హైదరాబాద్ : ఇక్కడి వైద్యుల బృందం అద్భుతం చేసింది. డబుల్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీని విజయవంతంగా ముగించింది. బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి సేకరించిన గుండెనూ, ఊపితిత్తులనూ ఇద్దరికి అమర్చి ఇద్దరికీ జీవం పోశారు. ఈ అరుదైన శస్త్రచికిత్స ఇక్కడి కిమ్స్ (కృష్ణా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో జయప్రదంగా జరిగింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి చెందిన అవయవాలను తీసి ఏడెనిమిది గంటలలోపే ఎవరికైనా అమర్చాలి. 51 సంవత్సరాల మహిళకూ, 59 ఏళ్ళ పురుషుడికీ అమర్చారు. డిసెంబర్ 24న జరిగిన శస్త్రచికిత్స తర్వాత ఇద్దరూ ఐసీయూలోనే ఉన్నారు. ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు.
కిమ్స్ లో థోరాటిక్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ ప్రోగ్రాం విభాగం అధిపతి, డైరెక్టర్ డాక్టర్ సందీప్ అట్టవార్ నాయకత్వంలోని వైద్యుల బృందం ఈ బృహత్తరమైన శస్త్రచికిత్స చేసింది. ‘‘ ఒక మృతి చెందిన వ్యక్తి నుంచి సేకరించిన రెండు అవయవాలను ఇద్దరు రోగులలో పరిమితమైన సమయంలో ఏర్పాటు చేయడం అన్నది పెను సవాలు. మృతి చెందిన వ్యక్తి (డోనార్), శస్త్రచికిత్స చేయించుకున్న ఇద్దరు రోగులూ ఆస్పత్రిలోనే ఉండటం కలసి వచ్చిన విషయం. కనుక అవయవాలనో, మృతుడినో తీసుకొని రోగుల దగ్గరికి ప్రయాణం చేయవలసిన అవసరం లేకుండా పోయింది. కిమ్స చరిత్రలో, గుండె-ఊపిరితిత్తుల శస్త్రచికిత్సల చరిత్రలో ఇది ఒక మైలురాయి,’’ అని డాక్టర్ సందీప్ అట్టవార్ అన్నారు.
ఇటువంటి శస్త్ర చికిత్సలు చాలా చిక్కులతో కూడుకున్నవనీ, ఏ మాత్రం జాప్యం జరిగినా శ్రమవృధా కావడమే కాకుండా రోగులకు ఆపద సంభవించే ప్రమాదం కూడా ఉన్నదనీ ఆస్పత్రి పౌరసంబంధాల అధికారి ఒకరు చెప్పారు. ఎంతటి ప్రవీణులకైనా ఇటువంటి శస్త్రచికిత్స ఒక సవాలేననీ, చాలా రిస్కుతో కూడిన వ్యవహారమనీ, రోగుల తరఫు బంధువులు సైతం రిస్కు తీసుకోవడానికి అంగీకరించడం వల్లనే ఈ అద్భుతం సాధ్యమైందనీ, మృతుని (దాత) పేరు. లబ్ధిదారుల పేర్లు వెల్లడించడం నైతికత కాదనీ ఆయన తెలిపారు.