Tuesday, January 21, 2025

గొర్రిగేడ్డ రిజర్వాయర్ : గ్రానైట్ మైనింగ్  మహమ్మారి

పీఎస్ అజయ్ కుమార్

రైతులకు సాగునీరు ఇవ్వడానికి ప్రజలు కట్టే పన్నులతో నిర్మించేవి సాగునీటి ఆనకట్టలు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించే ఈ ఆనకట్టల కోసం రైతులు తమ భూములను వదులుకోవాల్సి ఉంటుంది. పదిమంది పోయినా వందమంది బాగుపడితే అదే చాలు అనుకునే సమాజం మనది. అందుచేతనే ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల సమాజంలో పెద్దగా ఆపేక్ష ఉండదు. అభివృద్ధి అనే యజ్ఞంలో బలి ఇచ్చేది పులిని కాదు  మేకల్నే.

116 ఎకరాల రైతుల సాగు భూమి ముంపుకు గురికాగా కట్టిన చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టు”గొర్రిగేడ్డ రిజర్వాయర్.” ఇది అనకాపల్లి జిల్లా, వడ్డాది మాడుగుల, అయినాడ అనే పంచాయతీలో ఉంది. గొర్రిగేడ్డ అనే ఒక జీవగడ్డపై ఈ రిజర్వాయర్ కట్టడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా AIARLA సేకరించిన సమాచారాన్ని బట్టి, ఈ రిజర్వాయర్ ద్వారా 600 ఎకరాలకు సాగునీరు అందుతుంది. పెద్ద గొర్రిగేడ్డ, చిన్న గొర్రెగేడ్డ, అయినాడ, తిరువాడ, కొండవీటి, సంగ్యం అనే గ్రామాలలో ఈ 600 ఎకరాల ఆయకట్టు ఉన్నట్టుగా నీటిపారుదల శాఖ వారి రికార్డు చూపిస్తుంది.

రిజర్వాయర్ వెనకాతల భాగంలో 15 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో, ఈ రిజర్వాయర్ యొక్క పరివాహక ప్రాంతం ఉంది. ఈ పరివాహక ప్రాంతం అధిక శాతం చింతపల్లి మండలంలోని కొండలకు వ్యాపించి ఉంది. ఈ కొండల మీద కురిసే నీరే రిజర్వాయర్ లోకి వచ్చే సాగునీరు.

అయితే, గొర్రిగేడ్డ రిజర్వాయర్ పరివాహక ప్రాంతం కొండలలో గత కొంతకాలంగా గ్రానైట్ మైనింగ్ కి అనుమతులిస్తున్నారు. నిజానికి అలాంటి అనుమతులు ఇవ్వరాదు. రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత, ఆ రిజర్వాయర్ని నిర్మించి, ఆయకట్టుకు నీరు ఇచ్చే నీటిపారుదల శాఖ పై ఉంది. అటువంటప్పుడు పరివాహక ప్రాంతంలో మైనింగ్ కి అనుమతిస్తూ ఉంటే నీటిపారుదల శాఖ అధికారులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?

సమాచార హక్కు చట్టం కింద  అడిగిన దానికి జవాబిస్తూ, గత మూడు సంవత్సరాలుగా రిజర్వాయర్లో నిండుగా నీరు ఉందని, ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది లేదు కనుక తాము ఆ విషయమై ఏమీ చేయలేదని చెప్పారు.

కానీ ఈరోజు కొండవీధి గ్రామంలో సాగు రైతులతో జరిపిన సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సాధారణంగా రిజర్వాయర్లు ఆదివాసీల భూమిపై నిర్మిస్తుంటారు . కానీ ఆయకట్టు ప్రాంతం మైదాన ప్రాంతాలకు చెందిన గిరిజనేతరులకు ఉపయోగపడుతూ ఉంటుంది. గొర్రిగేడ్డ రిజర్వాయర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఉన్న ఆకట్టులో ప్రధానంగా ఆదివాసీల భూములే ఎక్కువగా  ఉన్నాయి. అంటే ఇక్కడ లబ్ధిదారులు గిరిజనేతరులు కాదు. అనకాపల్లి జిల్లాలో మీరు ఏ నీటిపారుదల ప్రాజెక్టు తీసుకున్న నష్టపోయింది ఆదివాసీలు లబ్ధి పొందింది గిరిజనేతరులుగా కనిపిస్తారు. కానీ గొర్రిగేడ్డ రిజర్వాయరు మాత్రం 116 ఎకరాల భూమి ముంపుకు గురైనా, ఆదివాసి రైతుల సాగు భూములకు నీరు లభిస్తుంది.

నీటిపారుదల శాఖ వారు సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన వివరాలను వారికి చదివి వినిపించినప్పుడు ఆదివాసీ సాగురైతులు ఒకిoత ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 600 ఎకరాలకు సాగునీరు అందటం లేదని గత మూడు సంవత్సరాలుగా ఒక పంట పండించడం కూడా అతి కష్టంగా ఉందని వారు అంటున్నారు. గ్రానైట్ మైనింగ్ కంపెనీలు తమ మైనింగ్ వ్యర్ధాలను రిజర్వాయర్ లోకి నీళ్లు తెచ్చే కొండ గెడ్డలపై వేసి కప్పేస్తున్నాయి. వర్షాలు భారీగా పడినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఆ వరద నీటితో పాటు గ్రానైట్ వ్యర్ధాలు రిజర్వాయర్లోకి కొట్టుకు రావడం, గేడ్డల్ని కమ్మేయడం వారు గమనించారు. తమకు జీవనాధారమైన ఈ రిజర్వాయర్ మైనింగ్ కార్యకలాపాల వల్ల దెబ్బతింటుందని వారు అర్థం చేసుకున్నారు.

అయితే, మైనింగ్ లాబీలు, రెవెన్యూ, మైనింగ్, అటవీశాఖ, నీటిపారుదల శాఖ, స్థానిక బూర్జవా పార్టీ నాయకులు, అదే గ్రానైట్ కంపెనీలో చిన్న చిన్న ఉపాధులు పొందిన కొన్ని ఆదివాసి కుటుంబాలను అడ్డం పెట్టుకుని తమ చట్ట విరుద్ధమైన మైనింగ్ను కొనసాగిస్తున్నారు.

ఏదిఏమైనా ఇది ఆయకట్టు రైతులు యొక్క సాగునీటి హక్కు సమస్య. రిజర్వాయర్ యొక్క ఉనికి సమస్య. ఆ చుట్టుపక్కల కొండలలో ఉన్న పర్యావరణ సమస్య. అందుకే ఈరోజు కొండవీధి గ్రామానికి వెళ్లి అక్కడ సాగు రైతులకు సమాచారాన్ని, చట్టం ఏo చెబుతుందో ఆ వివరాలను తెలియజేశాం. ఇక అంతిమ నిర్ణయం ఆదివాసీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి వారు అందుకు సిద్ధమైతే అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం, అఖిల భారత ఆదివాసీ సంఘం వారికి అండగా ఉంటుంది.

జై ఆదివాసి… జై జై ఆదివాసి.. గొర్రిగేడ్డ రిజర్వాయర్ ను కాపాడుకుందాం…. ఆదివాసి రైతుల సాగునీటి హక్కులను కాపాడుకుందాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం.

P.S. అజయ్ కుమార్

జాతీయ కార్యదర్శి

అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles