- కోవిడ్-19 నేపథ్యంలోనూ శాస్త్రవేత్తల కృషి అభినందనీయం
- 2020లో తొలి ప్రయోగం పీఎస్ఎల్వీ సీ-49, భారత్ సత్తాకు మరో నిదర్శనం
- విజ్ఞాన శాస్త్ర ఘని సి.వి రామన్ జయంతినాడే విజయం మరింత ప్రత్యేకం
అమరావతి, నవంబర్, 07; శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని ఇస్రో నుంచి పీఎస్ఎల్వీ సీ-49 నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లడం పట్ల పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. ఒకే వాహన నౌక ద్వారా స్వదేశానికి చెందిన ఒక ఉపగ్రహం సహా మరో 9 విదేశీ ఉపగ్రహాలను కక్షలోకి ఒకేసారి విజయవంతంగా ప్రవేశపెట్టడం పట్ల శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. భారత ఉపగ్రహం ఈవోఎస్ -01 రాకెట్ ప్రయోగం ద్వారా వ్యవసాయ రంగంలో మరింత మేలు జరగనుందన్నారు. అంతేకాదు, అటవీ, ప్రకృతి వైపరీత్యాలపైనా లోతైన అధ్యయనానికి ఉపయోగపడుతుందన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో సైతం ఐ.టీ రంగంలో లాగా వర్క్ ఫ్రమ్ హోమ్ , సోషల్ డిస్టన్స్ వంటి వాటికి అవకాశం లేని రాకెట్ ప్రయోగ రంగంలో అనుకున్న సమయానికి నింగిలోకి చేర్చిన ఇస్త్రో అధ్యక్షులు కె.శివన్ సహా, శాస్త్రవేత్తలందరి కృషి భారత్ దేశం మొత్తం షెల్యూట్ చేయదగ్గదని మంత్రి మేకపాటి వెల్లడించారు. ‘సైన్స్’ ప్రాణంగా జీవించిన విజ్ఞాన శాస్త్ర ఘని సి.వి రామన్ జయంతి నాడే ప్రయోగం విజయవంతమవడం భవిష్యత్ లో భారత్ మరోస్థాయిలో నిలిచేందుకు ఒక మెట్టుగా మారడం ఖాయమని మంత్రి గౌతమ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.