చలన చిత్ర నటుడిగా రాణిస్తునే నాటక రంగం కోసం అహరహరం శ్రమించిన వారిలో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ముందు వరుసలో ఉంటారు.ముఖ్యంగా రంగస్థలంపై ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు, అలా ప్రదర్శనలిచ్చి తారపథాన్ని అందుకున్న ఎందరో నటీనటులను చరిత్రను, జీవిత విశేషాలను అక్షరబద్ధం చేయాలనుకున్నారు.`అగ్రనటులు, చాలా మంది ప్రముఖ నటుల మాదిరిగా చలనచిత్రాలలో నటనకు, ఆర్జనకే పరిమితం కావచ్చు.కానీ మహోజ్వలంగా వెలిగిన ఆంధ్రనాటకరంగ చరిత్ర మసకబారకూడదన్న భావనతో..`ఎందరో మహానటులు ప్రేక్షకుల నీరాజనాలందుకున్నారు.అటువంటి వారు లేకుంటే ఈనాడు మనం లేము. మనం లేకపోతే మన ముందు తరం లేదు` అనే యోచనతో 1960 దశకంలోనే సమాచార సేకరణ, రచనకు పూనుకున్నారు.ఒకవైపు చలనచిత్రరంగంలో ఉత్తమ నటుడిగా వాసికెక్కుతూ, మరోవంక తనలోని కళా జిజ్ఞాసకు, రచనా పిపాసకు రూపుకట్టేప్రయత్నం చేశారు. అలా ఆవిర్భవించినవే `ఆంధ్ర నాటక రంగ చరిత్ర`, `నటరత్నాలు`. ఒక వ్యవస్థ చేయవలసిన దానిని ఒంటిచేతితో నిభాయించుకువచ్చారు.మొదటి గ్రంధాన్నిఅక్కినేని నాగేశ్వరరావుకు, రెండవ దానిని నందమూరి తారక రామారావుకు అంకితం ఇచ్చారు.`ఆంధ్ర నాటక రంగ చరిత్ర` గ్రంథం `తెలుగు భాషా సమితి`పురస్కారాన్ని, `తెలుగువారి జానపద కళారూపాలు` గ్రంథం తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాన్ని అందుకున్నాయి.
Also Read: ఎంఎల్సీ ఎన్నికలు: టీఆర్ ఎస్ అభ్యర్థిగా పీవీ కుమార్తె
చేసినపాపం…
`చేసిన పాపం చెబితే పోతుంది` అనే సామెతను నిజం చేస్తూ, ఈ గ్రంథాల రచనా సామగ్రి సేకరణలో తాను పాల్పడిన తప్పులను బహిరంగంగా అంగీకరించారు. గ్రంధ రచన ప్రక్రియలో భాగంగా నాటక సమాజాలు, నటీనటుల వివరాలు, ఛాయాచిత్రాల కోసం ఆంధ్రదేశం నలుచెరగులు గాలించారు. కొందరు తెలిసిన వారి ద్వారా సేకరించగలిగారు. అరుదైన ఫొటోల కోసం గ్రంథాలయల్లోని పత్రికలు,ప్రధానంగా ప్రత్యేక సంచికలను తిరగేయవలసి వచ్చింది.తన పనికోసం వాటిని శాశ్వతంగా ఇవ్వరు. `మరేం చేయాలి? గ్రంథాలయంలో చేరి వాటిని చదువుకోవడానికి తీసుకున్నట్లు తీసుకుని సన్నని కత్తెరతో చీమ చిటుక్కుమనకుండా, ఎవరూ చూడకుండా తస్కరించే వాణ్ణి. గుండె దడదడలాడేది. చేస్తున్నది తప్పని తెలుసు. కానీ ఏం చేయను? ఆ ఫొటో కావాలి. అవి బీరువాల్లో పురుగులు కొట్టి నాశనమై పోకూడదు. ఆ మహానటుల జీవితాలు, నటనా ప్రతిభ దేశానికి తెలియచెప్పాలి? అందుకే ఈ దొంగతనానికి పూనుకునేవాణ్ణి. కానీ చేసేది తప్పు. ఇది తెలిస్తే నా పరువేమిటి? అనిపించేది`అని పశ్చాత్తాప మనసుతో ప్రకటించేవారు.హేతువాదిగా తండ్రికి తద్దినం పెట్టలేని తనకు…దేశం, కుటుంబ సభ్యులే మరిచిపోయిన వారిని వెలుగులోకి తేవాలన్న తాపత్రయం ఎందుకు? అనిపించేదట. అంతలోనే ` వారు నా కంటే గొప్ప నటులు. వారికీ, నాకూ ఉన్నది సంస్కృతీ, కళా సంబధమే. పైగాఎవరూ చేయని, చేయలేని పనిని నేను చేస్తున్నాను అనే సంతృప్తి. అందుకే నా బతుకుతెరువు కూడా చూసుకోకుండా జీవితంలోని కొన్ని వేల గంటలు ఇందుకు వినియోగించాను`అని చెప్పేవారు.
Also Read: హాస్య కృష్ణ `మోహనీ`యం
జీవితవిశేషాలు:
గుంటూరు జిల్లా లింగాయపాలెంలో మిక్కిలినేని వెంకయ్య,సౌభాగ్యమ్మ దంపతులకు 1916 జూలై 7వ తేదీన పుట్టిన రాధాకృష్ణమూర్తి కృష్ణా జిల్లా కోలవెన్నులో పెరిగారు. అక్కడే ప్రాథమిక విద్య, పునాదిపాడులో ఉన్నత పాఠశాల చదువు సాగింది. మూఢనమ్మకాలను అధిగమించి బతికిబట్టకట్టానని చెప్పేవారు. ఆయన పుట్టినప్పుడే కృష్ణానదికి వరదలు వచ్చి గొడ్డూగోదా కొట్టుకుపోయాయట.దాంతో ఆయన పుటకే అరిష్టమంటూ `నోట్లో వడ్లగింజవేసి గుటుక్కుమనిపిద్దాం`అని ఒక బంధువు ఇచ్చిన సలహాను మేనత్త అడ్డుకోవడంతో ఈ ప్రపంచాన్ని చూసే భాగ్యం దక్కిందని చెప్పేవారు.
చిత్రకళ మీదున్నఆసక్తితో బందరు జాతీయ కళాశాలలో చేరారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వ ఒత్తిడితో అది మూతపడడంతో చిత్రకళాభ్యాసం మధ్యలో ఆగిపోయింది. విజయవాడలో కొంతాకాలం ఫొటోగ్రఫీ నేర్చుకున్నారు. పునాదిపాడు సందర్శనకు వచ్చిన గాంధీజీ ప్రసంగాని ఉత్తేజితులై అప్పటి నుంచి ఖద్దరు కట్టసాగారు.మొదటిలో కాంగ్రెస్ అభిమాని అయినప్పటికీ, ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుల గురించి చదివి వామపక్షం వైపు ఆకర్షితులయ్యారు. ఉద్యమాల్లో నిమగ్నమైనా పశువైద్య శాస్త్రంలో డిప్లోమో పొంది కొంత కాలం వైద్యం చేశారు
హోటల్ యజమానిగా:
విజయవాడలో ఒక మిత్రుడి సహకారంతో `చౌదరి విలాస్` పేరిట హోటల్ నడిపారు. పూటకూళ్ల సంస్కృతి కొనసాగుతున్న కాలంలో టేబుల్ మీల్స్ ప్రవేశపెట్టిన రెండవ హోటల్ (మొదటిది `కామ్రెడ్స్ హోటల్)గా నిలిచింది. `టేబుల్ మీల్స్`కు నాలుగణాలు, కింద కూర్చొని తింటే మూడణాలు తీసుకునేవారట. భోజనం చేసిన తరువాత వినియోగదారులకు మడత మంచాలు ఏర్పాటు ప్రత్యేకతే కాకుండా చర్చానీయాంశమైందట.
Also Read: కథామురిపాల`గుమ్మి` పాలగుమ్మి
ప్రజానాట్యమండలితో…
ప్రజానాట్యమండలి వ్యవస్థాపకులలో ఒకరుగా శిక్షణ శిబిరాలు నిర్వహించడంతో పాటు హరికథ, బుర్రకథ, వీధినాటకం, జముకుల కథ, పిచ్చికుంట్ల కథ, సుద్దుల, కోలాటాలు, డప్పులు తదిరత ప్రాచీన కళా రూపాలు ప్రదర్శించారు. ప్రజానాట్య మండలి దళాలను తయారు చేసి ఆంధ్రదేశం నలు చెరగులా ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర రాష్ట్రేతరాలలో మాభూమి, ముందడగు, పరివర్తన, ఈనాడు, పోతుగడ్డ, గాలిమేడలు మొదలైన ప్రసిద్ధ నాటకాలు ప్రదర్శించి విశేష మన్ననలు అందుకున్నారు. నైజాం ప్రభువుల అరాచకాలను దుయ్యబడుతూ ప్రదర్శించిన `మాభూమి` నాటకంలో ఆయన భార్య సీతారత్నం నటించారు. స్త్రీపాత్రలను పురుషులే పోషిస్తున్న కాలంలో ఆమె నటించడం చర్చనీయాంశమై, ఆక్షేపణలు ఎదురైనా లక్ష్య పెట్టలేదు.బొంబాయి, షోలాపూర్, పూణె, అహ్మదాబాద్ లాంటి చోట్ల ఈ నాటకాన్ని వందలసార్లు ప్రదర్శించారు.బొంబాయిలో నాటకాన్ని చూసిన బలరాజ్ సహానీ, పీసీ జోషి లాంటి ప్రముఖులు `అసలైన తెలంగాణ వనితను సాక్షాత్కరింపచేశావు` అని సీతారత్నమ్మను అభినందించారట.
ఆంధ్ర నాటక కళాపరిషత్తు కార్యవర్గ సభ్యులుగా,సలహా సభ్యులుగా అనేక సంవత్సరాలు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ సభ్యులుగా, మద్రాసు సెంట్రల్ లెదర్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ తోలుబొమ్మల విభాగంలో సలహా సంఘం సభ్యులుగావ్యవహరించారు. విజయవాడలో `ఆంధ్రా ఆర్ట్ క్రియేటర్స్`స్థాపనలో కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చలనచిత్ర నంది పురస్కార కమిటీలలో మూడుసార్తు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
Also Read: అద్వితీయ ముఖ్యమంత్రి
పురస్కారాలు:
మిక్కిలినేనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పురస్కారాలు లభించకపోయినా అనేక సాంస్కృతిక సంస్థలు సత్కరించుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమి `కళా ప్రవీణ1` బిరుదును, ఎన్టీఆర్ ఆత్మగౌరవ పురస్కారం, తెలుగువెలుగు పురస్కారాన్ని అందచేసింది. రాజాలక్ష్మీ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం, మద్రాసు తెలుగు అకాడమీ, సంగీత నాటక అకాడమి పురస్కారం, చిత్తూరు నాగయ్య, బళ్లారిరాఘవ, జూలూరు వీరేశలింగం, డాక్టర్ టి.సుబ్బిరామిరెడ్డి కళాపీఠం, యార్లగడ్డ వెంకన్న చౌదరి పురస్కారాలు ఆయన అందుకున్నవాటిలో కొన్ని.ఆంధ్ర విశ్వకళాపరిషత్తు ’కళా ప్రపూర్ణ`తో సత్కరించింది. ప్రపంచవ్యాప్తంగా కళారంగంలో 500 మంది ప్రముఖులలో మిక్కిలినేనిని ఒకరిగా గుర్తించిన అమెరికన్ బయోగ్రాఫిక్ సంస్థ (1997) `టు థౌజండ్ మిలీనియం ప్రముఖుని`గా స్వర్ణపతకాన్ని బహుపకరిచింది.
చలనచిత్ర ప్రస్థానం:
కోలవెన్నుకే చెందిన బాల్యమిత్రుడు కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వం వహించిన `దీక్ష` (1951)తొ చలనచిత్ర రంగం ప్రవేశం చేసిన మిక్కిలినేని సుమారు నాలుగున్నర దశాబ్దాల పైచిలుకు కాలంలో వందలాది చిత్రాలలో నటించారు.కమ్యూనిస్టుగా ముద్రపడడంతో వేషాలు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు విముఖంగా ఉండేవారు.ఆ సమయంలో ఎన్టీరామారావు అండగా నిలచి తాను నటించే, నిర్మించే ప్రతిచిత్రంలోనూ అవకాశం కల్పించారు.అలా ఆయనతో మిక్కిలినేని సుమారు 150 చిత్రాల వరకు నటించారు. `పలానా వేషమే వేస్తానని కూర్చోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న దర్శక నిర్మాత , నటుడు వైవీ రావు సలహాను చివరిదాకా పాటించారు. పౌరాణికి, జానపద చిత్రాలు మిక్కిలినేనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. జనకుడు, భీష్ముడు, ధర్మరాజు లాంటి సాత్విక పాత్రలు, జానపదాల్లో రాజు, రాజగురువు పాత్రలు పోషించారు. ఆయా చిత్రాలలో నటనా గాంభీర్యంతో తమదైన ముద్ర వేశారు.
Also Read: దుర్భాషల `ఘనులు`
మొదటి నుంచి క్రమశిక్షణ జీవితంతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ 1997లో చెన్నై నుంచి విజయవాడ చేరిన మిక్కిలినేని ప్రశాంత జీవితం గడిపారు. అంతవయసులోనూ నవ్వుతూ నిశ్చింతగా ఎలా గడుపుతున్నారన్న ఆత్మీయుల ప్రశ్నకు ’తృప్తి మూలంగా` అని క్లుప్తంగా,నవ్వుతూ బదులిచ్చేవారు.స్థానికంగా సభలు,సమావేశాలలో పాల్గొనేవారు. త 96వ ఏట ఫిబ్రవరి 23న కన్నుమూశారు.
( ఈ నెల 23న మిక్కిలినేని వర్ధంతి)