పోలవరం జలాశయంలో 194.6 టీఎంసీల నీరు నిల్వ చేయవచ్చుననీ, 2022 జులై నాటికి 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలియజేశారు.
కృష్ణా, గోదావరి డెల్టాల ఆయకట్టును స్థిరీకరించడం ద్వారా 38.41 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వవచ్చుననీ, ఈ ప్రాజెక్టు కింద 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుందనీ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఉభయగోదావరి జిల్లాల్లోని 373 గ్రామాలు ముంపునకు గురవుతాయనీ, ఆయా గ్రామాల్లోని 1,05,601 కుటుంబాలకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలని కూడా చెప్పారు.
కమిషన్ల కక్కుర్తి
2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి అప్పగించేవరకు అంటే 2014 జూన్ 8 నుంచి 2016,సెప్టెంబర్ 8 వరకు ప్రాజెక్టు పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.7,984.93 కోట్ల విలువైన పనులను చంద్రబాబు నామినేషన్ పద్ధతిలో కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు అప్పగించారనీ, ఇందులో ఒక్క హెడ్ వర్క్స్ లోనే రూ.3,489.93 కోట్ల విలువైన పనులను నామినేషన్‌పై అప్పగించారనీ తెలిపారు.
వందల కోట్లు ఆదా
పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ నిర్వహించి రూ.838.51 కోట్లను ఆదా చేశామనీ, వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 నాటికే పునరావాస కాలనీల్లో 3,110 గృహాలను నిర్మించారనీ, 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు టీడీపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఇంటిని నిర్మించలేదనీ అన్నారు. తొలి దశలో వచ్చే జూన్ నాటికీ 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 17,760 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు సిద్ధంగా జగన్ ప్రభుత్వం ఉన్నదనీ, 2014 జూన్ 8 మొదలుకుని 2019 మే 29 వరకు టీడీపీ ప్రభుత్వం సగటున 22 మీటర్ల స్థాయికి స్పిల్ వే పనులను మాత్రమే చేయగలిగిందనీ గుర్తు చేశారు.
తీవ్ర ప్రతిబంధకాలు
గోదావరి వరదల ఉధృతి, కరోనా మహమ్మారి విజృంభణతో తీవ్ర ప్రతిబంధకాల మధ్య కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం స్వల్ప కాలంలోనే స్పిల్ వేను 52 మీటర్ల స్థాయికి పూర్తి చేసింది. 2014 లో సీఎం అయిన వెంటనే వైఎస్ పోలవరం ప్రాజెక్టు కోసం అన్ని అనుమతులు తీసుకొని పనులను ప్రారంభించి దాదాపు 4 వేల కోట్లు ఖర్చు పెట్టారనీ, అంతకుముందుకి 9 సం సీఎం గ ఉన్న బాబు పోలవరం గురించి మాట్లాడిన పాపానపోలేదనీ విమర్శించారు.