- ఒప్పంద పరిమాణం కంటే అధికంగా సామగ్రి కొనుగోళ్లు
- సమీక్షలో మంత్రి సురేష్ ఆగ్రహం
అమరావతి: పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ‘నాడు-నేడు’లో భాగంగా చేసుకున్న ఒప్పందాలను అధికారులు ఉల్లంఘించారు. సచివాలయంలో బుధవారం మంత్రి ఆదిమూలపు సురేష్ నిర్వహించిన సమీక్షలో ఇది బహిర్గతమైంది. అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఒప్పంద పరిమాణం కంటే 15% వరకు ఎక్కువ సామగ్రిని మాత్రమే తీసుకునేందుకు అవకాశముంది. ఇంతకు మించితే కొత్తగా టెండర్లు పిలవాలి. అధికారులు నిబంధనను పట్టించుకోకుండా రెండింతలు, 50% అధికంగా సామగ్రి కొనుగోలుకు ఆర్డర్లు ఇవ్వడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.55 లక్షల ఫ్యాన్ల కొనుగోలుకు గుత్తేదారుతో ఒప్పందం చేసుకొన్నారు. కానీ 3.14 లక్షల ఫ్యాన్లకు ఆర్డర్లు ఇచ్చారు. పాత గుత్తేదారుకే వందశాతం అధికంగా ఆర్డరు ఇచ్చారు. విద్యార్థులు కూర్చునే 1.50 లక్షల బెంచీ(డ్యుయల్ డెస్క్)ల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకొని, 2.49 లక్షల సరఫరాకు ఆర్డరు ఇచ్చారు. ఇది ఒప్పంద పరిమాణానికి 50% అధికం.
గ్రీన్‌ఛాక్‌పీస్ బోర్డు టెండర్లలో మరో వింత చోటుచేసుకుంది. ఈ-టెండరులో ఎల్-1గా నిలిచిన వ్యక్తి 15 వేలు సరఫరా చేశారు. ఒప్పంద గడువు ముగిసిన తర్వాత ఎల్-2తో ఒప్పందం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం గడువు సమయంలోనే మొదటి గుత్తేదారును తప్పించి వేరొకరికి అవకాశం ఇవ్వాలి. ఒప్పంద గడువు ముగిసిన తర్వాత టెండరును రద్దు చేసి, కొత్త టెండరును పిలవాలి. కానీ… ఎల్-2తో 20వేల బోర్డుల సరఫరాకు ఒప్పందం చేసుకున్నారు. తర్వాత ఒప్పంద కాలపరిమితి ముగిసిందంటూ కొత్త టెండరు పిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 90 వేల వరకు బోర్డులు అవసరమున్నాయి.
మరుగుదొడ్లలో వినియోగించే బేసిన్లు ఇతరాలకు సంబంధించి 1.15 లక్షల సామగ్రి సరఫరాకు ఒప్పందం చేసుకోగా 1.75 లక్షల సామగ్రికి ఆర్డరు ఇచ్చారు. ఒప్పంద గడువు ముగిసినా పట్టించుకోవడంలేదు. సామగ్రి సరఫరాలోనూ జాప్యం జరుగుతోంది. జాప్యం వద్దు:‘నాడు-నేడు’లో సామగ్రి సరఫరా చేయని కంపెనీలకు నోటీసులు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. సమీక్ష ఆయన మాట్లాడుతూ పనులు పూర్తికావస్తున్నా మరుగుదొడ్ల సామగ్రి, ఫ్యాన్లు, డ్యుయల్ డెస్క్‌ల్లో పురోగతి లోపించిందని వ్యాఖ్యానించారు.