- వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో రజతం
- స్వర్ణ పతకం చైనా యువతికి, కంచు ఇండొనీషియా అమ్మాయికి
టోక్యో: మీరాబాయ్ చానూ ఈ సారి ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం సంపాదించిపెట్టింది. 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ లో రెండో స్థానంలో నిలబడి రజత పతకం గెలుచుకోవమే విశేషం. స్వర్ణ పతకం చైనాకు చెందిన హౌజీహూయీ గెలుచుకోగా ఇండొనీసియాకు చెందిన లయిషా విండీ కాంటికా కంచు పథకం పొందింది.
తెలుగు ఆడపడచు కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో 2020 సిడ్నీ ఒలింపిక్స్ లో రజత పతకం గెలుచుకున్న దరిమిలా గడిచిన రెండు దశాబ్దాలలోనూ ఈ విభాగంలో భారత్ కు ఒలింపిక్ మెడల్ దక్కలేదు. 26 ఏళ్ళ మణిపూర్ యువతి మీరాబాయ్ చానూ 87 కేజీల బరువు ఒక సారీ, 115 కేజీల బరువు మరో సారీ ఎత్తి మొత్తం 202 కిలోలు ఎత్తి కరణం మల్లేశ్వరి రికార్డును అధిగమించింది. మీరాబాయ్ 89 కేజీల బరువు ఎత్తడానికి ప్రయత్నించి విఫలమైంది. తన రికార్డు 88 కిలోలు. దానికంటే ఒక కిలో ఎక్కువ ఎత్తడానికి ప్రయత్నించింది. చివరికి 87కిలోలతో సంతృప్తి పడవలసి వచ్చింది. ప్రపంచ రికార్డు 96 కిలోలు స్వర్ణ పతకం విజేత జీహుయీ పేరుమీద ఉంది. టోక్యోలో ఆమె 94 కిలోలు ఎత్తింది.
క్లియర్ జెర్క్ లో మాత్రం మీరాబాయ్ అందరికంటే ముందున్నది. ఆమె మొదటి సారి 110 కిలోలు ఎత్తి మళ్ళీ 115 కిలోలు ఎత్తగలిగింది. 117 కిలోలు ఎత్తడానికి ప్రయత్నించి విఫలమైంది. మొత్తంమీద రజత పతకం వచ్చిందని తెలుసుకొని సంతోషంతో ఎగిరి గంతేసింది. ఆనంద బాష్పాలు రాల్చింది. నృత్యం చేసింది.