తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం ఈటెల రాజేందర్‌ను మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేయగానే కొన్ని వారాల తరబడి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు దశాబ్దమున్నర పాటు శాసనసభ్యునిగా కొనసాగిన రాజేందర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో అసెంబ్లీ సమావేశాలలో టిఆర్ఎస్ తరపున తెలంగాణ ప్రజాసమస్యలపై ధీటుగా ఎదురునిలిచి మాట్లాడేవారు. తెలంగాణ పోరాటంలో తాను చురుకైన పాత్ర పోషించడమే కాకుండా, ప్రజల మన్ననలు కూడా పొందారు. కెసిఆర్ తో సఖ్యత కుదరకపోవడం వల్ల భూకబ్జా పేరుతో పొగపెట్టడంతో టీఆరెఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. ఈటెల రాజీనామా చేయడమే తరువాయి, రెండు గంటలలో స్పీకర్ ఆమోదించడం చకచకా జరిగిపోయింది. అన్ని పార్టీల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ కూడా రాజేందర్ కు ఆహ్వానం పంపింది. కాని, నాయకత్వ లోపం కాంగ్రెస్ కుందని భావించారేమో ఆ ప్రయత్నాన్ని సున్నితంగా తిరస్కరించారు.
Also read: రైట్.. రైట్.. ప్రైవేట్..
చేజారిన చారిత్రక అవకాశం
తిరుగుబాటు బావుటా ఎగరేయకుండా భారతీయ జనతా పార్టీలో చేరాలనుకోవడం ద్వారా చరిత్ర తనకు అందించిన ఒక అవకాశాన్ని వదులుకున్నారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా నిలిచిన చాలా రాజకీయ శక్తులు అటు కాంగ్రెస్ తోనూ, ఇటు భాజపాతోనూ కలవలేక, కెసిఆర్‌ను ఎదురొడ్డి నిలవలేక సతమతమవుతున్నాయి. కెసిఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేసి, ప్రత్యామ్నాయ తెలంగాణ పార్టీని ఏర్పాటుచేసే అవకాశాన్ని చేజేతులా ఈటెల జారవిడుచుకున్నారు. బిజెపిలో చేరడం ద్వారా దాదాపుగా తన రాజకీయ ఉనికిని తానే రద్దు చేసుకున్నారు. పోరాడే పటిమ ఉన్నప్పటికీ, కెసిఆర్ అపర చాణుక్యం అంతా తనమీద ప్రయోగించి ఎక్కడ తనను ఇబ్బందుల పాల్జేస్తారేమోనని కేంద్రం అండన చేరినట్టున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల వరకే ఆయన పేరు జనాలలో నానేది. అక్కడితో ఆయన కథ కంచికే. బిజెపిలో ఆయన నాయకత్వం చెలాయించడం తిరుమలలో బోడిగుండును పోల్చుకున్నట్టే ఉండగలదు.
మాటల ఓదార్పు కావలెను
Also read: వన్ సైడెడ్ లవ్!
ఈ వారం జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. అటునుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడం, ఇటునుంచి ముఖ్యమంత్రి ఢిల్లీ బయలుదేరడం చాలా మామూలు విషయాలుగా ప్రజలు భావించాలని వైకాపా కోరుకుంటోంది. చెవిలో జోరీగలాగా, చెప్పులో రాయిలాగా, కంటిలో నలుసులాగా ఇబ్బంది పెడుతున్న రఘురామ ఎపిసోడ్ కు తెరదించడానికి ముఖ్యమంత్రి తరలివెళ్లారని ఆయనంటే గిట్టని పత్రికలు రాశాయి. అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చర్చించడానికి వెళ్లారని స్వపక్ష పత్రికలు చెప్పాయి. వెంటవెళ్లిన అధికారులు మాత్రం పర్యటన వివరాలు చెప్పనే లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన పాలకులుగాని, అధికారులు గాని పెదవి విప్పకపోవడం పలురకాల ఊహాగానాల వ్యాప్తికి దారితీస్తోంది. సాధారణ ప్రజానీకానికే కాదు, పత్రికా రచయితలకు సైతం వీటి గురించి చెప్పే నాధుడు కరువయ్యాడు. అటు పార్టీ వ్యవహారాల గురించి, ఇటు ప్రభుత్వ వ్యవహారాల గురించి వైకాపా పార్టీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన శైలిలో అప్పుడప్పుడూ ఇచ్చే బ్రీఫింగులే అందరికీ అన్యధా శరణం నాస్తిగా తోస్తున్నాయి.
Also read: తెలుగు కథా దీపధారి అస్తమయం
జగన్ జమానాలో ఐదుగురు ఉపముఖ్యమంత్రులతో పాటు ఇరవై ఆరుమంది మంత్రులున్నారు. మొదట్లో ఐ అండ్ పిఆర్ మంత్రిగా పేర్ని నాని టీవీల ముందుకొచ్చి కొంత ప్రభుత్వ సమాచారం ఇచ్చేవారు. తరువాత ఆయన కూడా తెరమరుగయ్యారు. జగన్ చిరునవ్వులు చిందిస్తూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఆ కుర్చీలో కూర్చుని, కూర్చుని, కూర్చుని కనిపించడమే తప్ప (అప్పుడప్పుడూ ఆ సమావేశాల గదిలోకి సంతకం పెడ్తూ వెళ్తున్న క్లిప్ కూడా టీవీల్లో చూపిస్తుంటారు.) ప్రజలకు ఏవైనా నాలుగు సంగతులు నాలుగు కంటే తక్కువ సార్లే చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు. విశాఖపట్నానికి రేపో మాపో వెళ్లిపోతామని చెప్పడానికే మున్సిపల్ శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ టీవీ మైకుల ముందుకు వస్తుంటారు. ‘ఆ ఇద్దరి’ నీ తిట్టడానికి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, విద్యా సమాచారం ఇవ్వడానికి విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ అప్పుడప్పుడూ దర్శనమిస్తున్నారు. డొంకతిరుగుడు లేకుండా సూటిగా విషయ విశ్లేషణ చేసి ప్రజలను అర్థమయ్యేట్టు మాట్లాడగలిగేవారిలో అవకాశం వచ్చినా బుగ్గన రాజేంద్రనాధ్ (ఆర్థికమంత్రి) లాంటి వారు మాట్లాడడం లేదు. ఆర్థిక, రెవిన్యూ, ఆరోగ్యం తదితర అంశాల గురించి అనర్గళంగా మాట్లాడగలిగి కూడా అవకాశం రాక ధర్మాన ప్రసాదరావు లాంటి వారు మౌనంగా ఉంటున్నారు.
Also read: అతనికెందుకు పగ!
మరచిన మంత్రుల ముఖారవిందం
అన్నీ తానై ప్రభుత్వాన్ని నడిపిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాబెనెట్లో రెండేళ్లుగా కేవలం కనిపించక కొందరు మంత్రుల ముఖాలు కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోయారంటే అతిశయోక్తి కాబోదు. చిత్తూరుకు బయట ఎక్సైజ్ శాఖామాత్యులు కె. నారాయణస్వామిని, కడప గడప దాటి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా గాని, రహదారులు మరియు భవనాల మంత్రివర్యులు ఎం. శంకర నారాయణను అనంతపురం దాటిగాని, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి తానేటి వనితను కొవ్వూరు బయటగాని, గోదావరి జిల్లాలు దాటి బిసి సంక్షేమ శాఖామాత్యులు వేణుగోపాల కృష్ణగాని కనిపిస్తే గబుక్కున ఎవరైనా పోల్చడం కొంచెం కష్టమే. ఇప్పటికైనా సలహాదారులు కాకుండా, ప్రజలకు అందుతున్న సుపరిపాలన గురించి, ఆయా మంత్రిత్వ శాఖల విషయాల గురించి నేరుగా అసలు మంత్రులు మాట్లాడితే బాగుండునని జనం భావిస్తున్నారు. కొత్తరకం పాలన అంటే అధికారం ఒకచోట పోగుపడడం కాదని, వికేంద్రీకరణ చేస్తున్నామని యువనేత జగన్ ఆదర్శప్రాయంగా సెలవిచ్చారు. వికేంద్రీకరణ అంటే దేశ చరిత్రలో తొలిసారిగా సబ్బండ కులాల ప్రజలకు పదవులు ఇవ్వడం మాత్రమే కాదు. వారికి అధికారం కూడా అందించాలి. అసలు సిసలు రాజకీయ విప్లవం వచ్చేది బహుజనులకు పదవులు పంపకం చేసినంత మాత్రాన కాదు. ఆ పదవులనుంచి వారు ప్రజలను అడ్రస్ చేయగలగాలి. ప్రజా సమస్యలను పరిష్కరించగలగాలి.
Also read: హ్యాష్ టాగ్ మోదీ
ఢిల్లీలోనూ గల్లీ మాటలే
ఇక పార్లమెంటరీ స్థానాల విషయానికొస్తే మన రాష్ట్రానికున్న 25 స్థానాలలో కేవలం శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు స్థానాలలో మాత్రమే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలున్నారు. నరసాపురం సాంకేతికంగా వైకాపాదేగాని, ఆ పార్టీ వెబ్ సైట్లో నియోజక వర్గంతో పాటు ఆ ఎంపీ పేరు కూడా జాబితా నుంచి తొలగించారు. ఎంపీగా బర్తరఫ్ చేయమని స్పీకర్‌కు వినతి పత్రాలు పంపారు. అంటే 21 స్థానాలలో వైకాపాకు ప్రాతినిధ్యం ఉంది. ప్రభుత్వ సమాచారం అందివ్వడానికి గాని, ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడానికి గాని వీరిలో ఏ ఒక్కరి కలాన్నీ గళాన్నీ పార్టీ వినియోగించుకోవడం లేదని ఆ పార్టీ సానుభూతిపరులు కూడా భావిస్తున్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకులుగా అటు ఢిల్లీలో, ఇటు స్వరాష్ట్రంలో అనేక అంశాలపై పార్టీ తరపున, ప్రభుత్వం తరపున చక్కటి వాదనపటిమను వినిపించే వారు కనిపించడం లేదు. ప్రభుత్వాన్ని సమర్థిస్తూ విపులమైన సమాచారం గానీ, తిరుగులేని వాదనలు గానీ చేసేవారే కరువయ్యారని రాష్ట్ర ప్రజలు అనుమానపడుతున్నారు.
సోషల్ మీడియా పెచ్చరిల్లి సమాచారం కావలసిన దానికంటే ఎక్కువే లభిస్తున్న సమయంలో కీలక స్థానాలలో ఉన్నవారు వ్యూహాత్మక మౌనం పాటించినప్పుడు అధికార పక్షానికి అనర్థమే కాగలదు. పెదవులు బిగించుకు కూర్చోకుండా, అవసరమైనంత వరకైనా మాట్లాడాలి. ఏం మాట్లాడితే ఏం తంటా వస్తుందోనన్న భయమున్నప్పుడు అందుకు సంబంధించిన శిక్షణ పార్టీ నాయకత్వమే అందించాలి.
Also read: మేలుకో జగన్!