- కీలకంగా మారిన మజ్లిస్ మద్దతు
- సాధారణ మెజారిటితో గట్టేక్కేందుకు టీర్ఎస్ వ్యూహం
జీహెచ్ఎంసీ మేయర్ డిప్యుటీ, మేయర్ ఎన్నికపై టీఆర్ఎస్ తీవ్ర కసరత్తు ప్రారంభించింది. బల్దియా ఎన్నికల్లో ఏ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించలేదు. టీఆర్ఎస్ 56 స్థానాలలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినా మేయర్ ఎన్నికకు బలం సరిపోదు. ప్రస్తుత పాలకవర్గం బుధవారం (ఫిబ్రవరి 10) తో ముగియనుంది. ఆమరుసటి రోజే కొత్త పాలకవర్గం ఏర్పాటుకు ఎన్నికల సంఘం ముహూర్తం నిర్ణయించింది. పూర్తిస్థాయి మెజారిటీ లేకపోవడంతో కో-ఆప్షన్ సభ్యుల బలంతో టీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే దీనికి భిన్నంగా టీఆర్ఎస్ మాత్రం సాధారణ మెజారిటీతోనే మేయర్ పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ ఎన్నిక జరగనుంది. ఆ సమయంలో సభ్యులను ఓటు హక్కు వినియోగించుకోకుండా ఆదేశాలు ఇస్తుందా అన్న విషయం తేలాల్సిఉంది.
కీలకంగా మజ్లిస్ :
టీఆర్ఎస్, బీజేపీలు వైరి పక్షాలు కావడంతో మేయర్, డిప్యుటీ మేయర్ ఎన్నికపై మజ్లిస్ పార్టీ మద్దతు కీలకంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు మిత్రపక్షాలుగా ఉన్న టీఆర్ఎస్, మజ్లిస్ లు ఎన్నికల ప్రచారంలో మాత్రం బద్ధ శత్రువుల్లా వ్యవహరించాయి. అంతేకాదు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ ఎంపికపై మజ్లిస్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read: హైదరాబాద్ సంస్కృతికి సముజ్జ్వల ప్రతీక నరేంద్ర లూథర్
మజ్లిస్ కు 44 మంది కార్పొరేటర్లతో పాటు 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఉంది. మేయర్, డిప్యుటీ మేయర్ ఎన్నికకు ఓటు హక్కు ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 193 కాగా మేజిక్ ఫిగర్ మాత్రం 97. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకుంటే టీఆర్ఎస్ బలం 88 మాత్రమే ఉంది. దీంతో మజ్లిస్ మద్దతు అనివార్యం కానుంది.
ఆచితూచి వ్యవహరిస్తున్న బీజేపీ :
ఇక బీజేపీ మజ్లిస్ లు కలిసే అవకాశాలు లేవనే చెప్పాలి. అయితే మేయర్, డిప్యుటీ మేయర్ ఎన్నికలో మజ్లిస్ పాల్గొంటుందా లేదా అన్నది సందేహంగా మారింది. దీనిపై మజ్లిస్ నేతలు కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్ ఎంపిక కోసం జరిగే ప్రత్యేక సమావేశంలో పాల్గొనడమా లేక గైర్హాజరై పాత మిత్రుడికి పరోక్ష సహకారం అందించడమా అన్ని దానిపై ఎంఐఎం తర్జనభర్జన పడుతోంది. ఎలాగైనా మరో వైపు మేయర్ డిప్యుటీ మేయర్ పదవులను తామే కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఈ ఎన్నిక ఆపార్టీకి పరువు ప్రతిష్ఠలతో ముడిపడిఉంది.
Also Read: ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మంగా మారిన సాగర్ ఉపఎన్నిక
ఎంఐఎం, బీజేపీ చేతులు కలిపితే మాత్రం టీఆర్ఎస్ కు చుక్కలు కనపడటం ఖాయం. ఆ రెండు పార్టీలు జట్టు కడితే టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ గా ఎన్నిక కావడం కష్టమవుతుంది. అయితే ఇది జరిగే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఒక వేళ ఎంఐఎం, బీజేపీలు విడి విడిగా అభ్యర్థిని బరిలో దింపితే టీఆర్ఎస్ విజయం నల్లేదు మీద నడకలా సాగుతుంది.