ఆయనో రాష్ట్ర మంత్రి. కోవిడ్ కావడంతో పెద్దగా అధికారులతో మీటింగులు లేవు. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు కాబట్టి సభలు, సమావేశాలు అసలే లేవు. అధికారం ఉంది, కావాల్సినంత డబ్బుంది. ఖాళీగా ఉన్నాను ఇక నాకేంటి అనుకున్నాడు మంత్రి వర్యులు. దీనికి తోడు మన మంత్రికి కాస్త కళా పోషణ కూడా ఎక్కువ కావడంతో డిఫరెంట్ గా ఆలోచించాడు. మనిషన్నాకా ఏదీ చేయకుండా ఉండే బదులు ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడా మంత్రి. ఇక ఆలస్యం ఎందుకు. అనుకున్నదే తడవు మెదడుకు పని పెట్టాడు. అంతే టపీ మని మంత్రి గారి మదిలో చిలిపి కోరికలు పుట్టాయి. కోరిక పుట్టిందే తడవు అమల్లో పెట్టేందుకు ఉద్యుక్తుడయ్యాడు. ఇక చూడండి మంత్రి గారి తడాఖా
ఓ సినీ నటితో సరససల్లాపలు సాగించాలని అనుకున్నాడు. కరోనా కాబట్టి తాను ఎంటరయితే బాగోదని మహిళా మధ్యవర్తిని పంపాడు. సినీనటి వద్దకు చేరిన రాయబారి మంత్రి గారి అండదండలతో రెచ్చిపోయింది. తొలి దఫా చర్చలు మొదలు పెట్టింది. మంత్రి గారి గుణగణాలు వర్ణించింది. మంత్రి మంచివాడని పెద్దవాళ్లతో పెద్ద పెద్ద పనులు ఉంటాయని ఊదర గొట్టింది. అయితే సినీ నటి తొలి రౌండ్ చర్చలకు పెద్దగా స్పందించలేదంట. అయితే మన మధ్యవర్తి సామ దాన,భేద,దండోపాయాలను ప్రయోగించింది.
ఈ క్రమంలో సినీ నటికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. ఆమె మొబైల్ లో ఉన్న ప్రైవేటు ఫొటోలను తన మొబైల్ ద్వారా మంత్రిగారికి పంపించింది. ఇది గమనించిన సినీ నటి మూమూలుగా మాట్లాడుతూ మధ్యవర్తి మొబైల్ చూసి ఖంగుతింది. అందులో తను పంపకుండా తన ప్రైవేటు ఫొటోలు ఎలా వచ్చాయా అని మథనపడింది. అయితే ఇంతలోనే మధ్యవర్తి ఇంకో ఘనకార్యం వెలగబెట్టింది. సినీనటితో జరిపిన సంభాషణలు వాట్సప్ ద్వారా మంత్రికి వివరించింది. దీంతో అసలు ఏంజరుగుతుందోఅర్థం కాక సినీనటి ఆ మహిళా రాయబారి ఫోన్ లో ఉన్న సమాచారం తీసుకొని ఆ సమాచారాన్ని స్క్రీన్ షాట్ లు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
సామాజిక మాధ్యమాల్లో ఎపుడు మేత దొరుకుతుందా తినేద్దాం అని ఎదురు చూస్తున్న జనానికి సరిగ్గా ఈ స్ర్కీన్ షాట్ దొరికాయి అంతే విపరీతంగా ట్రోల్ చేస్తూ మంత్రి ఎవరు, సినీ నటి ఎవరు, మధ్యవర్తి ఎవరంటూ ప్రశ్నల పరంపర సంధిస్తున్నారు.
కాబట్టి ఖాలీ ఉంటే ఏదో ఒకటి చేసే బదులు ఏమీ చేయకుండా ఉంటే అదే ఉత్తమం. అంతలో ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది. ఇక అధికారులు దర్యాప్తులో నిమగ్నమయ్యారు. దీంతో ఆ మంత్రి ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.