతిరేకించటం, ఆపైన సుబ్రహ్మణ్య స్వామి గారి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా ఆ ప్రాజెక్టుకు స్వస్తి పలకడం జరిగింది. ఈ బంగారు తాపడానికి ఆ ప్రాజెక్టుకు ఏమైనా సంబంధం ఉన్నదా అని పాత్రికేయులు అనుమానాన్ని వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ రెండింటికి ఎటువంటి సంబంధం లేదు. ఆరోజు ప్రతిపాదించిన ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ ప్రాజెక్టు తిరుమల దేవాలయం గోడలకు బంగారు పూత పూయబడిన రేకులను అమర్చటం. వారసత్వ సంపదగా వస్తున్న చారిత్రక కట్టడ స్వరూప స్వభావాలను మార్చే ప్రయత్నం కాబట్టి దానిని పూర్తిగా ఆ రోజు వ్యతిరేకించడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి వేసిన ప్రజా ప్రయోజనంతో ఆ ప్రాజెక్టు పూర్తిగా విరమించుకోవడం జరిగింది. ఈరోజు ప్రతిపాదించిన గోపురానికి బంగారు తాపడం కొత్తగా చేపబడుతున్న ప్రక్రియ కాదు. తిరుమల గోపురానికి బంగారు తాపడం విజయనగర రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు చేయించడం జరిగింది. వెలిసిపోయినప్పుడు తిరిగి మరమ్మతు చేసి అమర్చటం కాల గతిలో జరుగుతున్న ప్రక్రియ. ఇది చివరిగా 50 సంవత్సరాల క్రితం జరిగింది. మరలా ఇప్పుడు టిటిడి వారు చేపడుతున్నారు.

Also read: మూడు రాజధానులు-మూడు రాష్ట్రాలు

బంగారు తాపడం ఆనవాయితీ

ఇక కొంత ఆందోళన కలిగించే నిర్ణయం రెండవ నిర్ణయం. కలెక్టర్ ద్వారా దేవాదాయ శాఖ ద్వారా ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలన్న టీటీడీ ప్రతిపాదన. హిందూ ధర్మ ప్రచారానికి పరిరక్షణకు ఇది సరైన మార్గం కాకపోవచ్చు.

టీటీడీలోనూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ లోనూ హిందూ ధర్మ ప్రచారానికి ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది. సాధారణంగా ఇది నిద్రావస్థలో ఉంటుంది. కార్యనిర్వాహణాధికారి చొరవ, శ్రద్ధ మీద ఆధారపడి ఈ విభాగం చైతన్యవంతమవుతూ ఉంటుంది. పనిచేస్తూ ఉంటుంది. నేను కార్యనిర్వాహణాధికారిగా ఉన్న సమయంలో ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాలలో, మతమార్పిడులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో శ్రీవారి కల్యాణాలను నిర్వహించే ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఒక మొబైల్ వ్యాన్ లో కావలసిన పరికరాలు సామగ్రి తీసుకొని పూజారులు, టిటిడి సిబ్బంది మారుమూల ప్రాంతాలకు వెళ్లి ఈ శ్రీవారి కల్యాణాలను నిర్వహించారు. గుమ్మలక్ష్మీపురం, పాడేరు, అరకు వంటి ప్రాంతాలలో విపరీతమైన స్పందన ప్రజల నుంచి వచ్చింది. మైళ్ళ దూరం నడిచి వచ్చి కళ్యాణాన్ని తిలకించి ప్రసాదాలు తీసుకొని ప్రజలు వెళ్లారు. దురదృష్టం ఇటువంటి చొరవతో కూడిన కార్యక్రమాలు అధికారి బదిలీ అయిపోవడంతో ఆపై వచ్చే అధికారులు కొనసాగించటం జరగటం లేదు. నా తర్వాత వచ్చిన కార్యనిర్మాణాధికారి ఇంకొక ప్రధానమైన విధానం ద్వారా హిందూ ధర్మ ప్రచారానికి పూనుకున్నారు. గ్రామాలలోని దేవాలయాలు కేంద్రంగా మన గుడి కార్యక్రమం ద్వారా ధర్మ ప్రచారానికి కృషి చేశారు. పై రెండు చక్కని కార్యక్రమాలే. కానీ దురదృష్టం వశాత్తూ ఆపైన వచ్చిన కార్యనిర్వహణాధికారులు రెండు కార్యక్రమాలనూ కొనసాగించలేదు.

Also read: ఏకపక్ష నిర్ణయాలతోనే రాజధాని విషాదం

సమరసత సంస్థ

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం-బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాలలో, మతమార్పిడులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆలయాలను నిర్మించి స్థానికులని అర్చకులుగా టీటీడీ ద్వారా తర్ఫీదు ఇచ్చి వారిని అక్కడ అర్చకులుగా నియమించి హిందూ ధర్మ ప్రచారానికి ఒక ప్రాజెక్టును సమరసత సంస్థ ద్వారా ప్రారంభించడం జరిగింది. విశ్రాంత టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్రీ పీవీఆర్కే ప్రసాద్ గారు, కేరళ కేడర్ ఆఫీసర్ శ్రీ ఎం జి కే మూర్తి గారు ఈ సంస్థకు ఆధ్వర్యం వహించడం జరిగింది. చక్కటి ప్రణాళికతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో బిజెపి నుంచి తెలుగుదేశం విడిపోవడంతో ఈ కార్యక్రమానికి కూడా ఆనాడు చంద్రబాబునాయుడు గారు టీటీడీ నిధులను ఆపివేశారు. చక్కగా ముందుకెళుతున్న ఈ ప్రాజెక్టు నిధులు మంజూరు కాక ఆగిపోయింది. చూడబోతే హిందూ ధర్మ రక్షణ ప్రచారం కేవలం బిజెపి పార్టీ అజెండా కానీ, టీటీడీ దేవాదాయ సంస్థల అజెండా కాదనీ, అసలు తెలుగుదేశానికి ఏమీ సంబంధం లేదనే విధంగా నాటి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఉండింది.

ప్రభుత్వాల వల్ల కాదు

జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధానాన్నే చాలా రోజులు కొనసాగించారు. ఈ మధ్య కొంత కాలం క్రితం దీనిని సవరించి తిరిగి ఈ దేవాలయాల నిర్మాణాన్ని నిర్వహణను సమరసతా వేదికకు అప్పగించడం జరిగింది. ఈ నిర్ణయాన్ని మరల తిరిగి తోడుతూ ఈనాడు టిటిడి ఈ దేవాలయ నిర్మాణ బాధ్యతను సమరసత వేదిక నుంచి తీసివేసి కలెక్టర్లకూ, దేవాదాయ శాఖకూ అప్పగించాలని పై నిర్ణయం ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నది. హిందూ ధర్మ ప్రచారం అంటే కేవలం ఆలయాలు నిర్మించడమే కాదు. అక్కడ ఉండే సమాజంతో నిరంతరంగా మమేకమవడం, వారిలో నుంచే ఒకరిని అర్చకునిగా నియమించటం, తగిన శిక్షణ ఇవ్వడం, పర్యవేక్షించటం. ఇటువంటి కార్యక్రమాలకు అంకితభావం చాలా అవసరం. ఇస్కాన్, సమరసతా వేదిక వంటి సంస్థలే ఇటువంటి కార్యక్రమాలను చక్కగా నిర్వహించగలవు. వాటి నుంచి తీసేసి ఈ కార్యక్రమాన్ని అధికారుల ద్వారా ప్రభుత్వ విభాగాల ద్వారా నిర్వహిస్తామనుకోవటం సరైన ఆలోచన కాదు. టిటిడి ఈ ఆలోచనకు స్వస్తి చెప్పి సమరసత వేదిక, ఇస్కాన్ లాంటి సంస్థల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు పోతేనే ఇది జయప్రదం అవుతుంది.

అర్చకులకు సామాజిక స్పృహ

హిందూ ధర్మ ప్రచారం గ్రామాలలో సక్రమంగా జరగాలంటే వీటన్నిటికన్నా ముఖ్యంగా గ్రామాలలోని అర్చకులకు సామాజిక స్పృహ సామాజిక బాధ్యత ఏర్పరచాలి. దీనికి కావాల్సిన తర్ఫీదు, వారి ఆలోచన విధానంలో మార్పులు తీసుకుని రావాలి. గ్రామంలో అన్ని ప్రాంతాలకు అర్చకుడు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకొని తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించిన నాడే హిందూ మతం ఈ పరమతాల దాడి నుంచి తట్టుకొని నిలబడగలదు. ఇది జరగాలంటే హైందవ ధర్మ పరిరక్షణ రాజకీయ అజెండా కానంతవరకు ఏ ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టవు. అన్ని హైందవ సంస్థలు ప్రభుత్వాల అధీనంలోనే ఉన్నాయి కాబట్టి హైందవ ధర్మ పరిరక్షణ ప్రభుత్వాలకు రాజకీయ అజెండా కానంతవరకు ఈ సంస్థలన్నీ అచేతనంగా ఉంటాయి. ప్రత్యామ్నాయంగా హైందవ మత సంస్థలన్నిటినీ ప్రభుత్వాల చెరనుంచి బయటికి తీసుకుని వచ్చి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ధార్మికమైన సంస్థ అధీనంలోకి తెగలిగితే హిందూ ధర్మ ప్రచారానికి వీటిని ప్రధాన కేంద్రాలుగా చేయవచ్చు. ఇతర మత సంస్థలు వక్రమార్గాలు, ప్రలోభాలు, మూఢనమ్మకాలు పునాదులుగా విస్తృతమైన దేశీయ విదేశీయ వనరులతో మతమార్పిడులకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వ అధీనంలో ఉండి ప్రభుత్వ అజెండా హిందూ ధర్మ పరిరక్షణ కానంతవరకు వీటితో పోటీగా హిందూ ధర్మ సంస్థలు ధర్మ ప్రచారం చేయటం చేతులు కాళ్లు కట్టేసిన తరువాత పరుగు పందెంలో పరిగెత్తడమే అవుతుంది.

Also read: వ్యవసాయ చట్టాలు – రైతులు

IYR Krishna Rao
IYR Krishna Rao
రచయిత ఐఏఎస్ విశ్రాంత అధికారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి. సుప్రసిద్ధ పుస్తక, వ్యాస రచయిత. బీజేపీ నాయకులు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles